Jan 29,2023 09:44

పాకకళ పుట్టుక మానవ చరిత్రలో ఒక ముఖ్యమైన మలుపును సూచిస్తుంది. మానవ జీవన పరిణామంలో వండుకుని, తినడం అనే దానిని అత్యంత ముఖ్యమైన ఆధునిక పరిణామంగా పరిగణిస్తాము. మాంసం, చేపలు, కూరగాయలు పచ్చివిగా తినడం కంటే వండటం వలన చాలా లాభాలున్నాయి. ఆహారాన్ని నమలడం తేలిక. సులభంగా జీర్ణమవుతాయి. నోటికి రుచిగా ఉంటుంది. వ్యాధికారక క్రిములు చనిపోతాయి. శరీర ఎదుగుదల బాగుంటుంది. మెదడు సమర్థవంతంగా పనిచేస్తుంది. కాబట్టి వండిన ఆహారాన్ని తినడం చాలా సురక్షితం.

1


అంతరించిపోయిన మానవ జాతులైన హోమో సేపియన్స్‌, నియాండర్తల్‌ జాతులు నివసించిన కాలంలో అంటే దాదాపు 3,00,000 నుండి 4,00,000 సంవత్సరాల నాడు నిప్పును ఉపయోగించినట్లు ఉవాచ. దానికి ఆధారం ఇజ్రాయెల్‌ క్యూసెమ్‌ గుహలో జరిపిన పరిశోధనలు. అంతేకాక మరికొన్ని ఆధారాల గురించిన అధ్యయన వివరాలు నేచర్‌ ఎకాలజీ అండ్‌ ఎవల్యూషన్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. 1,70,000 సంవత్సరాల క్రితం నియాండర్తల్‌లు, ప్రారంభ హోమో సేపియన్‌లు కూరగాయలు, మాంసాన్ని వండినట్లు కచ్చితమైన సాక్ష్యం ఉందని సూచించింది ఆ అధ్యయనం. శాస్త్రవేత్తలు సైతం ఆ ఆధారాల ద్వారా దాదాపు రెండు లక్షల సంవత్సరాల నుంచి ఆహారాన్ని వండి, తినడం తెలుసునని అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకూ దానినే ప్రామాణికంగా తీసుకున్నామని అన్నారు.

2
  • వాదనేంటి..?

అయితే పూర్వం నుండీ నిప్పును ఉపయోగించడం, వంట విషయాలలో పురావస్తు శాస్త్రజ్ఞుల మధ్య వివాదాస్పద పరిస్థితి కొనసాగుతూ వచ్చింది. అదేమంటే పురాతన పొయ్యిని వెచ్చదనం కోసం మాత్రమే వాడేవారని కొందరు, కాదు కాదు ఆహారాన్ని వండటానికి ఉపయోగించారని మరికొందరి వాదనలుగా ఉండేవి.

1


ఇదిలా ఉండగా ఇటీవల పరిశోధనల్లో కొత్త ఆధారాలు.. సరికొత్త విషయాలను చూపుతున్నాయి. నేచర్‌ ఎకాలజీ అండ్‌ ఎవల్యూషన్‌లో ప్రచురించబడిన ఆధునిక కొత్త అధ్యయన వివరాల ప్రకారం హోమో సేపియన్స్‌, నియాండర్తల్‌ జాతుల కంటే ముందున్న హోమో ఎరెక్టస్‌ జాతి 7,80,000 సంవత్సరాల క్రితమే వంట చేసినట్లు ఆధారాలు సూచిస్తున్నాయి. ఆధునిక ఇజ్రాయెల్‌లోని ఉత్తర జోర్డాన్‌ వ్యాలీలో ఉన్న ఒక పురావస్తు ప్రదేశంలో అధ్యయన బృందం ఈ ఆధారాలను కనుగొంది. గెషర్‌ బెనోట్‌ యాకోవ్‌ అని పిలువబడే ఈ ప్రదేశం సుమారు 7,90,000 సంవత్సరాల క్రితం నాటిదని బృందం తెలిపింది.
అచెలియన్‌ సంస్కతి అని పిలవబడే హోమో ఎరెక్టస్‌ కమ్యూనిటీలు ఈ ప్రాంతంలో నివసించినట్లు ఆధారాలున్నాయి. ఈ కమ్యూనిటీలు పెద్ద గ్రూపుగా ఉండి, పండ్లు, కూరగాయలు, సమీప పాలియో-లేక్‌ హులా నుండి మంచినీటి చేపలతో సహా విభిన్నమైన ఆహారాన్ని తీసుకునేవి. అక్కడ కనిపించిన చేపల పళ్ళు, మిగిలిన అవశేషాలు కాలిపోయి ఉన్న తీరు పురాతన వంట పద్ధతులను వెల్లడిస్తున్నాయి.

4
  • ముఖ్య ఆహారం..

జౌహర్‌ పరిశోధనల ప్రకారం, ఆదిమ మానవులు ఆఫ్రికా నుండి మంచినీటి సరస్సులు, నదుల ద్వారా వలస వచ్చారు. వారి నివాస స్థలాలు, కార్యకలాపాలు ఎప్పుడూ మంచినీటికి సమీపంలోనే కనిపిస్తాయి. 'వాస్తవానికి వారు నీటి వనరు కోసమేకాక, స్థిరమైన ఆహార వనరుగా ఉన్న చేపలు ఆ మంచినీటిలో లభ్యమవటం కారణమని నేను భావిస్తున్నాను' అని జౌహర్‌ అన్నారు. చేపలు ప్రోటీన్‌లు, ఇతర పోషకాలను కలిగి ఉండి, ఏడాది పొడవునా లభ్యమౌతాయి. చేపలను సంవత్సరం అంతా వండినట్లు ఆనవాళ్ళు ఇక్కడున్నాయి. కాబట్టి అవే ఆహారంలో ముఖ్యమైన భాగమని సూచిస్తున్నాయి' అని జౌహర్‌ విపులీకరించారు.
'సుమారు ఒకటి, రెండు మిలియన్‌ సంవత్సరాల క్రితం, ప్రారంభ మానవులు పొడవైన శరీరాలు, పెద్ద మెదడులను కలిగి ఉండేవారు. వారు క్యాలరీలు అధికంగా ఉన్న ఆహారాన్ని వండి, తీసుకోవడం వల్లనే ఈ మార్పు జరిగిందని వాషింగ్టన్‌లోని కొలంబియన్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌లో ఆంథ్రోపాలజీ ప్రొఫెసర్‌ డేవిడ్‌ బ్రౌన్‌ అన్నారు.
'హోమో ఎరెక్టస్‌ చరిత్ర కొత్త అధ్యయనాన్ని మన ముందుంచింది. ఇప్పుడు ఈ తేదీని 6,00,000 సంవత్సరాల వెనక్కి సెట్‌ చేసి, ప్రాచీన మానవుల పరిణామ చరిత్రను పునర్నిర్మించడంలో అనేక చిక్కులు ఎదురౌతాయి' అని లండన్లోని ది నేచురల్‌ హిస్టరీ మ్యూజియం అధ్యయన సహ రచయిత జెన్స్‌ నజోర్కాకి చెప్పారు.

  • చేపలను ఎలా పట్టుకునేవారు?

'అప్పటికి ఫిషింగ్‌ టెక్నాలజీకి సంబంధించిన ఆధారాలేమీ లేవు. ఆ ప్రదేశంలో 5,000 చేప దంతాలను కనుగొన్నారు' అని బ్రౌన్‌ చెప్పారు. 'చిత్తడి నేలల్లో నీరు చాలా తక్కువ ఉంటుంది, కాబట్టి ప్రజలకు చేపలను పట్టుకోవడానికి ప్రత్యేకమైన సాంకేతికత అవసరం లేదు. ఇప్పటికీ నదులలో చేతులతోనే చేపలను పట్టుకుంటారని, వారూ అదే విధానం అవలంభించి ఉంటారని మేము భావిస్తున్నాము' అని జౌహర్‌ చెప్పారు.

3
  • గెషర్‌ బెనోట్‌ యాకోవ్‌ ప్రదేశంలో..

అధ్యయన బృందానికి గెషర్‌ బెనోట్‌ యాకోవ్‌ వద్ద నిప్పుగూళ్లు, రెండు మీటర్ల పొడవున్న భారీ కార్ప్‌ చేపల అవశేషాలు హులా సరస్సుకు సమీపంలో కనిపించాయి. బృందం ప్రత్యేకంగా ఈ చేపల ఫారింజియల్‌ దంతాల అవశేషాల (షెల్‌ వంటి గట్టి పదార్థాన్ని రుబ్బడానికి ఉపయోగించేవి) పై దృష్టి సారించి విశ్లేషించింది. ఆ ఫారింజియల్‌ టూత్‌ ఎనామెల్‌ యొక్క జియోకెమికల్‌ విశ్లేషణ, దంతాల స్ఫటిక నిర్మాణ విశ్లేషణల ద్వారా వాటిని 500 డిగ్రీల సెల్సియస్‌ (932 డిగ్రీల ఫారెన్‌హీట్‌) ఉష్ణోగ్రతలో వండినట్లు బృందం గుర్తించింది.
ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవీవ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యయన సహ రచయిత ఇరిట్‌ జౌహర్‌, 'చేపలను కాల్చడం మాత్రమేకాక, నియంత్రిత ఉష్ణోగ్రత వద్ద వండినట్లు సూచిస్తుంది' అని తెలిపారు. 'దీన్నిబట్టి ఎరెక్టస్‌కు అగ్నిని నియంత్రించి, ఆహారాన్ని వండగల అభిజ్ఞా సామర్థ్యం ఉందనడానికి ఇదే సాక్ష్యం' అని ఆయన వ్యాఖ్యానించారు. అంటే మునుపటి అంచనాల కంటే 6,00,000 సంవత్సరాలకు ముందుగానే ఈ పరిణామం జరిగింది. 'ప్రారంభ మానవులు వేరే ఆహారం దొరకనప్పుడు మాత్రమే చేపలను తినేవారని అనుకుంటారు. ఇది నిజం కాదని సూచిస్తుంది మా అధ్యయనం అంటారు ఈయన.