
ప్రజాశక్తి - పిఎం.పాలెం, ఎంవిపి కాలనీ (విశాఖపట్నం) : విశాఖపట్నంలోని ఎసిఎ - విడిసిఎ డాక్టర్ వైఎస్‌ఆర్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. కోస్తాంధ్రలో గురువారం నుంచి చిరు జల్లులు పడుతున్న నేపథ్యంలో శనివారం స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం పడింది. భారీ వర్షాలకు అవకాశముందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో క్రీడాభిమానుల్లో కొంత ఆందోళన నెలకొంది. ఈ మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నం 1:30 నుంచి రాత్రి 10:30 వరకూ జరగనుంది. ఎంతటి పెద్ద వర్షం పడినా అరగంటలో మైదానంలో వర్షం నీరు బయటకు పోయేలా అండర్ గ్రౌండ్ డ్రైన్ సిస్టమ్ ఇక్కడ ఉందని స్టేడియం నిర్వాహకులు చెబుతున్నారు. ఈ స్టేడియం 28 వేల సీట్ల సామర్థ్యం కలిగి ఉంది. టికెట్ల విక్రయాలు ప్రారంభమైన కొద్ది గంటల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. మరోపక్క ఈ అంతర్జాతీయ వన్డే క్రికెట్ మ్యాచ్‌కు పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు నిర్వహిస్తోంది.
- విశాఖ చేరుకున్న ఆటగాళ్లు
మొదటి మ్యాచ్ ముగిసిన అనంతరం శనివారం సాయంత్రం భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు ముంబయి నుంచి విశాఖకు చేరుకున్నారు. క్రికెటర్లు విశాఖలో అడుగుపెట్టే సమయానికి వర్షం స్వాగతం పలికింది. ఇరు జట్ల ఆటగాళ్లు విమానాశ్రయం నుంచి నేరుగా బస ఏర్పాటు చేసిన రాడిసన్ బ్లూ హోటల్‌కు చేరుకున్నారు.