Nov 28,2022 07:38

''చాందసత్వపు చీకటులు తొలగించి,
లోకపు రీతి మార్చగ
ఆధునిక భావాలదివ్వెల
వెలుగులందించి
అభ్యుదయ పథమందు జాతిని
నడుపగా చేబూని కలమును
ఆయుధముగా ప్రయోగించిన
కవీ, జోహారు''
ఈ రోజు (27/11) గురజాడ కార్యరంగమూ, సాహిత్య క్షేత్రమూ అయిన విజయనగరంలో 'గురజాడ గౌరవయాత్ర' పేరుతో ఆ మహాకవి ఇంటినుంచి గురజాడ విగ్రహం దాకా గురజాడ అభిమానులు కాలినడకన వెళ్ళి గురజాడ వర్థంతి రోజు (30/ 11) 'గురజాడ సమాఖ్య' గురజాడ పురస్కారాన్ని చాగంటి వారికి ఇవ్వడం పట్ల తమ అసమ్మతిని తెలియజేసే కార్యక్రమం చేపట్టేరు. (ఇటువంటి యాత్ర జరపాల్సి రావడం దురదృష్టకరం). గత కొద్ది రోజులుగా ఈ విషయంలో ఫేస్‌బుక్‌లోనూ, వాట్సాప్‌ గ్రూపుల్లోనూ చర్చలూ, వాదనలూ జరుగుతున్నాయి. ఖండన మండనలు సాగుతున్నాయి. వ్యవహారిక భాషోద్యమ కాలంలో గురజాడ అసమ్మతి పత్రం ప్రకటించేడు. వందేళ్ళు దాటేక ఇప్పుడు గురజాడ కోసం గురజాడ సాహిత్యాభిమానులు ప్రకటిస్తున్నారు అసమ్మతి పత్రం.
           ఒక మహనీయుని పేరుతో పురస్కారం ప్రకటించాలంటే ఆ మహనీయుని భావజాలానికి అనుగుణ్యమైన వారినే ఎంపిక చేయడం సమంజసం. ఒక మహౌన్నతమైన వ్యక్తి పేరుతో పురస్కారం ఏర్పాటు చేయడమెందుకంటే వారి ఆశయాల్ని కొనసాగించడానికీ, వాటిని ప్రజల్లో వ్యాపింపజేయడానికీ. కానీ గురజాడ భావజాలానికీ, ఆలోచనలకీ వారి సంస్కరణ భావాలకూ వ్యతిరేకమైనవారిని, ఎంపిక చేయడం గురజాడ అభిమానులను సహజంగానే బాధ కలిగించింది. గతంలోనూ ఇలా ఎంపిక చేయడాన్ని వ్యతిరేకిస్తూ పత్రికా ముఖంగా తమ అసమ్మతిని తెలియజేస్తూ వచ్చేరు. ఇప్పుడూ అదే చేస్తున్నారు. ఐనా పురస్కార ప్రదాతలు తమ చర్యల్ని సమర్థించుకోడానికి వ్యర్థ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
        వారి సమర్థింపుల కోసం గురజాడ దైవ భక్తుడనీ, సంప్రదాయ వాదనీ చెప్పుకొచ్చేరు. అందుకు ఆధారం కన్యాశుల్కంలోని చివరి అంకంలో సౌజన్యారావు పంతులు చేతిలోని భగవద్గీత. గురజాడ ఇంట తులసికోట. తులసికోట వుంటేనో, దేవుడి పటం ఉంటేనో ఆ వ్యక్తి ఆస్థికుడని , భక్తుడని నిర్ణయం చేసీడమేనా? కథలోనో, నాటకంలోనో, నవలలోనో సృజనకారుడు ఎన్నో పాత్రల్ని సృష్టిస్తాడు. ఆ పాత్రల అభిప్రాయాలు రచయిత అభిప్రాయాలుగా భావించడం సరైందేనా? ఒక పాత్ర హంతకుడైతే రచయితని హంతకుడని నిర్ధారణ చేసేస్తారా? .. ఆయా పాత్రల సామాజిక స్థాయిననుసరించి సంభాషణల ద్వారా తాను నమ్మిన సత్యాన్ని ఆవిష్కరిస్తాడు. అంతవరకే. కన్యాశుల్కం నాటకంలో 'గిరీశం గురజాడే' అన్నవాళ్ళున్నారు. 'గురజాడే సౌజన్యారావు పంతుల'న్నవాళ్ళూ ఉన్నారు. ఇలా ఎవరికి తోచినట్టు వారు నిర్ణయాలు చేస్సేరు. 'మధుర వాణి' ఆడవేషం వేసుకున్న గురజాడే అని అనీలేదు, రక్షించేరు !
          గురజాడ జీవించినన్నాళ్ళూ ఛాందసుల విమర్శల్ని ఎదుర్కొంటూనే వచ్చేడు. గ్రాంధిక వాదుల అవహేళనల్ని, వెటకారాల్ని, వారి వికారాల్ని సహిస్తూనే తన ఉద్యమాన్ని కొనసాగించి విజయగర్వంతో తలెత్తి నిలబడ్డాడు. తాను భౌతికంగా లేనప్పుడూ వదల్లేదాయనను కొందరు. 'గురజాడ మరణించాకే జీవించడం ప్రారంభించేర'ని కృష్ణశాస్త్రి గారంటే ... అలా గురజాడ జీవించడం ఇష్టం లేని, అతని భావజాలంతో ఏకీభవించలేని కొందరు తమ పాండిత్యమంతా రంగరించి కుస్తీలు పట్టి జబ్బసత్తువకొద్దీ సంగతి వ్యాసాలు లోకమ్మీదకొదిలిన సంగతి ఇప్పటి గురజాడ సాంస్క ృతిక సమాఖ్య వారికి తెలీదా? ఆ వ్యాసాలకు ధీటుగా సమాధానం చెప్పే ప్రయత్నం చేసేరా ఎవరైనా? అయినా అతడు గురజాడ. ఆ గురుజాడ ఎవరూ చెరపలేనిది.
        గురజాడ ఆస్థికుడని చెప్తున్న వారు ఈ గురజాడ మాటల్ని చదివితే ఏమంటారో! ''అందరు దేవుళ్ళూ వక్కరే అయితే ఆ పీనుగుల్ని అందరినీ ఒక్కచోటే నిలిపి అందరూ కలిసి పూజ తగలెట్టరాదా?'' (దేవుళ్ళారా మీ పేరేమిటి?)
''కార్యకారణ సంబంధ జ్ఞానం శూన్యమైనప్పుడు ఏది జరిగినా అది కాకతాళీయం, వేళావిశేషం, విధికృతం, యాదృచ్ఛికం అని వ్యక్తులు ఊహించి సంతృప్తి పడతారు. ఆలోచనకు చోటివ్వరు.''
''అంధవిశ్వాసాలు ప్రమాదకరమైనవి. ప్రశ్నించే స్వభావం లేనప్పుడు గుడ్డి నమ్మకాలు కలుగుతుంటాయి. మనల్ని ఛాందసత్వం ప్రశ్నించనీయదు''
''క్షుద్రదేవతారాధన, ఉపాసన అనే మూఢ విశ్వాసాలను కలిగించి కొందరు దొంగ వేదాంతులు చేసే ఘోర కృత్యాలకు లెక్క లేదు. 'వేదాంతులొస్తున్నారు, చెంబులూ ముంతలూ జాగ్రత్త' అన్న సామెత ఊరికే పుట్టలేదు.''
(గురజాడ 'తనలో తాను' శీర్షిక నుండి)
         ''చంద్రవంశపు పట్టమహిషలను పుండాకోరులైన బ్రాహ్మణులకు బాహాటంగానే తార్చినట్లు కనిపిస్తుంది. బాహాటంగా జరిగినవే ఇలా వుంటున్నప్పుడు ఇంక రహస్యంగా ఎన్ని దుర్మార్గాలు, అవినీతి చర్యలు, దోషాలు జరిగాయో కదా? మీ ఇతిహాసాలను, పురాణాలను వొక్కసారి చదివి చూద్దూ.''
(మునిసుబ్రహ్మణ్యం గారికి 21.5.1909న ఉదకమండలం నుంచి గురజాడ రాసిన ఉత్తరం నుండి)
''వివాహసంస్థ పురోగతికి దోహదం చేసిన మాట నిజమే, ఐతే వివాహబంధాన్ని తెంచుకోరాదనే నియమం చెప్పనలవిగాని కన్నీటి గాధలకు కారణం. ఈ సత్యాన్ని మనమెవరమూ విస్మరించలేము.''
''మగవాళ్ళ అధికారం కింద, పెత్తనం కింద బానిసలుగా ఆడవాళ్ళు ఎలా పడివున్నారో, ఎంత మగ్గిపోతున్నారో నేనూహించుకోగలను.''
(మునిసుబ్రహ్మణ్యం గారికి ఉదకమండలం నుండి 2.6.1909 న రాసిన ఉత్తరం నుంచి)
పైన ఉదహరించిన వాక్యాలు చదివాక కూడా గురజాడ ఆస్థికుడనే అంటారా?
''పుస్తకంబులలోని మాటలు
విస్తరించుచు ననుభవమ్ముల
తత్వమెరుగక శుకములగుదురు
వొట్టి శాస్త్రజ్ఞుల్‌..''
         ''వెర్రి పురాణగాధలు నమ్మజెల్లునె పండితుల్‌'' అని గాలిపోగేసే మాటల్లని నమ్మొద్దంటున్నాడు గురజాడ. గురజాడను అభిమానించేవారయితే, అనుసరించే వారయితే తప్పకుండా ఆలోచించేవారు. గతంలో పురస్కారాలు పొందే వారి జాబితాలో చాలా పేర్లు ఉండే అవకాశమే లేదు. ఇప్పుడీ అసమ్మతి పత్రమూ, గౌరవయాత్రా అవసరమయ్యేదే కాదు !
          చాగంటి కోటేశ్వరరావు గారు పండితులు, పురాణాల్ని ఆపోసన పట్టినవారు. గొప్ప ధారణాశక్తి గలవారు. ఆ శక్తి ఎవరికి ఉపయోగమనుకుంటే వారు స్వీకరిస్తారు. అతని ప్రతిభకు తగ్గట్టు, ఆ భావజాలానికి అనుగుణ్యమైన అపూర్వమైన గొప్ప పురస్కారం ఇచ్చి, గౌరవిస్తే ఎవరికీ ఏ అభ్యంతరమూ ఉండేదికాదు గదా.. సంతోషించేవారు కూడా. 'గురజాడ' పురస్కారం అన్నారు గనకనే ఇదంతా.

'ఆధునిక కవితా వథూటికి
అందచందములద్ది, వన్నెలు
దిద్ది ముత్యాల్‌ సరములమరగ
జేసి వాడుక భాషలో
ప్రజల మాటను ప్రాణసమముగ
నెంచి, మూఢత్వమును దృంచగ
జనం కోసము ఉద్యమించిన
కవీ జోహారు..''

- గంటేడ గౌరునాయుడు
ప్రముఖ రచయిత, కవి