Jun 23,2022 22:05

-108 స్థానాలు మెరుగుపరుచుకున్న దినేశ్‌
- ఐసిసి టి20 ర్యాంకింగ్స్‌

దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసిసి) తాజా ర్యాంకింగ్స్‌లో ఇషాన్‌ కిషన్‌ టాప్‌ా10లో చోటు దక్కించుకోగా.. సీనియర్‌ వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ ఏకంగా 108 స్థానాలు మెరుగుపరుచుకొని 87వ స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టి20 సిరీస్‌ నాల్గో మ్యాచ్‌లో తనదైన శైలిలో చెలరేగి అర్ధసెంచరీ నమోదు చేయడంతో ఐసిసి ర్యాంకింగ్స్‌లో అతని స్థానం మెరుగైంది. ఇదే సిరీస్‌లో రెండు అర్ధ సెంచరీలు చేసిన ఇషాన్‌ కిషన్‌ ఒక స్థానం మెరుగుపర్చుకుని 6స్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్‌ బ్యాటర్లు బాబర్‌ అజామ్‌, మహ్మద్‌ రిజ్వాన్‌ వరుసగా ఒకటి, రెండు స్థానాల్లో కొనసాగుతుండగా.. బౌలర్ల జాబితాలో చాహల్‌ మూడు స్థానాలు ఎగబాకి 23వ స్థానంలో ఉన్నాడు. ఈ విభాగంలో ఆసీస్‌ పేసర్‌ జోస్‌ హేజిల్‌వుడ్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టెస్టుల్లో ఆల్‌రౌండర్ల విభాగంలో భారత ఆటగాడు రవీంద్ర జడేజా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకీబ్‌ హల్‌ హసన్‌, టీమిండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. టెస్ట్‌ బ్యాటర్స్‌ విభాగంలో విరాట్‌ కోహ్లీ పదో స్థానంలో కొనసాగుతుండగా.. బౌలర్ల విభాగంలో అశ్విన్‌ రెండు, జస్ప్రీత్‌ బుమ్రా మూడో స్థానంలో ఉన్నారు.