Jun 30,2022 08:11

- నాలుగేళ్లలో ఐదోసారి ఎన్నికలు
జెరూసలేం
: నాలుగేళ్ల కాలంలో ఐదోసారి ఎన్నికల దిశగా ఇజ్రాయిల్‌ పయనిస్తోంది. ప్రస్తుతం ఇజ్రాయిల్‌ తీవ్ర రాజకీయ అనిశ్చితిలో కూరుకుపోయింది. మరోవైపు జీవన వ్యయాలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ప్రభుత్వంలో అంతర్గత కుమ్ములాటల వల్ల పాలక సంకీర్ణం ఎంతో కాలం కొనసాగే స్థితి లేకపోవడంతో పార్లమెంట్‌ను రద్దు చేయాలని ప్రధాని నఫ్తాలి బెర్నెట్‌ గత వారం ప్రతిపాదించారు. దీనిపై తుది ఓటుకు బుధవారం అర్ధరాత్రి వరకు గడువు వుంది. పార్లమెంట్‌ రద్దు తథ్యమని అనిపిస్తోంది. మధ్యంతర ఎన్నికలకు పార్లమెంట్‌ ఆమోద ముద్ర వేసినట్లైతే 8 పార్టీలతో కూడిన బెర్నెట్‌ పాలన ముగుస్తుంది. విదేశాంగ మంత్రి యార్‌ లాపిడ్‌ పరిమిత అధికారాలతో ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతారు. మధ్యంతర ఎన్నికలు అక్టోబరు 25 లేదా నవంబరు ఒకటిన జరిగే అవకాశాలున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.. ఎన్నికల తేదీ ఖరారు కాకముందే మాజీ ప్రధాని బెంజామిన్‌ నెతన్యాహు తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం వుందంటూ ప్రచారం మొదలైంది. లాపిడ్‌, బెర్నెట్‌ ఇరువురూ అరబ్‌ పార్టీలతో కలిసి కూటమిని ఏర్పాటు చేయడం ద్వారా నెతన్యాహు 12 ఏళ్ల పాలనకు తెర దించారు. అయితే చాలామంది ఊహించిన దానికన్నా ఎక్కువ కాలమే ఈ ప్రభుత్వం కొన సాగింది. అవినీతి కేసుల్లో పీకల్లోతున కూరుకుపోయిన నెతన్యాహు ఆరవసారి అధికారం తనదేనని చెబుతున్నారు.