Jun 20,2022 12:15

హైదరాబాద్‌ : 3 రోజుల్లో జేఈఈ మెయిన్‌ పరీక్షలు.. ఇంతవరకు హాల్‌ టికెట్లు లేవు.. మూడు రోజుల క్రితమే విద్యార్థులకు ఏ నగరాన్ని కేటాయించారో తెలిపారు.. కానీ పరీక్ష కేంద్రం ఎక్కడో తెలీదు.. రాష్ట్రాలను సంప్రదించలేదు.. ఇంతవరకు హాల్‌ టికెట్లు చేతికందలేదు. కేంద్ర ప్రభుత్వం ఎన్‌టీఏ ఇష్టారాజ్య తీరు విద్యార్థులను అయోమయంలో పడేస్తోంది..!

                           ఈనెల 23 నుండే పరీక్షలు.. నిన్న రాత్రి వరకు హాల్‌టికెట్లను జారీ చేయలేదు..

సాధారణంగా ప్రవేశ పరీక్షలకు వారం పది రోజుల ముందు హాల్‌టికెట్లు జారీ చేయడం ఆనవాయితీ. జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) తీరు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. దేశవ్యాప్తంగా ఈ నెల 23 నుంచి 29 వరకు జేఈఈ మెయిన్‌ మొదటి విడత పరీక్షలు జరగనున్నాయి. అయినా ఆదివారం రాత్రి 7.30 గంటల వరకు ఈ సంస్థ హాల్‌టికెట్లను జారీ చేయలేదు.

                                   పరీక్షా కేంద్రం ఎక్కడో.. ఆందోళనలో 9.50 లక్షల మంది విద్యార్థులు

మూడు రోజుల క్రితం విద్యార్థులకు ఏ నగరం కేటాయించారో ఎన్‌టీఏ వెల్లడించినా.. పరీక్షా కేంద్రం ఏదన్నది ఇంకా తెలపలేదు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఈ పరీక్షలకు హాజరయ్యే దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు లక్షన్నర మంది ఈ పరీక్ష రాయనున్నారు. వీరంతా ఆయా నగరాలకు వెళ్లడానికి చాలా తక్కువ టైం ఉంటే.. మరోవైపు పరీక్షా కేంద్రం ఎక్కడో తెలీక తంటాలుపడుతున్నారు.

                                            ఐఐటీలు కూడా పరీక్ష తేదీలను మార్చాల్సి వచ్చింది..

కేంద్ర ప్రభుత్వం ఎన్‌టీఏను నెలకొల్పిన నాటి నుంచి పరీక్షల తేదీలు, నోటిఫికేషన్లు, ఫలితాల వెల్లడిలో విద్యార్థులను అయోమయానికి గురిచేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. రాష్ట్రాలను సంప్రదించకుండా కొన్ని నెలల క్రితం జేఈఈ మెయిన్‌ తేదీలను ప్రకటించిన ఈ సంస్థ.. తర్వాత కొత్త కాలపట్టికను ప్రకటించి విమర్శలపాలైంది. ఆ సంస్థ తీరుతో.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ నిర్వహించే ఐఐటీలు కూడా పరీక్షల తేదీలను మార్చాల్చి వచ్చింది.

                                           పక్కా ప్రణాళిక లేదు.. ఎన్‌టీఏ ఇష్టారాజ్య పోకడ..!

జూన్‌ 21 నుంచి జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్షలు ప్రారంభమవుతాయని గతంలో ఎన్‌టీఏ ప్రకటించింది. మూడు రోజుల క్రితం ఈ నెల 23 నుండి అని చెప్పింది. ఇంతకూ పరీక్ష ఎప్పుడు ? పక్కా ప్రణాళిక లేకపోవడం, రాష్ట్రాలను సంప్రదించకపోవడమే తప్పిదాలకు ప్రధాన కారణంగా అభిప్రాయం వ్యక్తమవుతోంది. అడ్వాన్స్‌డ్‌ నిర్వహించే ఐఐటీలు.. పరీక్ష ఫలితాల వెల్లడి తేదీని ముందుగానే ప్రకటిస్తున్నాయి. ఎన్‌టీఏ మాత్రం ఫలితాల వెల్లడి విషయాన్ని కనీసం కొద్ది గంటల ముందుగా కూడా అధికారికంగా ప్రకటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్త్తుతున్నాయి. ఎన్‌టీఏ ఇష్టారాజ్య పోకడతో విద్యార్థులు అయోమయంలో పడుతున్నారు.