
- వివేకా హత్య విషయం దర్యాప్తులో అదే తేలింది
- ఎవరి ద్వారా తెలిసిందనేది తెలియాల్సి ఉంది
- అవినాష్‌కు బెయిల్ ఇవ్వొద్దు
- కోర్టుకు సమర్పించిన అనుబంధ కౌంటర్‌లో సిబిఐ వెల్లడి
ప్రజాశక్తి- హైదరాబాద్ బ్యూరో : తన చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయం బాహ్య ప్రపంచానికంటే ముందే అప్పటి ప్రతిపక్షనేత, నేటి ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డికి తెలుసునని సిబిఐ పేర్కొంది. న్యాయవర్గాల ద్వారా తెలిసిన సమాచారం మేరకు... వివేకా హత్య విషయం ఆయన పిఎ ఎంవి కృష్ణారెడ్డి బయటపెట్టక ముందే జగన్‌కు తెలిసిందనేది తమ దర్యాప్తులో తేలిందని హైకోర్టుకు సమర్పించిన అనుబంధ కౌంటర్‌లో సిబిఐ పేర్కొంది. వివేకా హత్య విషయం జగన్‌కు అవినాష్‌రెడ్డే చెప్పారా? లేదా ఇతరులెవరైనా చెప్పారా? అనేది దర్యాప్తులో తేలాల్సి ఉందని తెలిపారు. 'వివేకా హత్య వెనక భారీ కుట్ర జరిగిందనేది వాస్తవం. అందులో అవినాష్‌రెడ్డి పాత్ర కీలకం.
నిజం చెప్పేందుకు అవినాష్‌రెడ్డి సహకరించడం లేదు. హత్య జరిగిన రోజు అర్ధరాత్రి 12.27 గంటల నుంచి 1.10 గంటల వరకు అవినాష్ వాట్సప్ కాల్స్ మాట్లాడారు. ఎవరితో మాట్లాడిందీ వివరాలు సేకరించాం. విచారణకు హాజరు కావాలని నోటీసులిస్తే ఏవో కారణాలు చెప్పి తప్పించుకుంటున్నారు. అవినాష్‌ను అరెస్టు చేసేందుకు ఈ నెల 22న సిబిఐ బృందం కర్నూలు వెళ్లింది. అక్కడి పరిస్థితులను చూసిన తర్వాత శాంతిభద్రతల సమస్య రావొచ్చని అరెస్ట్ చేయకుండా ఆగాల్సి వచ్చింది. జూన్ 30లోగా వివేకా హత్య కేసు దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో విచారణ త్వరగా పూర్తి కావాలంటే అవినాష్‌రెడ్డిని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సి ఉంది. ముందస్తు బెయిల్ ఇవ్వొద్దు' అని అనుబంధ కౌంటర్‌లో సిబిఐ అధికారులు పేర్కొన్నారు.