Sep 22,2022 20:27
  • ఇసిఐ ఉత్తర్వులపై స్పందించిన సజ్జల

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైసిపికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జీవితకాల అధ్యక్షులుగా ప్లీనరీలో తీర్మానం చేసిన మాట వాస్తవమని, ఆ ప్రతిపాదనను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరస్కరించడంతో అది ముగిసిన అధ్యాయంగా పక్కన పెట్టేశామని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. వైసిపికి శాశ్వత అధ్యక్షులుగా ఎన్నికైన ప్రక్రియ చెల్లదని కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులపై సజ్జల తాడేపల్లిలో గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రతి ఐదేళ్లకోసారి తమ పార్టీకి ప్రజాస్వామ్య పద్ధతిలో అధ్యక్ష, స్థానానికి ఎన్నికలు జరిగేలా పార్టీకి విధాన నిర్ణయంగా ఉందన్నారు. ఈ ఏడాది జులైలో జరిగిన పార్టీ ప్లీనరీలో కొత్తగా పార్టీని పెట్టడంతో పాటు కష్టపడి అధికారంలోకి తీసుకొచ్చారని, అందుకే జగన్‌ను జీవితకాల అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని పార్టీ కార్యకర్తలు ఉత్సాహంతో తీర్మానం చేశారని అన్నారు. ఆ తీర్మానాన్ని జగన్‌ తిరస్కరించడంతో ఆ నిర్ణయం మినిట్స్‌లోకి కూడా ఎక్కలేదన్నారు. ప్రస్తుతానికి ఐదేళ్ల వరకు జగన్‌ అధ్యక్షులుగా ఉంటారని తెలిపారు. ఆ తర్వాత పార్టీలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో కొత్తగా అధ్యక్షుని ఎన్నిక ఉంటుందని పేర్కొన్నారు. శాశ్వత అధ్యక్షుని పదవికి సంబంధించి స్పష్టత ఇవ్వాలని ఎన్నికల సంఘం తమ పార్టీని అడిగిందని, ఇదే అంశాన్ని ఎన్నికల కమిషన్‌కు పంపినట్లు తెలిపారు.