
-యువగళం పాదయాత్రలో నారా లోకేష్
ప్రజాశక్తి-నల్లచెరువు :వైసిపి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. ఆయన చేపట్టిన యువగళం పాదయాత్ర ఆదివారం 47వ రోజు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని నల్లచెరువు మండలం మీదుగా సాగింది. నల్లచెరువు మండల పరిధిలోని తలమర్లవాండ్లపల్లి పంచాయతీ చిన్నపల్లోల్లపల్లి విడిది కేంద్రం నుండి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. ఈ యాత్రకు మాజీ ఎమ్మెల్యే, కదిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందికుంట వెంకటప్రసాద్, శ్రీ సత్యసాయి జిల్లా టిడిపి అధ్యక్షుడు బికె పార్థసారథి, మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు, మాజీ ఎంపి నిమ్మల కిష్టప్ప, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, టిడిపి నాయకులు కార్యకర్తలు, యువత స్వాగతం పలికారు. చిన్న ఎల్లంపల్లి వద్ద పాదయాత్ర 600 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం జోగన్నపేట వద్ద బహిరంగ సభలో లోకేష్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కొత్త పరిశ్రమలని ఏర్పాటు చేయడం మాట అటుంచి ఉన్న పరిశ్రమలను వేరే రాష్ట్రాలకు తరుముతున్నారని, కమీషన్ల కోసం వేధిస్తున్నారని ఆరోపించారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు 90 శాతం హంద్రీనీవా పనులు పూర్తి చేశామని మిగిలిన పది శాతం పనులు పూర్తిచేసి సాగునీరు అందించలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఎకరానికి సాగునీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగం కల్పించే దిశగా ప్రయత్నాలు చేస్తామన్నారు. ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ కేలండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కల్యాణదుర్గం టిడిపి ఇన్‌ఛార్జి ఉమామహేశ్వర నాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి, ఎస్‌సిసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెస్ రాజు తదితరులు పాల్గొన్నారు.