Jul 04,2022 16:27

 జైపూర్‌ :   భీమ్‌ ఆర్మీ చీఫ్‌, హక్కుల కార్యకర్త చంద్రశేఖర్‌ ఆజాద్‌ను విడుదల చేయాల్సిందిగా జైపూర్‌ కోర్టు పేర్కొంది. అరెస్ట్‌ చేసే క్రమంలో పోలీసులు సరైన విధానాలు పాటించలేదని, దీంతో అతని అరెస్ట్‌ చట్టవిరుద్ధమని మెజిస్ట్రేట్‌ పేర్కొన్నారు.  తమకు శాశ్వత స్థానం కల్పించాలంటూ ఆందోళనకు దిగిన కొవిడ్‌ హెల్త్‌ అసిస్టెంట్స్‌కు మద్దతు తెలిపేందుకు జైపూర్‌ వెళ్లిన ఆజాద్‌ను జులై 1 అర్థరాత్రి హోటల్‌ నుండి పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆజాద్‌తో పాటు మరో 21 మందిని ఐపిసి సెక్షన్‌ 151 (క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌) కింద అదుపులోకి తీసుకున్నారు. ఆజాద్‌ను రెండు రోజుల పాటు జ్యుడీషియల్‌ కస్టడీలో ఉంచారు. దర్జీ కన్హయ లాల్‌ హత్యతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో .. ఉదరుపూర్‌ సహా రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్‌ విధించామని, ముందుజాగ్రత్త చర్యగా చంద్రశేఖర్‌ ఆజాద్‌ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు.

అయితే ఆందోళనలో పాల్గొనకుండా  అడ్డుకునేందుకు పోలీసులు భీమ్‌ ఆర్మీ కార్యకర్తలను ముందస్తు అరెస్ట్‌లు చేశారని కార్యకర్త ధర్మేంద్ర కుమార్‌ తెలిపారు.  జులై 2న కొవిడ్‌ హెల్త్‌ అసిస్టెంట్స్‌ ఆదోళనకు మద్దతు తెలపాలని నిర్ణయించుకున్నామని అన్నారు. అర్థరాత్రి 12.30 గంటలకు హోటల్‌కు చేరుకున్న పోలీసులు ఆజాద్‌తో పాటు తమను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. ఆజాద్‌ తరపున న్యాయవాది వాదనలు వినకుండా, బెయిల్‌ దరఖాస్తును దాఖలు చేసేందుకు అవకాశం లేకుండా కస్టడీకి పంపారని కుమార్‌ పేర్కొన్నారు. ఆజాద్‌ అరెస్ట్‌ను పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ (పియుసిఎల్‌) ఖండించింది. అర్థరాత్రి అరెస్ట్‌లు చేయడం ఏమిటని ప్రశ్నించింది. దళితులైన కార్యకర్తలను హోటల్‌ రూమ్స్‌ నుండి లాక్కొచ్చారని పియుసిఎల్‌ మండిపడింది.