Oct 02,2022 07:05

'కళను, కళాకారులను బతికించుకోవాల్సిన ఆవశ్యకత నేడు మనముందుంది' అంటూ అటువంటి బృహత్తర కార్యక్రమాన్ని భుజాన వేసుకున్న జాషువా సాంస్కృతిక వేదిక తదితర సాంస్కృతిక సంస్థలు గుఱ్ణం జాషువా 127వ జయంతి పురస్కరించుకుని నిర్వహించిన జయంతోత్సవాల్లో జానపద గాయకుడు రేలారేరేలా జానకిరావు బృందం జానపద గీతాల ఆలపనా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ సందర్భంగా తన పల్లెపాట గొప్పతనాన్ని జానకిరావు వివరించారు.
జానకీరావు పుట్టి పెరిగింది విజయనగరం జిల్లా గజపతినగరం పక్కనే ఉన్న వేమలి గ్రామం. వ్యవసాయ కుటుంబం. జానపద గీతాలపై ఎప్పటి నుంచి ఇష్టం పెంచుకున్నారని ప్రశ్నించినప్పుడు 'బాల్యం నుంచే జానపద గేయాల మీద మక్కువ పెంచుకున్నాను. మూడో తరగతి చదివేటప్పటి నుంచే పాటలు పాడేవాడ్ని. అందరూ మెచ్చుకుంటుంటే చాలా ఆనందంగా ఉండేది. పొలం గట్లమీద, అరుగుల మీద, పిండి విసురుతూ, రోకలి దంచుతూ, శ్రమ చేస్తూ పాడుకునే గీతాలే జానపదాలు. చిన్నప్పటి నుంచి వాటిని వింటూ పెరిగిన నాకు ఆ పాటలు పాడడమంటే చాలా ఇష్టం' అంటున్నారు.

janakirao


'పల్లె పాటలు పాడేవారు ప్రతి ఊరిలో ఉంటారు. కాని వెలుగులోకి రారు. 'పనికి తోడు పాట.. పాటకి సరిజోడు పని' అని పెద్దలంటారు. అలా పల్లె ప్రతి శ్రమలో పాట ఉంటుంది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఈ సంస్క ృతి ఉంది' అంటున్న జానకీరావు రేలారేరేలా కార్యక్రమ అవకాశం గురించి మాట్లాడుతూ.. '2008లో రేలారేరేలా అవకాశం వచ్చింది. అప్పటికి మా ఊళ్లో ల్యాండ్‌లైన్‌ సౌకర్యం కూడా లేదు. మా సంగీతం టీచరు విజయనగరం చల్లపల్లి శ్యామల గారి ప్రోత్సాహంతో వెళ్లాను. సరదాగా నేర్చుకున్న పాటలు పాడేద్దాం అనుకున్నాను. కాని అక్కడికి వెళ్లాకే పల్లెల్లో మరుగున పడిపోతున్న ఎన్నో పాటల గురించి తెలిసింది. అప్పటినుంచి పాటలు పాడడమే కాదు.. పాటను బతికించుకోవాలన్న కసి నాలో పెరిగింది. అలా ఎన్నో గ్రామాలు తిరిగి పల్లె పాటలు సేకరించాను. ఎంతోమందిని కలిశాను. వాళ్లు పాడే పాటలు ఎంతటి విలువైనవో కూడా వాళ్లకి తెలియదు. ఏదో ఒక పని చేసుకుంటూ పాడే పాట కోసం ఇంతదూరం ఎందుకు వచ్చావని కూడా చాలామంది అడిగేవారు. ఆ తరం వాళ్ళల్లో చాలామంది ఇప్పుడు లేరు. ఇంకో ఐదేళ్లలో ఉన్నవాళ్లు కూడా కనుమరుగైపోతారు. ఈ లోపుగానే వాళ్ల నుంచి సేకరించిన పాటలను వీడియో రూపంలో తీసుకురావాలనుకుంటున్నాను. కాని ఆర్థికంగా అంత స్థోమత లేదు. పాట ద్వారా వచ్చిన ప్రతి పైసా పాట కోసమే వెచ్చిస్తుంటాను' అంటున్నారు.
స్వతహగా జానకీరావుకు సామాజిక అంశాలపై కూడా శ్రద్ధ ఎక్కువ. అందుకే రేలారేరేలా ద్వారా వచ్చిన పేరు, ప్రఖ్యాతులను తన అభివృద్ధికి ఉపయోగించుకోవాలని ఆశపడలేదు. కనీస మౌలిక సదుపాయాలు లేని తన గ్రామాన్ని బాగుచేయాలని సంకల్పించారు. అలా గ్రామంలో రోడ్డు వేయడం దగ్గర నుంచి, నీటి సరఫరా, రక్తదాన శిబిరాలు వంటి కార్యక్రమాల్లో స్నేహితులతో కలిసి పనిచేసేవారు.
మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన వ్యక్తులెవరని అడిగినప్పుడు.. 'వంగపండు ప్రసాద్‌ గారి దగ్గర నుంచి, గంటేడ గౌరునాయుడు, గంగిరెడ్డి శ్రీను, కృష్ణమూర్తి, సుబ్బారావు పాణిగ్రాహి వంటి ఎంతోమంది గాయకుల స్ఫూర్తితో వాళ్ల కొనసాగింపుగా నాలాంటివాళ్లు ముందుకెళుతున్నారు' అంటున్నారు.
జానపదగీతాల ప్రస్తుత పరిస్థితిపై స్పందిస్తూ.. 'ఉద్యమానికి ఉపయోగపడిన జానపదం, జన చైతన్యానికి నాంది పలికిన జానపదం ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రాంతంలో యాచకవృత్తికి ఉపయోగపడడం చూసి చాలా బాధ కలుగుతోంది. శ్రీకాకుళం రైతాంగ పోరాట ఉద్యమ ప్రస్థానంలో జానపద గీతాలు ప్రజలను చైతన్యం చేశాయి. జముకు పట్టుకుని ఎంతోమంది గాయకులు పాటలు పాడేవారు' అంటూ ఆనాటి స్మృతులను గుర్తుచేసుకున్నారు.
'మా ఉత్తరాంధ్రలో సన్యాసమ్మ, కామమ్మ, బలభద్రరాజు, బాలనాగమ్మ, బుర్ర కథలు, తప్పెటగుళ్లలో జానపద గేయాలు పాడడం నాకు తెలుసు. కాని ఇప్పుడా సంస్కృతిక కనుమరుగైంది. పాతతరం నాటి ఎన్నో స్మృతులు అంతరించిపోతున్నాయి. ఆనాటి పాటను బతికించుకోవాలనుకుని ఎన్నో గ్రామాలు తిరిగాను. జముకులు, కిన్నెర, వ్యవసాయ పనుల పాటలు వంటివి సేకరించాను. సేకరణ క్రమంలో కొన్ని వరుసలు మాత్రమే దొరుకుతాయి. మిగిలిన వాటిని మా కళాకారులే కూర్చుతారు. అలా సేకరించిన పాటలకు మంచి సంగీతం జోడించి వాటిని జనబాహుళ్యంలోకి తీసుకెళ్తున్నారు. ఈ దారిలో ఎంతోమంది ఉన్నారు. బద్రి కూర్మారావు ఉత్తరాంద్ర పల్లెపాటలను సేకరించడంలో ముందున్నారు. అలాంటివారు చాలామందే ఉన్నారు. కాని వెలుగులోకి రావడం లేదు' అంటూ ఆవేదన చెందుతున్నారు.
ఆదాయం గురించి మాట్లాడుతూ 'గాయకుడిగా నా 13 ఏళ్ల ప్రయాణం చాలా సంతృప్తిగా ఉంది. ఆడంబరాలు లేని అవసరాలకు సరిపడా ఆదాయం ఉంది. సరాసరి నెలకు 10 నుంచి 15 కార్యక్రమాలు చేస్తాము. మా బృందంలో 20 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సువారు 10, 12 మంది సభ్యులు ఉంటారు. కార్యక్రమాలు చేయడం మిగిలిన సమయంలో అధ్యయనం, సేకరణ, యువతరాన్ని చైతన్యం చేసే పాటలు రాయించడం వంటి పనుల్లో నిమగమై ఉంటాం' అంటున్నారు.
తన ప్రాంతం గురించి మాట్లాడుతూ 'అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఉన్నవారికి అవకాశాలు ఎక్కువగా వస్తాయి. మా ప్రాంతంలో అలా లేదు. సామాజికంగా, ఆర్థికంగా మా ప్రాంతం వెనుకబడి ఉంది. ఆధునిక సమాజంలో ఏం జరుగుతోందో అర్థం చేసుకోలేని అమాయకత్వం ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. మా ప్రాంతం కంటే తెలంగాణ పల్లెలు అభివృద్ధి చెందడంలో సామాజిక చైతన్యం కీలకంగా పనిచేసింది. మా ప్రాంతంలో ఏదైనా సమస్య వస్తే దాన్ని పరిష్కరించుకోవడం తెలియదు. నాయకుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే అభివృద్ధి జరుగుతుందని ఆలోచనల్లో ఉంటారు. హక్కుల గురించి తెలియదు. కళాకారుడిగా ప్రత్యక్షంగా సమైకాంధ్ర ఉద్యమంలో పనిచేశాను. ప్రజలను చైతన్యం చేసే పాటలను ఎంతోమంది రాసి పాడారు. అందరం కష్టపడ్డాం. కాని ఏమైంది? విభజన వల్ల ఎంతో నష్టపోయాం. సమన్యాయం జరగలేదు. ఏదో సాధించాలని కష్టపడ్డాం. కాని ఫలితం రాలేదు. ఆ పోరాట స్ఫూర్తి రానురాను కనుమరుగైంది.
కళాకారులను ప్రోత్సహించే బాధ్యత పాలకులదే. కాని ఆ ప్రయత్నాలు లేవు. కార్యక్రమాలు లేనప్పుడు మా వాళ్లంతా చాలా ఇబ్బందులు పడతారు. మొన్న కరోనా సమయంలో ఎన్నో కష్టాలు పడ్డారు. జానపద కళాకారులకు ఉపాధిగా తెలంగాణలో ప్రభుత్వ పథకాల ప్రచారంలో భాగస్వామ్యం చేశారు. ఇక్కడ కూడా ఆ విధానం అమల్లోకి రావాలి. అప్పుడైనా పరిస్థితిల్లో మార్పు వస్తుందేమోనని ఆశపడుతున్నాను' అంటున్నారు. యువకుడైన జానకీరావు మాటల్లో తన ప్రాంతం వెనుకబాటుతనంపై ఆవేదన, అభివృద్ధిపథంలో నడిచేలా తనవంతుగా ఏదైనా చేయాలన్న తపన స్పష్టంగా కనిపిస్తోంది. తన కోసం, తనవారి కోసమే కాక సమాజహితం కోసం పరితపించే అతితక్కువ మందిలో జానకీరావు ఒకరు. ఆయన ఆశయం నెరవేరాలని మనసారా కోరుకుందాం.


సంభాషణ : జ్యోతిర్మయి