Aug 29,2022 14:48
  • రంగాల వారిగా పని విభజన
  • ఆస్తుల పంపకానికి సంకేతాలు..!
  • దీపావళి కల్లా 5జి సేవలు
  • కొత్తగా ఎఫ్‌ఎంసిజిలోకి ప్రవేశం
  • రిలయన్స్‌ నుంచి క్లౌడ్‌ పిసి
  • ఎజిఎంలో ముకేష్‌ అంబానీ వెల్లడి

ముంబయి : రిలయన్స్‌ ఇండిస్టీస్‌కు సంబంధించిన వివిధ రంగాల బాధ్యతలను వారసులకు అప్పగిస్తూ ఆ కంపెనీ ఛైర్మన్‌ ముకేష్‌ అంబానీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆకాశ్‌ అంబానీకి జియో, ఇషాకు రిటైల్‌ వ్యాపారం, అనంత్‌కు న్యూ ఎనర్జీ వ్యాపార బాధ్యతలను అప్పగించినట్లు వెల్లడించారు. సోమవారం వర్య్చూవల్‌గా జరిగిన రిలయన్స్‌ ఇండిస్టీస్‌ వార్షిక సాధారణ సమావేశం (ఎజిఎం)లో ముకేష్‌ అంబానీ ఈ వివరాలను వెల్లడించారు. ఆయన వారసులకు ఈ బాధ్యతలను ప్రకటించడం ద్వారా భవిష్యత్తులో ఆస్తుల పంపకాలు కూడా ఇదే విధంగా ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీరుబాయి అంబానీ మరణాంతరం రిలయన్స్‌ ఇండిస్టీస్‌ ఆస్తుల పంపకాల్లో ముకేష్‌ అంబానీ, అనీల్‌ అంబానీ మధ్య తీవ్రంగా గొడవలు జరిగాయి. ఇలాంటి పరిస్థితి భవిష్యత్తులో రాకూడదనే ఉద్దేశ్యంతోనే ముకేష్‌ అంబానీ తన పిల్లలకు ఇప్పటి నుంచే ఆయా రంగాల బాధ్యతలు అప్పగించి ఉంటారని భావిస్తున్నారు.
వచ్చే దీపావళి నుంచి జియో 5జి సేవలు అందుబాటులోకి రానున్నాయని ముకేష్‌ అంబానీ తెలిపారు. తొలుత ఢిల్లీ, ముంబయి, కోల్‌కత్తా, చెన్నరు నగరాల్లో ఈ సేవలను ప్రారంభించనున్నామన్నారు. డిసెంబర్‌ 23వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయన్నారు. ఫిక్స్‌డ్‌ బ్రాడ్‌బ్యాండ్‌లో జియో దూసుకువెళ్తోందని, 5జితో సుమారు 10 కోట్ల గృహాలను చేరనున్నామన్నారు. గూగుల్‌ సహకారంతో తమ వినియోగదారులకు జియో 5జి ఫోన్‌ అందుబాటులోకి తేనున్నామన్నారు. కాగా.. ఫోన్‌ ధర.. ఫీచర్లు, ఎప్పుడు అందుబాటులోకి తెచ్చేది ఆయన వెల్లడించలేదు.
జియో కొత్తగా క్లౌడ్‌ పిసిని ఆవిష్కరించనుందని రిలయన్స్‌ ఇండిస్టీస్‌ వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న పర్సనల్‌ కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌లను ప్రతీసారి అప్‌గ్రేడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. క్లౌడ్‌ పిసిలో ఈ అవసరం ఉండదని తెలిపింది. ప్రస్తుతం తమ కంపెనీలో ఉపయోగిస్తున్న పిసిల స్థానంలో వీటిని తీసుకురానున్నామని వెల్లడించింది. ఇవి 5జి సర్వీసుల్లో భాగమని పేర్కొంది. చమురు, టెలికం, రిటైల్‌ తదితర వ్యాపారాల్లో గుత్తాదిపత్యం కలిగిన రిలయన్స్‌ కొత్తగా ఫాస్ట్‌ మూవింగ్‌ కన్స్యూమర్‌ గూడ్స్‌ (ఎఎఫ్‌ఎంసిజి) విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ ఇషా అంబానీ వెల్లడించారు. తక్కువ ధరలో ఎక్కువగా ఉపయోగించే షాంపులు, సబ్బులు, ప్లాస్టిక్‌, వ్యక్తిగత సౌందర్యానికి ఉపయోగించే తదితర ఉత్పత్తులు ఈ రంగంలోకి వస్తాయి.
గతేడాది కాలంలో రిలయన్స్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ వ్యాపారం తొమ్మిది రెట్లు పెరిగిందని ముకేష్‌ అంబానీ తెలిపారు. ఆదాయం దాదాపు రూ.8వేల కోట్లు దాటిందన్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఎంజి ఫీల్డ్‌, కెజి-డి6ను అమల్లోకి తీసుకురావడం ద్వారా భారత గ్యాస్‌ ఉత్పత్తిలో రిలయన్స్‌ వాటా 30 శాతానికి చేరుతుందన్నారు. వచ్చే ఐదేళ్లలో ఆయిల్‌ అండ్‌ కెమికల్స్‌ రంగాల్లో రూ.75వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. గడిచిన ఏడాది కాలంలో మీడియా రంగంలో రిలయన్స్‌ వ్యాపారం భారీగా పెరిగిందన్నారు. తమ మీడియా ఛానళ్లన్నీ దూసుకుపోతున్నాయని.. వయాకామ్‌ 18 క్రీడా విభాగంలో ఐదేళ్ల పాటు ఐపిఎల్‌ ప్రసార హక్కులను పొందిన విషయాన్ని ముకేష్‌ గుర్తు చేశారు.