Oct 05,2022 14:16

ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : అంబేద్కర్‌ కోనసీమ జిల్లా మండలంలోని జొన్నాడ- రావులపాలెం గౌతమి నదిపై గల పాత బ్రిడ్జికి రూ.30 కోట్లతో అధునాతన మరమ్మత్తులు చేపట్టి 9 నెలలు పైబడి నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో పూర్తయ్యాయి. దీంతో బుధవారం రాజ్యసభ సభ్యులు ఎంపి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, ప్రభుత్వ విప్‌ చిర్ల జగ్గిరెడ్డి వాహనాల రాకపోకలను ప్రారంభించారు. 1967లో ప్రారంభమైన ఈ వంతెన సుదీర్ఘ కాలం పాటు విశేష సేవలందించింది. అయితే గత కొన్నేళ్లుగా తరచూ మరమ్మత్తులకు వచ్చి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. దీంతో 2021లో నేషనల్‌ హైవే అధికారులు సంపూర్ణ మరమ్మత్తులకు శ్రీకారం చుట్టారు. అందుబాటులోకి వచ్చిన అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ వంతెనను పటిష్ఠపరిచారు. ఈ మరమ్మత్తులకు సుమారు 30 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి. 48 స్తంభాలతో 2,432 మీటర్ల పొడవు కలిగిన ఈ వంతెనకు మరమ్మతులు పూర్తవడంతో విజయదశమి రోజైనా బుధవారం నుంచి వాహనాలు వెళ్ళడానికి హైవే అధికారులు అనుమతించారు. గత ఏడాది ఏప్రిల్‌ నెల నుంచి ఈ వంతెనకు మరమత్తులు చేపట్టిన డిసెంబర్‌ నెల నుంచి అధికారికంగా మూసివేసి మరో వంతెన పైనే రాకపోకలు జరిగేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ఆ వంతెనకు వాహనాల తాకిడి అధికమవ్వడం వల్ల అనేక ప్రమాదాలు జరగడంతో పాటు గంటలు తరబడి ట్రాఫిక్‌ స్తంభించిపోయేది. ఇకపై అలాంటి ఇబ్బందులు లేకుండా జొన్నాడ పాత గౌతమి వంతెన అందుబాటులోకి వచ్చిందని వారు తెలిపారు. అంతేకాదు గతంలో ఈ వంతెనకు ఐరన్‌ చట్రాలను హేండ్‌ రైల్స్‌ గా ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదకరంగా ఉండేది. ఇప్పుడు వాటిని తొలగించేసి పటిష్టమైన గోడలు నిర్మించడంతో పాటు బేరింగ్‌లు, స్లాబులు వంటివి కొత్తవి నిర్మించారు. పలితంగా చాలా కాలం పాటు ఈ వంతెనకు మరమ్మత్తులు వచ్చే అవకాశం లేదని నేషనల్‌ హైవే అధికారులు పేర్కొంటున్నారు.