Jan 24,2023 11:16
  • మిశ్రా కమిటీ సిఫార్సులు బుట్టదాఖలు
  • భూవిజ్ఞాన, పర్యావరణ శాస్త్రవేత్తల హెచ్చరికలు పట్టని ప్రభుత్వాలు

న్యూఢిల్లీ : అభివృద్ధి పేరుతో క్రోనీ క్యాపిటలిస్టులు పర్యావరణ హెచ్చరికలు పట్టించుకోకుండా చేపట్టిన విధ్వంస చర్యలే జోషిమఠ్‌లో భూమి కుంగిపోవడానికి ప్రధాన కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు, పర్యావరణ శాస్త్రవేత్తల హెచ్చరికలను పట్టించుకోకుండా పర్యావరణపరంగా సున్నితమైన హిమాలయ ప్రాంతంలో బిజెపి నేతృత్వంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి ప్రణాళికలే జోషిమఠ్‌ను విధ్వంస మార్గంలోకి నడిపించాయి.
          2021 నుంచే జోషిమఠ్‌లోని భవనాల్లో పగుళ్లు కనిపించడం ప్రారంభమైనా ఇటీవల కాలంలో తీవ్రత పెరిగింది. 800 కంటే ఎక్కువ ఇళ్లు, రోడ్లలో పగుళ్లు కనిపించాయి. ఇస్రో నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ విడుదల చేసిన చిత్రాల ప్రకారం 2022 డిసెంబర్‌ 27 నుంచి 2023 జనవరి 7 మధ్య 12 రోజుల్లో 5.4 సెంటీమీటర్ల వేగవంతమైన క్షీణత జోషిమఠ్‌లో కనిపించింది. కేంద్రం ఆదేశాలతో ఈ చిత్రాలను సంస్థ తమ వైబ్‌సైట్‌ నుంచి తొలగించింది. ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఉన్న జోషిమఠ్‌ పట్టణం 20 వేల జనాభాను కలిగి ఉంది. బద్రీనాథ్‌ - హేమకుంట్‌ సాహిబ్‌ క్షేత్రాల మార్గంలో జోషిమఠ్‌ ఉంది. ఈ ప్రాంతం ఆధ్యాత్మికంగానే కాక, పర్యాటకంగానూ ప్రసిద్ధి చెందింది. భారత్‌-చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్నందున వ్యూహాత్మకంగానూ కీలకమైంది.
         జోషిమఠ్‌కు సమీపంలో ఎన్‌టిపిసి సొరంగ నిర్మాణ సమయంలో చేస్తున్న పేలుళ్లే ఈ విపత్తుకు తక్షణ కారణంగా కొన్ని నివేదికలు చెబుతున్నాయి. జోషిమఠ్‌ కుంగుబాటుకు అనేక జలవిద్యుత్‌ ప్రాజెక్టులు, భారీ హోటళ్లు, రోడ్డునిర్మాణ ప్రాజెక్టులే కారణమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు, పర్యావరణ శాస్త్రవేత్తల హెచ్చరికలను పట్టించుకోకుండా ప్రభుత్వాలు వీటిని నిర్మించాయని నిపుణులు విమర్శిస్తున్నారు. జోషిమఠ్‌ గురించి శాస్త్రవేత్తలు, నిపుణులు దశాబ్దాలుగా హెచ్చరిస్తున్నారు.
 

                                          భారీ నిర్మాణాలను నిషేధించాలన్న మిశ్రా కమిటీ సిఫార్సులకు సమాధి

ఇక్కడ భారీ నిర్మాణాలను నిషేధించాలని 1976లోనే ఎంసి మిశ్రా కమిటీ సూచించింది. అటవీ విస్తీర్ణం మరింత పెంచాలని, సరైన డ్రైనేజీ వ్యవస్థ ఉండాలని కమిటీ సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులన్నీ రాజకీయ, కాంట్రాక్టర్ల స్వార్థ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండటంతో ప్రభుత్వాలు ఈ కమిటీ నివేదికను సమాధి చేశాయి. క్రోనీ క్యాపిటలిస్టుల ఒత్తిడి నేపథ్యంలో జోషిమఠ్‌ చుట్టూ జల విద్యుత్‌ ప్రాజెక్టులు, సొరంగాలు, రోడ్ల నిర్మాణాలను ప్రభుత్వం భారీగా చేపట్టింది. ఈ చర్యలు నేల కోతకు కూడా కారణమయ్యాయి. మరోవైపు అడవుల నరికివేతతో 2021 ఫిబ్రవరిలో ఇక్కడ భారీ వరదలు సంభవించాయి. ఈ వరదలపై ఇప్పటి వరకూ సరైన అధ్యయనం కూడా జరగలేదు.
 

                                                                450 జల విద్యుత్‌ ప్రాజెక్టులకు ప్రణాళిక

ఇప్పటికే ఎన్‌టిపిసి ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభóమైంది. ఒక అంచనా ప్రకారం ఇక్కడ వంద డ్యామ్‌ల నిర్మాణం ప్రారంభించాయి. 450 జల విద్యుత్‌ ప్రాజెక్టులు నిర్మించాలని ప్రణాళికలు రూపొందించారు. అంటే 12 కిలోమీటర్లకు ఒక ప్రాజెక్టు అన్న మాట. ఈ ప్రాజెక్టుల కోసం చెట్లను నరికి వేయడంతోపాటు, డైనమైట్లు ఉపయోగించి బ్లాస్టింగ్‌ చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. కొన్ని సంవత్సరాలుగా స్థానికులు, పర్యావరణ వేత్తలు, నిపుణులు ఈ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు.
 

                                                      సుప్రీంకోర్టు కమిటీ సిఫార్సులు పట్టని ప్రభుత్వాలు

2013లో ఉత్తరాఖండ్‌లో భారీ ఎత్తున వరదలు రావడంతో చోప్రా కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. సముద్ర తీరానికి 2,200 మీటర్ల నుంచి 2,500 మీటర్ల ఎత్తులో ఉన్న పేరా గ్లేసియల్‌ జోన్‌లో ఎటువంటి డ్యామ్‌లు, హైడెల్‌ ప్రాజెక్టులు నిర్మించవద్దని ఈ కమిటీ పేర్కొంది. ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్టులను రద్దు చేయాలని, ఆ ప్రాంత భద్రతకు ఈ చర్యలు అత్యవసరమని తెలిపింది. అయినా ప్రాజెక్టులు కొనసాగుతూనే ఉన్నాయి. వీటితోపాటు పర్యాటక రంగం కోసం నిర్మిస్తున్న ప్రాజెక్టులు కూడా జోషిమఠ్‌ విధ్వంసానికి కారణమని నిపుణులు చెబుతున్నారు.