Mar 18,2023 09:27
  • అక్కడో అంకె.. ఇక్కడో అంకె
  • రాజ్యసభకు, అసెంబ్లీకి వేర్వేరు వివరాలు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రుణాలపై లెక్కలు కొన్ని అనుమానాలకు ఆస్కారమిస్తున్నాయి. కేంద్రానికి పంపించిన లెక్కలు, శాసనసభలో ప్రకటించిన లెక్కల మధ్య తేడాలు ఉన్నాయి. అసెంబ్లీలో వెల్లడించినవాటికి , ఢిల్లీకి పంపించిన వాటికి మధ్య 30 రోజులే తేడా అయినా, లెక్కల్లో భారీ అంతరాలు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం రాజ్యసభలో రాష్ట్ర అప్పులపై సభ్యుల ప్రశ్నకు సమాధానంగా రాష్ట్ర ఆర్థికశాఖ కేంద్రానికి వివరాలు సమర్పించింది. ఇందులో రాష్ట్రం చేసిన రుణాలు ఎంత, ఏయే రంగాల నుంచి ఎంత సమీకరించారన్నది వివరించింది. ఇప్పుడు అవే రంగాల నుంచి ఎంత రుణాలు తీసుకున్నామన్నది శాసనసభలో కూడా వెల్లడించారు. ఈ రెండు అంకెల మధ్య తేడాలు ఎక్కువగానే ఉన్నాయి. బహిరంగ మార్కెట్‌ రుణాలుగా రూ.3,04,033 కోట్లు ఫిబ్రవరి 14వ తేదీవరకు తీసుకున్నట్లు కేంద్రానికి పంపించిన నివేదికలో పేర్కొన్నారు. అయితే శాసనసభలో ప్రకటించిన వివరాల్లో రూ.3,11,224 కోట్లు తీసుకున్నట్లు పేర్కొన్నారు. నెల రోజుల్లో రూ.ఏడు వేల కోట్ల వరకు తీసుకున్నట్లు పేర్కొనడం గమనార్హం. ఇక ప్రావిడెండ్‌ ఫండ్‌ నుంచి ఫిబ్రవరి వరకు రూ.51,719 కోట్లు తీసుకున్నట్లు చెప్పిన ఆర్థికశాఖ అధికారులు, శాసనసభలో మాత్రం రూ.28,695 కోట్లు మాత్రమే తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఒక్కసారిగా రూ.23 వేల కోట్లు వరకు తగ్గడం ఎలా సాధ్యం?. ఇక మొత్తం రుణాలు కూడా రూ.4,32,257 కోట్లకు చేరుకున్నట్లు కేంద్రానికి పంపిన నివేదికలో పేర్కొనగా, శాసనసభలో ప్రవేశపెట్టిన నివేదికలో మాత్రం రూ.4,26,234 కోట్లుగా పేర్కొన్నారు.

11