Oct 05,2022 16:31

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని జాతీయ పార్టీ 'భారత్‌ రాష్ట్ర సమితి'గా మారుస్తూ ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ బుధవారం ప్రకటించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన తెరాస సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు తీర్మానం పెట్టగా.. సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇకపై తెరాస 'భారత్‌ రాష్ట్ర సమితి' (భారాస)గా మారనుంది. అనంతరం ఆ తీర్మానంపై కేసీఆర్‌ సంతకం చేశారు. ఆ తర్వాత తీర్మానాన్ని ఆయన చదివి వినిపించి 'భారత్‌ రాష్ట్ర సమితి' పేరును ప్రకటించారు. పేరు మార్పుపై పార్టీ రాజ్యాంగంలో సవరణ చేసినట్లు చెప్పారు. కేసీఆర్‌ పార్టీ పేరు మార్పును ప్రకటించగానే సమావేశంలో సభ్యులంతా చప్పట్లతో మద్దతు పలికారు. భారాస పేరు ప్రకటించిన అనంతరం కేసీఆర్‌ను జేడీఎస్‌ నేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి శుభాకాంక్షలు చెప్పారు. ఆ తర్వాత శాలువాతో కుమారస్వామి ఆయన్ను సత్కరించారు.
తెరాసను భారత్‌ రాష్ట్ర సమితిగా కేసీఆర్‌ ప్రకటించగానే తెలంగాణ భవన్‌తో పాటు జిల్లాల్లోని పార్టీ కార్యాలయాల ముందు బాణసంచా కాల్చారు. డప్పు వాయిద్యాలతో ఆనందోత్సాల మధ్య నేతలు, కార్యకర్తలు నృత్యాలు చేశారు. సమావేశం అనంతరం పార్టీ పేరు మార్పుపై కేంద్ర ఎన్నికల సంఘానికి సీఎం లేఖ రాశారు. పార్టీ రాజ్యాంగాన్ని సవరించి తెరాసను 'భారత్‌ రాష్ట్ర సమితి'గా మార్చినట్లు లేఖలో ఆయన పేర్కొన్నారు. సర్వసభ్య సమావేశంలో పార్టీ పేరు మార్పుపై తీర్మానం చేశామని.. దీన్ని ఆమోదించాలని ఈసీని కేసీఆర్‌ కోరారు.