Jun 24,2022 07:03

ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి :  కాకినాడ జిల్లాలో వరి నాట్లు మందకొడిగా సాగుతున్నాయి. ప్రభుత్వం జూన్‌ ఒకటిన పంట కాలువలకు సాగునీటిని విడుదల చేసింది. విత్తనాలు సిద్ధంగా ఉంచకపోవడం, పంట కాలువల ద్వారా నీటి లభ్యత సక్రమంగా లేకపోవడంతో అనేక ప్రాంతాల్లో నారు మడులు కూడా సిద్ధం కాలేదు. కాకినాడ జిల్లాలో ఈ ఖరీఫ్‌లో 2,31,245 ఎకరాల్లో వరి సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందుకోసం 69,374 క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతాయని ప్రభుత్వానికి నివేదించింది. 4,500 క్వింటాళ్ల విత్తనాలు మాత్రమే ప్రస్తుతం సిద్ధంగా ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో రైతులకు కావాల్సిన రకాలను ముందుగా ఆర్‌బికెల ద్వారా ఇండెంట్‌ పెట్టాలి. రైతులు డబ్బులు చెల్లించిన రెండు రోజుల్లో సబ్సిడీ విత్తనాలను అందించాల్సి ఉంది. సంపత్‌ స్వర్ణ, సాధన, ఓంసాయి వంటి రకాలు కావాలని పిఠాపురం, యు.కొత్తపల్లి, గొల్లప్రోలు, కాకినాడ రూరల్‌ పండూరు, నేమాం, తమ్మవరం, సామర్లకోట మండలంలోని కొన్ని గ్రామాలు, తొండంగి, శంఖవరంలలో మరికొన్ని ప్రాంతాల్లో రైతులు కోరుతున్నారు. పది రోజులు దాటినా వాటిని అందజేయలేకపోయారు. ఖరీఫ్‌లో అన్ని రకాల ఒత్తిళ్లనూ సంపత్‌ స్వర్ణ రకం, ఓంసాయి, సాధన రకాలు తట్టుకోగలవని రైతులు చెబుతున్నారు. గతేడాది మాదిరి ఈసారీ వీటిని సాగు చేయడానికి మొగ్గుచూపుతున్నారు. ప్రభుత్వం ఎపి సీడ్స్‌ ద్వారా బిపిటి 5204, ఎంటియు 7029, 1061,1064, ఆర్‌జెఎల్‌ 2537 రకాలను మాత్రమే ఇస్తోంది. అవి కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంపత్‌ స్వర్ణ రకం విత్తనాల సరఫరా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని పిఠాపురం మండలం విరవాడకు చెందిన కందా విజరు ప్రకాష్‌, ఉప్పరపల్లి సుబ్రహ్మణ్యం, ఎఫ్‌.కె పాలేనికి చెందిన బసవ కృష్ణ, పల్లపు రాజు, చిత్రాడకు చెందిన బావిశెట్టి భాస్కరరావు, ఎం. రాంబాబు తదితర రైతులు 'ప్రజాశక్తి'కి తెలిపారు.
30,063 ఎకరాల్లోనే వరి నాట్లు
ముందస్తు ఖరీఫ్‌ నేపథ్యంలో జూన్‌ నెలాఖరు నాటికి కాకినాడ జిల్లాలో 2,31,245 ఎకరాల్లో వరి నాట్లు పడాల్సి ఉంది. ప్రస్తుతం 30,063 ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. మరో 1,06,890 ఎకరాలకు సరిపడా నారు వేశారు. ఇది మరో వారంలోగా సిద్ధమవుతుంది. నెలాఖరు నాటికి లక్ష ఎకరాల్లో మాత్రమే నాట్లు పడే అవకాశం ఉందని వ్యవసాయ శాఖాధికారులు అంచనా వేస్తున్నారు.
కోరిన విత్తనాలు అందిస్తాం
కొన్ని ప్రాంతాల్లో ప్రైవేటు సీడ్స్‌ పట్ల రైతులు మొగ్గుచూపుతున్నారు. రైతులు కోరిన విత్తనాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. రైతులు ఆందోళన చెందనవసరం లేదు.
- ఎన్‌.విజరు కుమార్‌, జెడి, వ్యవసాయ శాఖ, కాకినాడ జిల్లా