Oct 02,2022 20:57

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :రాష్ట్ర వ్యాప్తంగా రేషన్‌ కార్డు కలిగియున్నవారందరికీ కందిపప్పు, పంచదార తక్షణమే పంపిణీ చేయాలని ఐద్వా రాష్ట్రకార్యదర్శి డి.రమాదేవి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్డుదారులందరికీ సరిపడా నిల్వలను సేకరించకపోవడం పౌర సరఫరాల శాఖ బాధ్యతా రాహిత్యమేనన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొన్ని ప్రాంతాల్లో రెండు, మూడు నెలలుగా కందిపప్పు మొక్కుబడిగా సరఫరా చేస్తున్నారని, అది కూడా నాణ్యత లేని పప్పు అని ఆమె పేర్కొన్నారు. దసరా సందర్బంగా గ్రీవెన్‌సెల్‌కు ఫోన్‌ చేస్తే కందిపప్పు, పంచదార సరిపడినంత స్టాకు లేదని సమాధానమిస్తున్నారని ఆమె తెలిపారు. కందిపప్పు, పంచదార కార్డుదారులందరికీ పంపిణీ జరిగే విధంగా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విజయదశమిలోగా రేషన్‌ దుకాణాల్లో పప్పు, పంచదార పంపిణీ చేయని పక్షంలో కలెక్టరేట్లు, మండల కార్యాలయాలు, గ్రామ సచివాలయాల వద్ద పిటీషన్లు ఇచ్చి నిరసన తెలియజేస్తామని పేర్కొన్నారు.