
వితంతువు వివాహం చేసుకోరాదనే చెడు సాంప్రదాయానికి వ్యతిరేకంగా స్త్రీల పునర్వివాహాలు చేయడానికి 1879 నుండి కంకణం కట్టుకున్న సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు.. ఎన్ని కష్టాలు, ఒడుదుడుకులు, ఛీత్కారాలు ఎదురైనా ధైర్యంగా వితంతువులకు పునర్వివాహాలు జరిపించాడు. వారి కోసం పునరావాస, శరణాలయాలు స్థాపించాడు. బాలికలకు ప్రత్యేకంగా రాజమండ్రిలో పాఠశాల స్థాపించి తెలుగునాట సంస్కరణోద్యమ 'వేగుచుక్క'గా వెలుగొందాడు.
1919 మే 27న మరణించిన కందుకూరి 104వ వర్థంతిని పురస్కరించుకుని సంవత్సరం పొడవునా తెలుగునాట వివిధ కార్యక్రమాలు సాగుతున్నాయి. ఆయన జీవితాన్ని, స్త్రీజనోద్ధరణకు ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవలసిన అవసరం ఎంతైనా వుంది. నేడు మహిళల మీద దుర్మార్గపు హింస, అత్యాచారాలు, హత్యలు పెచ్చుమీరడం చూస్తున్నాం. ఇటువంటి రోజులలో మహిళల రక్షణకు పాటుపడేవారు ఎలాంటి తెగింపుతో ముందుకు సాగాలో కందుకూరి జీవితం నేర్పుతుంది. ఒకపక్క మార్కెట్ శక్తులు మహిళలను విలాస వస్తువుగా చూపిస్తున్నాయి. మరో వైపు మార్కెట్ శక్తులకు జీ హుజూర్ అంటున్న వారు మహిళలను మూఢత్వంతో మునిగిపోమని బోధిస్తున్నారు. ప్రేరేపిస్తున్నారు.
తిథులు, వారాలు, నక్షత్రాలు, జాతకాల పేరుతో తిరోగమన భావజాలం పేట్రేగిపోతోంది. ఏమిటీ దారుణం? అనుకునే వారంతా వ్యక్తులుగా, సమూహాలుగా స్త్రీల మాన, ప్రాణ రక్షణకు కృషి చేయవలసి వుంది. మహిళలను మార్కెట్ సరుకుగా మారుస్తున్న కార్పొరేట్ అరాచకానికి, స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా కూడా జమిలి పోరాటం సాగాలి. అందుకు నేటికీ ప్రేరణ కలిగించేదిగా మనకు కందుకూరి వీరేశలింగం జీవితం స్ఫూర్తినిస్తుంది. రచనల ద్వారా తెలుగు భాష అభివృద్ధికి పాటుపడటం, మహిళా విద్య కోసం పాటుపడిన తీరు, వితంతు వివాహాల కోసం చేసిన ప్రయత్నాలు, అవినీతికి వ్యతిరేకంగా పత్రిక ద్వారా చేసిన ప్రయత్నం, ప్రేరణ కలిగిస్తూనే వుంటాయి.
- జీవిత సంగ్రహం...
పసి బాలికలకు ముసలి వారితో వివాహాలు చేసే రోజులవి. భర్త చనిపోతే వితంతువులు మరలా పెళ్లి చేసుకోరాదనే మూఢాచారం అమలులో వున్న సాంఘిక పరిస్థితులలో కందుకూరి వీరేశలింగం 1848 ఏప్రిల్ 16న రాజమండ్రిలో సుబ్బారాయుడు, పున్నమ్మ దంపతులకు జన్మించాడు. చిన్నప్పటి నుంచీ 'ఏక సంధాగ్రాహి'గా వుండేవాడు. బడిలో పాఠాలు ఒక్కసారి చదివితే కంఠతా వచ్చేసేవి. ఇంటిలో అటక మీద వున్న తాటాకు పుస్తకాలు తీసి చదివేవాడు. దాంతో తెలుగు మీద అభిమానం పెరిగింది.
బడిలో చదువు, సత్ప్రవర్తనలో వీరేశలింగందే అగ్రస్థానం. అనేకసార్లు అధికారులు, పెద్దల నుండి బహుమతులు పొందాడు. మూడో ఫారం చదువు తుండగానే జబ్బు చేసింది. తిరిగి 5వ ఫారంలో అనారోగ్యం. కుటుంబ ఇబ్బందులతో కూడా హైస్కూలు విద్య పూర్తి చేసి కళాశాల ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందుల పేరుతో చదువు మధ్యలో ఆపేయలేదు. తల్లిదండ్రులు వీరేశలింగం చదువును తాము ఎన్ని ఇబ్బందులతో వున్నా మాన్పించలేదు.
వీరేశలింగానికి జబ్బు చేస్తే ఎవరో తన కుమారుడికి చేతబడి చేశారని భూతవైద్యుని పిలిపించి వైద్యం చేయించడానికి ప్రయత్నించింది ఆయన తల్లి. ఆ భూత వైద్యుడిని వీరేశలింగం వివిధ ప్రశ్నలు వేయడంతో భయపడి పారి పోయాడు. ఇంటికి వెళ్లాక అనారోగ్యం పాలయ్యాడు. పైగా వీరేశలింగం తనకే చేతబడి చేశాడని భయపడిపోయాడు. దీంతో వీరేశలింగం అతని ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పి అతని ఆరోగ్యం కుదుటపర్చాడు. దెయ్యాలు, భూతాలు లేవంటూ వాదించేవాడు. తోటి వారితో సవాలు చేసి అర్ధరాత్రి, అమావాస్యనాడు శ్మశానానికి వెళ్లి తెల్లవారి మామూలుగానే వచ్చి ఒక్క దెయ్యం కూడా కనపడలేదని దెయ్యాల పేరుతో భయాలు అనవసరం అని ఆనాడే చాటి చెప్పాడు.
- వీరేశలింగానిదీ బాల్య వివాహమే
వీరేశలింగానికి 13వ ఏట పట్టాభిరామయ్య ఏడేళ్ల కుమార్తె బావమ్మ లక్ష్మీరాజ్యంతో వివాహం జరిగింది. వారిద్దరూ తెలుగు నాట సంస్కరణోద్య మాలకు తోడ్పడ్డారు. వీరేశలింగం రాజమండ్రిలో ఒక సంవత్సరం పాటు ఉపాధ్యాయుడిగా పని చేశాడు. 1872వ సంవత్సరంలో కోరంగిలో ఇంగ్లీషు పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా ఉద్యోగం లభించింది. అప్పటికే ఆయన ఆలోచనల్లో మార్పు వచ్చింది. మూఢ నమ్మకాలు, ఆచారాలు మీద నమ్మకాలు మారిపోయాయి. కోరంగి స్కూలులో చేరటానికి అమావాస్యనాడు వెళ్లే ముహూర్తం నిర్ణయించుకున్నాడు. ఆ విధంగా భూమి, సూర్యుడు చుట్టు తిరగడం వల్ల ఏర్పడే సంవత్సరం లోని రోజులలో మంచి రోజులు, చెడు రోజులు అనే తేడాలు చూడడం మూఢత్వంగా చాటి చెప్పాడు.
వితంతువు వివాహం చేసుకోరాదనే చెడు సాంప్రదాయానికి వ్యతిరేకంగా స్త్రీల పునర్వివాహాలు చేయడానికి 1879 నుండి కంకణం కట్టుకున్నాడు. అనేక కష్టాలు, వ్యతిరేకతలు, ఛీత్కారాలు ఎదురైనా ధైర్యంగా వితంతువులకు పునర్వివాహాలు జరిపించాడు.
1886లో రాజమండ్రి పురపాలక సంఘ సభ్యుడుగా, తరువాత పురపాలక సంఘ అధ్యక్షుడిగా పని చేశాడు. వితంతువుల పునరావాస, శరణాలయాలు స్థాపించాడు. బాలికలకు ప్రత్యేకంగా రాజమండ్రిలో పాఠశాల స్థాపించి తెలుగునాట సంస్కరణోద్యమ 'వేగుచుక్క'గా వెలుగొందాడు.
- సంఘసంస్కరణలు-వితంతు వివాహాలు
మత సాంప్రదాయ కుటుంబానికి చెందిన వీరేశలింగం విద్యార్థి దశ లోనే ముఖానికి విభూది రేఖలు, మెడలో లింగకాయ తీసి వేశాడు. ఆ రకంగా మత చిహ్నాలను తొలగించుకోవడం ద్వారా ప్రారంభమైన సంస్కరణ కార్యక్రమం జీవితాంతం కొనసాగింది. 1874లో మిత్రులతో కలిసి సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై ప్రచారం చేసేందుకు 'వివేకవర్ధని' పత్రికను స్థాపించి తెలుగు ప్రజా సమాజంలో వున్న అవలక్షణాలను, అధికారుల లంచగొండితనాన్ని, మూఢాచారాలకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. రాజమండ్రిలో ఒక ప్రభుత్వ న్యాయవాది, జిల్లా మున్సిఫ్ మేజిస్ట్రేటు కలసి కోర్టును లంచాలశాలగా మార్చగా దానిపై తన పత్రికలో రాసి విచారణ జరిగేలా చేసి వారిని ఉద్యోగాల నుంచి తొలగించేలా చేశాడు. ఇతర అధికారుల లంచగొండితనానికి వ్యతిరేకంగా వార్తలు రాసి అనేకమంది వ్యతిరేకతను సైతం ధైర్యంగా ఎదుర్కొన్నాడు.
చిన్నప్పుడే పెళ్లయిన స్త్రీలు, భర్త చనిపోతే జీవితాంతం వితంతువుగానే పడి ఉండాల్సిందేననే దురాచారం అమలులో వుండేది. దీనిపై చలించిన వీరేశలింగం తన మిత్రులతో కలసి స్త్రీల పునర్వివాహాలను గూర్చి బహిరంగ సభల ద్వారా ప్రచారం చేశాడు. కేవలం ప్రచారం తోనే కృషిని పరిమితం చేయకుండా కార్యాచరణకు పూనుకున్నాడు. రాజమండ్రిలో మిత్రులతో కలసి 1878 సెప్టెంబరు 8న 'సంఘ సంస్కరణ' సమాజం స్థాపించాడు.
- మూఢాచారాలకు వ్యతిరేకంగా కృషి
వీరేశలింగం స్త్రీ పునిర్వవాహం కోసం జరిపిన కృషి, ప్రచారాలను మొదటి నుండి అనేక మంది వ్యతిరేకించారు. కొన్ని సందర్భాలలో మూర్ఖులు, వీరేశలింగంపై ప్రత్యక్ష దాడులకు సిద్ధపడిన సంఘ టనలూ వున్నాయి. అనేక కష్టాలు, వ్యతిరేకతలు, ఛీత్కారాలు ఎదురయ్యాయి. అభ్యుదయ వాదులైన కొందరు విద్యార్థులు, యువకులు మాత్రం ఆయనకు తోడ్పడేవారు. ఒకసారి రాజమండ్రిలో వితంతువుల పునర్వివాహాలు శాస్త్ర విరుద్ధం కాదని ఉపన్యాసం ఇస్తుండగా కొందరు మూర్ఖులు దాడి చేయబోయారు. విద్యార్థులు వీరేశలింగాన్ని రక్షించారు. కాకినాడలో కూడా దాడి జరుగగా ఆనందాచార్యులనే సంస్కరణాభిలాషి తన బండిలో ఎక్కించుకొని కాపాడారు. వితంతు పునర్వివాహాలు గురించి ప్రజలలో బాగా స్పందన వచ్చింది. వధూవరుల కోసం రాత్రిళ్లు ప్రయాణాలు చేయడం, ఆడపిల్లలకు మగవేషాలు వేయడం, వాళ్లను ఎత్తుకొని మైళ్ల కొద్దీ నడవడం వంటి కష్టాలు పడ్డాడు. వీరేశలింగం తన ఇంటికి చేరిన వితంతువులను కాపాడి వివాహాలు చేశాడు. బంధువులు, మిత్రులు, ఆప్తులు వ్యతిరేకించినా ఇబ్బందులొచ్చినా ఏనాడూ ఒక్కడుగు వెనక్కి వేయలేదు.
వీరేశలింగం చేసిన మొదటి వితంతు పునర్వివాహం కృష్ణా జిల్లా రూపూడి గ్రామానికి చెందిన పన్నెండేళ్ల గౌరమ్మకు 22 ఏళ్ల గోగులపాటి శ్రీరాములుకు 1881 డిసెంబరు 11న రాజమండ్రిలో జరిపించాడు. వీరేశలింగానికి మొదట్లో సహాయకులుగా వున్నవారు కొందరు తరువాత దూరమయ్యారు. అయినా కార్యదీక్షతో కొద్ది సంవత్సరాల కాలంలోనే 112 వితంతు వివాహాలు జరిపించాడు. దీంతో దేశ నలుమూలల నుంచి ప్రశంసలు పొందాడు.
- మహిళా విద్య కోసం కృషి
ఈ విధంగా స్త్రీ పునర్వివాహాల గురించి ఉద్యమం నిర్వహిస్తూనే స్త్రీ విద్య కోసం బాలికల పాఠశాల నిర్మించడం, రాత్రి పాఠశాలలు నిర్వహించడం వంటివి చేశాడు. ఆయన జీవితాంతం స్త్రీల అభ్యున్నతి కోసం పాటుపడ్డాడు.
మెడలో జంధ్యాన్ని పీకి పారేసిన, అమావాస్యనాడు ఉద్యోగంలో చేరాడు, అగ్ర వర్ణాలకు మాత్రమే చదువు పరిమితంగా చెప్పే పంతుళ్ల స్థానంలో అందరికీ అందులోనూ ఆడపిల్లల కోసం స్కూలు ఏర్పాటు చేశాడు.
నేడు సమాజంలో పెరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, వరకట్న హత్యలు వంటి సామాజిక రుగ్మతలపై కందుకూరిని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు, యువత, అభ్యుదయవాదులు కలసి కట్టుగా పోరాడాల్సిన అవసరముంది. ఇదే ఆ మహనీయునికి మనం అర్పించే నిజమైన నివాళి.
- గుడిపాటి నరసింహారావు ( వ్యాసకర్త )