Sep 04,2022 10:38

రోడ్డు మీద.. షాపుల్లో చక్కగా ప్యాక్‌ చేసిన వాటిల్లో దొరికే కరకరలాడే స్నాక్స్‌.. మనమే మన ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా.. అలా తయారుచేసుకున్నప్పుడు పిల్లలు కూడా ఆశ్చర్యపోతూ ఆనందిస్తారు.. ఇంతకన్నా సంతోషం వేరే ఇంకేముంటుంది? కారం బఠాణీలు.. ఉప్పు వేరుశనగలు, బొంబాయి శనగలు, మూంగ్‌దాల్‌.. ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.
ఉప్పు వేరుశనగలు

verusanaga


వేరుశనగలు - 2 కప్పులు, నీళ్లు - తగినన్ని - బేకింగ్‌ సోడా - 1/2 టీస్పూన్‌, నూనె - తగినంత, ఉప్పు- తగినంత.
తయారీ : స్టవ్‌పై గిన్నె పెట్టి, మూడు కప్పుల నీళ్లు పోసి, వేడి చేయాలి. వేరుశనగ పప్పులు ఒక బౌల్‌లోకి తీసుకోండి. ఈ ప్రాసెస్‌కి షోలాపూర్‌ పల్లీలు అయితే చాలా బాగుంటాయి. అవి లేకపోయినా, మనకు దొరికే వాటితోనే చేసుకోవచ్చు. ముందుగా పప్పులను బాగా కడిగాక, అర టీస్పూన్‌ ఉప్పు వేసి బాగా కలిపి ఉంచుకోవాలి. ఈలోపు నీళ్లు మరుగుతూ ఉంటాయి. ఈ మరిగే నీటిలో ఉప్పు కలిపి పెట్టుకున్న వేరుశనగ పప్పులు వేసి, కలపాలి. బాగా కలిపాక స్టవ్‌ ఆపేసి, మూతపెట్టి పావు గంటసేపు ఉంచాలి. ఇవి కొద్దిగా ఉడికినట్లు అవుతాయి. ఇప్పుడు వీటిల్లోని నీళ్లు వార్చేసి, రెండు నిమిషాలు వదిలేయాలి. ఇందులో స్పూన్‌ ఉప్పు వేసి కలిపి ఆరబెట్టాలి. ఇవి కాస్త ఆరాక స్టవ్‌ పై మందపాటి గిన్నెను పెట్టి మూడు కప్పుల ఉప్పు వేసి, హై ఫ్లేమ్‌లో వేడి చేయాలి. ఉప్పు బాగా వేడయ్యాక ఆరిన వేరుశనగ పప్పుల్ని వేసి, ఫ్రై చేయాలి. ఇలా కొద్దిసేపు వేయించాక, మధ్యస్థంగా కూడా ఉంచి మరికొద్దిసేపు వేయించాలి. ఇవి పొడి పొడిగా, చిటపటలాడుతుంటే, జాలి గరిటెతో తీసుకోవాలి. అధికంగా మాత్రం వీటిని వేయించుకోవద్దు. లోపల గింజ మాడిపోతుంది. అంతే ఉప్పు వేరుశనగపప్పులు రెడీ.
కారం బఠాణీలు

batani


కావలసినవి : ఎండు బఠాణీలు - 400 గ్రాములు, నీళ్లు - తగినన్ని - బేకింగ్‌ సోడా - 1/2 టీస్పూన్‌, నూనె - తగినంత, ఉప్పు, కారం - తగినంత, చాట్‌ మసాలా - తగినంత.
తయారీ : ఎండు బఠాణీలు శుభ్రంగా కడిగి, ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. అవి మునిగే వరకూ నీళ్లు పోసుకోవాలి. వీటిని నాలుగు గంటలు నాననివ్వాలి. రాత్రి నానబెట్టి, ఉదయం చేసుకున్నా ఫర్వాలేదు. ఇవి క్రిస్పీగా రావాలంటే బఠాణీలు నానబెట్టినప్పుడే అర టీస్పూన్‌ బేకింగ్‌ సోడా కూడా వేయాలి. ఇప్పుడే ఉప్పుని కూడా కొద్దిగా వేయాలి. నానిన బఠాణీలను మునిగే వరకూ మందపాటి గిన్నెలో 7-8 నిమిషాలు హై ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. బఠాణీలపై పొర పోకుండా చూసుకోవాలి. ఇలా కొద్దిసేపు ఉడికిన బఠాణీలు వేయించినప్పుడు బాగుంటాయి. ఉడికిన బఠాణీల్లో నీటిని వార్చేసి, అరగంట నుండి గంట వరకూ ఆరనివ్వాలి. చేతికి తడి అంటకుండా ఉండాలి. అప్పుడే ఆరినట్లు. ఆరిన బఠాణీలను తర్వాత నూనెలో డీప్‌ ఫ్రై చేసుకోవాలి. వీటిని టిష్యూ పేపర్‌లోకి తీసుకుని, నూనె లేకుండా చేయాలి. వీటిని ఒక బౌల్‌లోకి తీసుకుని, ఉప్పు, కారం, చాట్‌ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. అంతే కారం బఠాణీలు రెడీ! వీటిని పూర్తిగా చల్లారక గాజు సీసాలో భద్రపరిస్తే నెలరోజుల వరకూ నిల్వ ఉంటాయి. పిల్లలు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు.
మూంగ్‌దాల్‌

mundoll

 

కావలసినవి :పొట్టు తీసిన పసుపురంగు పెసరపప్పు - 1/4 కేజీ, నీళ్లు - తగినన్ని - బేకింగ్‌ సోడా - 1/2 టీస్పూన్‌, నూనె - వేగించడానికి సరిపడా, ఉప్పు - తగినంత.
తయారీ : పెసరపప్పుని రెండు, మూడుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఒక బౌల్‌లోకి పెసరపప్పును తీసుకుని, మునిగే వరకూ నీళ్లు పోయాలి. ఇలా నాలుగు గంటలు నానబెట్టాలి. తర్వాత నీటిని వడకట్టి పలుచగా ఆరబెట్టాలి. చేతికి తడి తగలకుండా అరగంటసేపు ఆరబెడితే సరిపోతుంది. ఇలా ఆరిన పెసరపప్పుని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. నూనెలో జాలి గరిటెలోకి పెసరపప్పుని తీసుకుని వేయించుకోవాలి. ఇలా వేయించేటప్పుడు రంగు మారకుండా, సమానంగా వేగాలంటే కలుపుతూ సెగ మధ్యస్థంగా ఉండేలా చూసుకోవాలి. వేగినదీ లేనిదీ ఒక పప్పును నొక్కి చూస్తే క్రిస్పీగా అయ్యిందో లేదో తెలుస్తుంది. వేగిన పెసరపప్పును టిష్యూ పేపర్‌లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల వీటిల్లో అదనంగా ఉన్న నూనె పోతుంది. దీన్ని ఒక బౌల్‌లోకి తీసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. మీకు ఇష్టమైతే కారం, చాట్‌ మసాలా, ఆమ్‌చూర్‌ కూడా వేసి కలుపుకోవచ్చు. అప్పటికప్పుడు తినేంత తీసుకుని, అందులో ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగి వేసుకుని, కొద్దిగా నిమ్మరసం పిండుకుని తింటే బాగుంటుంది. ఇలాగే పచ్చి శనగపప్పుతోనూ ఇలాగే చేసుకోవచ్చు.