Aug 05,2022 10:19

90 ఏళ్లుగా పురుషులే రాజ్యమేలుతున్న నృత్యరూపకం కథాకళి. అక్కడ స్త్రీ, పురుష పాత్రలను అవలీలగా పోషించేస్తూ దేశ విదేశ ప్రశంసలందుకున్న పురుష కళాకారులు కోకొల్లలు. పురాణ కొట్టక్కల్‌ శివరామన్‌ కళ్లు తిప్పుకోనీయని నాయిక పాత్రలో ఎన్నో ప్రదర్శనలిచ్చిన ప్రముఖవ్యక్తి. అటువంటి కళలోకి, ఆ కళామండలంలోకి తొలిసారి అడుగుపెట్టారు వనితలు. ఆర్య, అక్షయ, దుర్గ, శ్వేత కేరళ కళామండలంలో కథాకళి నృత్యం అభ్యసిస్తున్న మొదటి బ్యాచ్‌గా చరిత్ర సృష్టించారు. వల్లథోల్‌నగర్‌లో ఉన్న ప్రసిద్ధ కళామండలంలో ఎన్‌ ముకుందన్‌ ఆసన్‌ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఆ యువతుల బృందం శిక్షణ తీసుకుంటోంది.

01        పురుషులచే ప్రదర్శించబడుతూ ప్రోత్సహించబడుతూ ఉన్న కథాకళి నృత్యకళ 400 ఏళ్ల చరిత్ర గలది. 1930ల్లో కుంజున్ని రాజ ఆధ్వర్యంలో కవి, కథాకళి అభిమాని వల్లథోల్‌ నారాయణ మీనన్‌ కోరిక మేరకు రాజదర్బార్‌లో కళామండలం స్థాపించబడింది. ఆ తరువాత 1936 నాటికి ప్రస్తుత ప్రాంతంలో స్థిరపడింది. కేరళ సాంప్రదాయ కళల్లో కథాకళిది అద్భుతమైన పాత్ర. దేశంలోనే అత్యంత కష్టతరమైన నృత్యరూపంగా పరిగణించే కథాకళికి ప్రసిద్ధ కళాకారులు కళామండలం గోపి, కృష్ణనాయర్‌ ప్రపంచ ఖ్యాతి తెచ్చిపెట్టారు. పురుషాధిక్య నృత్యరూపంగా వేన్నోళ్ల కొనియాడబడుతోన్న ఈ కళ ఇప్పుడు మహిళల రంగప్రవేశంతో మరింత శోభను సంతరించుకొంది.
 

                                                                 ఒకప్పుడు మహిళల ప్రవేశం నిషిద్ధం

కళామండలం స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు మహిళలకు ప్రవేశం ఇవ్వలేదు. కఠినమైన నియమనిబద్ధతలతో ఈ కళను ఒంటబట్టించుకోవాలని, నేలమీద బార్లా పడుకున్న కళాకారుడి ఒంటిపై నూనె రాసి పాదాలతో శరీరమంతా మర్దనా చేసి అధిక ఒత్తిడిని కలుగజేసే వ్యాయామం ఇందులో కీలక అభ్యసన ప్రక్రియ. అలా ఒత్తిడిని కలుగజేయడం ద్వారా శరీరం ఏ భంగిమలోకైనా మారే వీలుంటుందని కళాకారులు చెప్పేవారు. అయితే ఈ ఆధునిక యుగంలో ఈ రకమైన వ్యాయామం అవసరమా అంటూ దీనిపై కొంతమంది విమర్శలు కూడా చేశారు. మహిళల ప్రవేశానికి ఈ వ్యాయామం ఓ సాకు మాత్రమే. భారతదేశ అనేక నృత్యకళలో మహిళలు రంగప్రవేశం చేసి తమ శక్తిసామర్థ్యాలను నిరూపించుకున్నారు. అనాదిగా అగ్రకుల పురుషులు, భూస్వామ్య ప్రభువులు పోషించిన కథాకళి నృత్య కళలో మహిళలపై నిషేధం విధించడం వెనుక బలమైన పితృస్వామ్య పునాదులు ఉన్నాయి.
      పురాతన నృత్యరీతి కుడియాట్టంలో మహిళలకు ప్రవేశం ఉండగా కథకళికి దూరం చేయడంలో అర్థం లేదని ఎంతోమంది నిపుణులు, కళాభిమానులు అభిప్రాయపడ్డారు. ప్రముఖ కథకళి నృత్యకారులు గోపీ అసన్‌ దీనికి మద్దతుగా నిలిచారు. అయితే స్త్రీల ప్రవేశం వల్ల కళారూపం దాని ఆత్మతో రాజీపడవలసి వస్తుందని కొంతమంది నుంచి ప్రతిఘటన ఎదురైంది. ఇలా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని కళామండలంలోకి మహిళలను అనుమతించారు.

 

02


 

                                                                        త్రిపురాంతర కళామండలం

1975 నుంచే త్రిపురాంతర వనిత కథాకళి కేంద్రంలో మహిళా కళాకారులు ఈ నృత్యరీతిని అభ్యసిస్తున్నారు. కాని చవర పారుకుట్టి మినహా చాలామంది మహిళలు ప్రధాన స్రవంతిలోకి ప్రవేశించలేకపోయారు.
      ఎన్నో ప్రతికూలతలను అధిగమించి వల్లథోల్‌ కళామండలంలోకి గతేడాది 8వ తరగతి బాలికలకు ప్రవేశం కల్పించారు. అయితే కరోనాతో విద్యార్థులు తరగతులకు హాజరుకాలేదు. ఇటీవల తెరుచుకున్న కళామండలంలోకి విద్యార్థినులు అడుగుపెట్టడంతో కళామండలం కొత్త కళతో విరాజిల్లుతోంది. బాలురతో సమానంగా బాలికలు శిక్షణ తీసుకుంటున్నారు. లింగభేదాన్ని రూపుమాపిన కళామండలం సనాతన సాంప్రదాయ పునాదుల కింద నలిగిపోతున్న ఎంతోమంది మహిళల అభిరుచిని, ఆకాంక్షలకు కొత్తపుంతలు తొక్కిస్తోంది.
     కళకు కులమత భేదాల్లేవు. లింగభేదాలసలే లేవు. కాని నేటికీ కళ కొందరికే.. కొన్ని కులాలకే.. మతాలకే.. పురుషులకే అంటూ కళను ప్రేమించేవారిని కళకు దూరం చేస్తున్నారు. ఇటీవల కళామండలం అభ్యర్థుల కోసం ఇచ్చిన ప్రకటన చూసి దరఖాస్తు చేసుకున్నవారంతా కథకళికి పూర్వచరిత్ర లేనివారే కావడం విశేషం. ఇప్పుడక్కడ స్త్రీ, పురుష సమానత్వంతో కొత్త కథాకళి సిద్ధమవుతోంది.