Sep 29,2022 13:54

తిరువనంతపురం : సాధారణంగా డాక్టర్లు రాసిన ప్రిస్కిప్షన్‌ రోగులకు, ప్రజలకు అర్థం కాదు. అది కేవలం మందుల షాపుల్లోని ఫార్మాసిస్టులకు మాత్రమే అర్థమవుతుంది. అయితే ఓ డాక్టర్‌ రాసిన ప్రిస్కిప్షన్‌ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఆయన రాసిన ప్రిస్కిప్షన్‌ను చూసిన ఎవరైనా.. చేతిరాత అద్భుతం అనాల్సిందే. ఇంతకీ ఆ డాక్టర్‌ ఎవరు అని అనుకుంటున్నారా? వివరాల్లోకి వెళితే.. ఈ డాక్టర్‌ కేరళకు చెందిన నితిన్‌ నారాయణన్‌. ఈయన గత మూడు సంవత్సరాలుగా పాలక్కడ్‌ సిహెచ్‌సి (కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌)లో పిడియాట్రీషియన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. త్రిస్సూర్‌ మెడికల్‌ కాలేజీలో ఎంబీబిఎస్‌ పూర్తి చేశారు. జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (జెఐపిఎంఇఆర్‌)నుండి ఎండి పూర్తి చేశారు. ఇంత చక్కని రాత మీకెలా సాధ్యం అని ఆయనను మీడియా ప్రశ్నించగా.. 'నేను ప్రిస్కిప్షన్‌ను బ్లాక్‌ లెటర్స్‌లో రాస్తాను. బ్లాక్‌ లెటర్స్‌లో రాయడం వల్ల అందరికీ సులభంగా అర్థమవుతుంది. మిగతా డాక్టర్లు వారి విధుల్లో బిజీగా ఉండడం వల్ల సరిగ్గా రాయలేరు. అయితే నేను బిజీగా ఉన్నప్పటికీ ప్రిస్కిప్షన్‌ అర్థమయ్యేలా రాయడానికి ప్రయత్నిస్తాను. దీంతో పేషెంట్స్‌ కూడా నన్ను అభినందిస్తారు. చిన్నప్పుడు రాసిన నోట్‌బుక్స్‌ ద్వారా నా చేతిరాత మెరుగుపడింది. దాన్ని నేను ఎంబీబిఎస్‌ పూర్తి చేసిన తర్వాత కూడా...ఆవిధంగానే కొనసాగిస్తున్నాను.' అని అన్నారు.
కాగా, నితిన్‌ నారాయణ్‌ రాసిన ప్రిస్కిప్షన్‌ను బెన్సీ ఎస్‌డి అనే ఫేస్‌బుక్‌ యూజర్‌ పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట్లో వైరల్‌ అవుతుంది.

doctor