
న్యూఢిల్లీ : పదిహేడేళ్ల ఏళ్ల క్రితం కిడ్నాప్ అయిన యువతిని ఢిల్లీ పోలీసులు వెతికి పట్టుకున్నారు. ఇప్పుడామె వయసు (32). ఈ మహిళను ఢిల్లీలోని గోకల్‌పురిలో పట్టుకున్నట్లు పోలీసులు గురువారం వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి షాహదారా డిసిపి రోహిత్ మీనా తెలిపిన వివరాల ప్రకారం.. 'మే 22వ తేదీన సీమపురి పోలీస్ స్టేషన్ బృందానికి 17 ఏళ్ల క్రితం అంటే 2006లో కిడ్నాప్ అయిన యువతికి సంబంధించిన సమాచారాన్ని గుర్తించింది. ఆ బాలిక అదృశ్యమైనట్లు ఆమె తల్లిదండ్రులు 2006లోనే గోకల్‌పురి పోలీస్‌స్టేషన్‌లో ఐపిసి 363 కింద కేసు నమోదు చేశారని డిసిపి రోహిత్ మీనా తెలిపారు. ఈ కిడ్నాప్ విషయంపై మహిళను పోలీసులు విచారించగా.. 'తనని దీపక్ అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడని.. ఈ ఘటన అనంతరం వారిద్దరూ ఉత్తరప్రదేశ్‌లోని చెర్దిహ్ జిల్లా బలియా అనే గ్రామంలో నివశించినట్లు ఆమె తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత ఆమెకు, దీపక్‌ల మధ్య జరిగిన కొన్ని గొడవల కారణంగా వారిద్దరూ విడిపోయారు. ఆమె లాక్‌డౌన్ కాలంలో దీపక్‌ని వదిలి ఒంటరిగానే నివశిస్తుంది. ప్రస్తుతం ఆమె గోకల్‌పురిలో ఓ అద్దె ఇంట్లో నివశిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కాగా, ఈ ఏడాదిలో ఇప్పటివరకు 116 మంది కిడ్నాప్‌కు గురైన పిల్లల్ని, 301 మంది తప్పిపోయిన వారిని షాహదారా జిల్లాలో వెతికి పట్టుకున్నట్లు డిసిపి రోహిత్ మీనా తెలిపారు.