Feb 01,2023 21:16
  • దాడిచేసి డోర్నాల వద్ద విడిచిపెట్టిన ముఠా
  • ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఘటన

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు మిర్చి యార్డులో వ్యాపారి పొత్తూరి శివనరేంద్ర కుమార్‌ కిడ్నాప్‌ బుధవారం కలకలం రేపింది. కిడ్నాపర్లు మార్గమధ్యలో అతన్ని కొట్టి, డోర్నాల వద్ద విడిచిపెట్టి వెళ్లిపోయారు. అక్కడ నుంచి నరేంద్ర మరో వాహనంలో గుంటూరు చేరుకుని నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ ఆరుగురు వచ్చి తనను అడ్డగించి కారులో కిడ్నాప్‌ చేశారని తెలిపారు. వీరంతా ముసుగులు ధరించి ఉన్నారని, వారు తన నుంచి రూ.కోటిన్నర డిమాండ్‌ చేశారని చెప్పారు. కిడ్నాపర్లు తనపై దాడి చేశారని, పిడిగుద్దులతో కొట్టారని, తన కిడ్నాప్‌ వెనుక మిర్చి వ్యాపారి బర్మా వెంకట్రావు హస్తం ఉందని ఆరోపించారు. వెంకటరావు కోటప్పకొండ వద్దకు వచ్చి కిడ్నాపర్లతో కలిశాడని, వారి దాడితో తనకు గాయాలు కావడంతో చొక్కా మార్చేందుకు వినుకొండ వద్ద కిడ్నాపర్లు కారు అపారని అక్కడ నుంచి పోలీసులు అనుసరించడంతో తనను డోర్నాల వద్ద వదలి వెళ్లిపోయారని వివరించారు. పోలీసులు, కుటుంబ సభ్యుల సహాయంతో గుంటూరు చేరుకున్నానన్నారు. దీనిపై నగరంపాలెం సిఐ హైమారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా నరేంద్రకుమార్‌ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి అనుచరుడు, వెంకట్రావు పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు అనుచరుడు కావడంతో ఈ కిడ్నాప్‌ వ్యవహారం అధికార పార్టీలో కలకలం రేపుతోంది.