
కలం, కుంచె ఈ రెండింటితో తెలుగు సాహిత్యాన్ని వెలిగించిన కవి, శీలా వీర్రాజు. బహుముఖ ప్రజ్ఞావంతులైన వీరు అనేక కథలు, కావ్యాలు, చిత్రకళా గ్రంథాలు, వ్యాస సంపుటాలు రచించారు. అనేక ప్రయోగ కవితలు కూడా ఆయన చేతిలో అందంగా రూపుదిద్దుకొన్నాయి. వచన కవితా పితామహుడు కుందుర్తి కథ, నవల, నాటిక, ఆత్మకథ అన్నిటినీ వచన కవితాప్రక్రియలోనే రాయాలని అన్నారు. అలా అని ఊరుకోవడమే కాక తామే స్వయంగా అన్ని వాటినీ వచన కవితలోనే రచించారు.
శీలా వీర్రాజు కూడా అదే బాటలో పయనిం చారు. కొడిగట్టిన సూర్యుడు, ముళ్ళరెమ్మ, విశ్వాసం నీడకింద, అద్దాల గుహ, హృదయం దొరికింది, అద్దె గది అనే వచన కవిత్వ కథల సంపుటాలను రచించారు. వెలుగురేఖలు, కాంతిపూలు, మైనా, కరుణించని దేవత, మొదలైన నవలలను; హృదయం దొరికింది, మళ్ళీ వెలుగు, కిటికీ కన్ను, ఎర్రడబ్బా రైలు, మొదలైన కవితా సంపుటాలను; ఔఱఅసశీష ూషaజూవ (తెలుగు కవితల ఆంగ్లానువాదం) కలానికి అటూ ఇటూ అనే వ్యాస సంపుటిని, శిల్పరేఖ (లేపాక్షి స్కెచ్‌బుక్)ను ప్రచురించారు.
వీర్రాజు గారు చిత్రకారులు కనుక ఆయన పుస్తకాలకు ఆయనే కవరు పేజీలు చిత్రీకరించుకొనేవారు. అనేక కవుల కావ్యాలకు కూడా ఆయన ముఖపత్ర చిత్ర రచన చేశారు. కళాహృదయులైన వారి ఇల్లు కూడా ఎంతో కళాత్మకంగా ఉంటుంది. అందమైన చిత్రాలతో, శిల్పాలతో ఒక మ్యూజియంలా ఉంటుంది.
సంతకం అక్కరలేని శైలి వీర్రాజు గారిది. కథారచనలో సందర్భానుసారంగా చేసిన వర్ణనలు చేయి తిరిగిన చిత్రకారుడు చిత్రించిన రంగుల చిత్రాల్లా అందంగా, ఆహ్లాదకరంగా ఉంటాయి. ఆయన రచనల్లో దేన్ని తీసుకున్నా, వర్ణనలు చదివినపుడు, ఎంతో సహజంగా, సరళసుందరంగా ఉంటాయి. పదచిత్రాలు జవసత్వాలు ఉట్టిపడుతూ సజీవ దృశ్యాల్లా సంచలనం కలిగిస్తాయి.
వీర్రాజు గారి వచన కవిత్వ కథాసంపుటిలో ప్రముఖమైనది కొడిగట్టిన సూర్యుడు. ఈ కథలో ప్రధాన పాత్రధారులు కృష్ణవేణి, పార్వతీశం. కృష్ణవేణి ఆసుపత్రిలో పనిచేసే నర్సు... రోడ్డు మీద ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చేరిన పేషంట్ పార్వతీశం. కృష్ణవేణిని వర్ణిస్తూ కవి ఒక దృశ్యచిత్రాన్ని పాఠకుల కళ్ళముందు నిలబెడతారు.
''కృష్ణవేణి పేరుకు తగ్గట్టు నిజంగా నీలవేణి
చీకటి ఆమె తలమీద గడ్డకట్టి కరిగి పారినట్టు
పొడుగ్గా చీకటి జలపాతంలా ఉరికిన పెద్ద కురులు
ఆ కురుల ఉరుకుల్ని ఆనకట్టలో బంధించినట్టు
చుట్ట చుట్టి నర్సు టోపీలో బిగించింది ఆమె''
మామూలుగా కవులు అందమైన అమ్మాయిలనే అభివర్ణిస్తారు. కృష్ణవేణి అందమైనది కాదు. ''ఆమె అందమైనది కాదని / ఆమె కంఠం పిడికిలిలో ఇమడగలదు/ అయినా అది సౌందర్యపు ఖండం కాదు/ అక్కడన్నీ గోతులు, ఆ మధ్య పొడుచుకొచ్చే ఎముకలు / ఆ దిగువ యౌవనం హరించుకుపోయిన వక్షాలు'' అని ఆమె అంద విహీనతను వర్ణిస్తూ 'ఏ ఆకర్షణా లేని ఏ రంగులూ వొదలని గడ్డిపువ్వు ఆమె'' అని అంటారు.
కథారచనలో అయితే అంతా వచనంలో సాగిపోతుంది. ఇక్కడ ప్రతిదాన్నీ కవిత్వంలో చెప్పాలి గదా! ఒకరోజు సాయంకాలం ప్రమాదానికి గురైన పార్వతీశం హాస్పిటల్‌కు వస్తాడు. అతని రాకను గురించి వారం రోజుల కిందట ఓ బద్దకపు సాయంకాలం చివర నల్లటి కలువలా చీకటి మరీ బద్ధకంగా విచ్చుకుంటున్నప్పుడు / గాలికి రేకల మీదకు జారిన పుప్పొడి నక్షత్రాలై మెరుస్తున్నప్పుడు/ రంగురంగుల సీతాకోకచిలుకలు రెక్కల్లాంటి కోరికలతో ఎగిరి / పుష్పమకరందాన్ని మత్తుగా గ్రోలుతూ ఆమె కలలు కంటుండగా/ ఆమె కలల అంచుల మీద ఉదయిస్తోన్న ఎర్రటి సూర్యుడి లాగ / రక్తపు ముద్దలాంటి ముడుచుకుపోయిన పార్వతీశాన్ని/ నలుగురు సాయంపట్టి మెట్ల మీంచి పైకి తీసుకొచ్చారు' అని వర్ణిస్తారు. రోడ్డు ప్రమాదంలో గాయ పడడాన్ని 'రక్తపుముద్దలాంటి అనే పదంతో చిత్రీకరిస్తారు.
పార్వతీశం నర్సుతో ''డైరీ పేజీల మధ్య నా చిరునామా రాసిన కార్డు ఉంది. దానిలో నా చావురాసి పోస్టు చెయ్యండి. ఇంతకన్నా మీ నుంచి నేను కోరుకునేది ఏదీ లేదు' అంటాడు. అది చదివి కృష్ణవేణి బాధపడుతుంది. నిరాశలో కూరుకుపోతున్న అతనికి ధైర్యం చెపుతుంది. గాయాల బాధతో పార్వతీశం బాధను మరిచిపోయి నిద్ర పోవాలంటే మార్ఫియా ఇమ్మంటాడు. అప్పుడు ఆమె మార్ఫియా సీసాలో మూడవవంతు మందును సిరంజిలో ఎక్కించి అతనికి ఇంజక్షను చేస్తుంది. దానికి పార్వతీశం సంతృప్తి పడకుండా 'మరికాస్త దయ చూపాలి మీరు/ మూడోవంతు మందుతో నిద్రను కొనుక్కోలేను నేను'' అంటాడు. ఇంతకంటే ఎక్కువిస్తే ప్రమాదం అంటుంది.
కోరికలకు తావివ్వకుండా నిరాశలోనే బతుకుతున్న కృష్ణవేణి పార్వతీశాన్ని చూసి ఆశ పెంచుకుంటుంది. అతని మీద అభిమానంతో పళ్ళు కొనిస్తుంది. పార్వతీశం ఆనందిస్తాడు. ఆ రోజు రాత్రి ఆనందంతో, జీవితం మీద ఆశతో మత్తుగా నిద్రపోతుంది. ఆ రాత్రే తలుపులు కొడుతూ ఒకటే శబ్దం. పార్వతీశం నొప్పుల్ని భరించలేకపోతున్నాడు. రమ్మని వార్డుబారు పిలుస్తాడు. ఆ నిద్రమత్తులోనే తూలుతూ లేచి వెళ్ళి, పార్వతీశానికి మార్ఫియా ఇస్తుంది. తెల్లారి లేచేసరికి నిర్జీవి ఐన పార్వతీశం. టేబుల్ మీద మార్ఫియా సీసాల్లో ఖాళీ అయిన ఒక సీసా దీనంగా కనిపిస్తుంది.
ఇదీ, వచన కవిత్వంలో చెప్పిన కథ. వచన కవిత్వ కథ అయినప్పటికీ దీనిలో అర్థం కాకపోవడం ఏమీ ఉండదు. మానవ హృదయంలోని ఆలోచనలను, అనుభూతులకు చిత్రం పట్టిన రచనలు వీర్రాజు గారి కథలు. మధ్య తరగతి స్త్రీ పురుషుల అంతరంగాలు, వాటిలోని బడబాగ్నులు, కోరికలు, కలలు, ఆశలు, నిరాశలు, మోహాలు, వ్యామోహాలు అన్నిటినీ ఫొటో తీసినట్లు చిత్రించిన కథలివి. కోరికలు నెరవేరక, నిరాశలోనే, జీవిస్తూ తనను ప్రేమించే వాళ్ళొకళ్ళుంటే చాలు; జీవనవనంలో వసంతం చిగురిస్తుంది అని ఆశ పెట్టుకుంటుంది కృష్ణవేణి. కానీ నిరుత్సాహం, నిరాశల చీకట్లోకి చూడడానికి అలవాటు పడిన కళ్ళు ఆశల వెలుతురులను చూడలేవు. కలల సూరీడు తొంగిచూడడు. అలాటి దురదృష్ట వంతులకు ఆఖరికి కొడిగట్టిన సూర్యుడే మిగులుతాడు. ఈ ఇతివృత్తాలే పాఠకుల గుండెల్లో నాటుకొనేటట్లు రాశారు కవి.
శీలావీ గారి రచనల్లో క్లిష్టపదాలు, అన్వయ దోషాలూ ఉండవు. మైదానంలో ప్రవాహంలా సాఫీగా, సరళంగా సాగిపోయే శైలి. ఉక్కిరి బిక్కిరి కలిగించకుండా, హాయిగా అలలపై కదిలే పడవలా రచన సాగిపోతుంది. అద్భుతమైన వర్ణనలతో, అపురూపమైన ఉపమలతో చక్కని పదచిత్రాలతో గూడిన శైలి ఆయన సొంతం.
ఈ కవిత్వ కథలో చీకటిని ఎలా వర్ణిస్తారో చూడండి. ''బయటంతా విషాదంలా చిక్కటి చీకటి/ ఆదామూ అవ్వల పాపంలో పుట్టి పెరిగి/ విశాలమైన వటవృక్షంలా విస్తరించి / లోకాన్ని చుట్టుముట్టిన దట్టమయిన చీకటి/ శ్మశానంలో వెలుగులు హరించిన వర్షరాత్రి'' ఇలా ఉపమలు చెప్పుకుంటూపోతే అంతు ఉండదు. ''కాటుక కళ్ళ పెళ్ళి కూతురి కన్నీటిలో కరిగిన/ కొత్త మాంగల్యపు నుసిముద్దలాంటి చీకటి'' అన్న ఉపమానం ఎంతలోతైనది! ఎంత కొత్తది! చాలామంది మాంగల్యాన్ని సంప్రదాయానికి ప్రతీకగా చెప్తారు. కానీ ఇక్కడ స్త్రీ జీవితంలోని విషాదానికి, చీకటికి ప్రతీకగా వర్ణించడం ఎంత అద్భుతం.
ఈ కావ్యం నిండా వాక్యాలు కవిత్వ పరిమళంతో గుబాళిస్తాయి. ''రగుల్కొన్న ఆకలి చిచ్చుల్ని మొదలంటా ఆర్పి / గుండెలోతుల్లోకి జారి, మూలమూలల్లోకి యింకి, ఆశ ధైర్యాలు ఎద్దుల్ని చేసి, అరక సిద్ధం చేసి/ అతను పండించనున్న కలల పంటకు సుక్షేత్రాన్ని సిద్ధపరిచింది''. ఆశ, ధైర్యాలను ఎద్దులతో పోల్చడం అరక సిద్ధం చేసి కలల పంట పండించడానికి క్షేత్రాన్ని సిద్ధం చేయడం ఇలాంటి ఈ వాక్యాల్లోని కొత్తదనం పాఠకుణ్ణి ఆకర్షిస్తుంది. నిశ్శబ్దపు వల్మీకం, జ్ఞాపకాల చలిచీమలు, తపస్సమాధి, జ్ఞాపకాల తీగలు, చీకటి వర్షం, నిశ్శబ్దపు మొక్కలు, చీకటి జలాలు, కలల పంచకల్యాణి, వెలుగుకొమ్మలు, పలకరింపుల చన్నీళ్ళు, నిద్రమత్తు దీపాలు, నర్సాంత్ణపురం, బద్ధకం మనసు మొదలైన రూపకాలు మనసుకు గిలిగింతలు పెడతాయి.
''వర్ణనానిపుణ:కవి'' వర్ణనానైపుణ్యం కలవాడే కవి అని ప్రాచీన అలంకారికులు అంటారు. చక్కని వర్ణనలతో, లోతైన భావనలతో, విషాదాంత ముగింపుతో ఈ కావ్యం పాఠకుల హృదయాలపై బలమైన ముద్ర వేస్తుంది.
శీలావీ గొప్ప మానవతావాది. నా పుస్తకం నిషిద్ధాక్షరికి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు వచ్చినప్పుడు వారి ఇంట్లోనే ఉన్నాను. మా ఊరికి వెళ్ళిపోతుంటే మోకాళ్ళ నొప్పైనా కిందకు దిగివచ్చి బస్సు వచ్చిందాకా వుండి బస్సు ఎక్కించి వెళ్ళారు. అంత నిరాడంబరులు, నిగర్వి, మనుషుల అంతస్థుల బట్టి కాకుండా అక్షరాలను బట్టి ఆదరించే గొప్ప మనీషి. వారి ప్రథమ వర్థంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ, వారి స్మ ృతికిది నా అక్షర నివాళి.
పుస్తకం మొదటి నుంచి చివరివరకు అందమైన పదచిత్రాలతో మనసును ఆకట్టుకుంటుంది. ఒకదాని తర్వాత ఒకటి దృశ్యాలు దృశ్యాలుగా ఆవిష్కరింప బడుతూ అలౌకికా నందానుభూతిని కలిగిస్తాయి. సుకవి జీవించు ప్రజల నాల్కల యందు అన్నట్లు పుస్తకం చదవడం అయిపోయాక కూడా అంతరంగంలో అలజడి కలిగిస్తుంది ఈ కావ్యం.
(జూన్ 1 : శీలా వీర్రాజు ప్రథమ వర్థంతి)
- మందరపు హైమవతి