
ఒక కోతి చాలా కష్టపడి ఒక కొబ్బరి చిప్పను సంపాదించింది. అది ఒక పక్కన పెట్టి నీరు తాగ సాగింది. ఇంతలో మరొక కోతి వచ్చి ఆ కొబ్బరి చిప్పను అందుకుని పారిపోయింది. దాంతో మొదటి కోతి 'కష్టపడి సంపాదించిన ఆహారం పోయిందే' అనుకుంటూ బాధపడసాగింది.
ఆ కొబ్బరి చిప్పను పట్టుకొని అడవిలోకి వెళ్లిన కోతిపై ఒక ఎలుగుబంటి దాడి చేసింది. కోతి దాన్ని చూసి భయంతో కొబ్బరిచిప్ప వదిలేసి పారిపోయింది. కోతి వెంటబడిన ఎలుగుబంటికి దారిలో సింహం ఎదురయింది. దాంతో ఎలుగుబంటి చెట్టుచాటుకు వెళ్లింది. ఆ తర్వాత సింహం ఆ కొబ్బరి చిప్పను పట్టించుకోలేదు. అది కూడా అక్కడి నుండి వెళ్ళిపోయింది.
ఆ తర్వాత ఆకాశంలో విహరిస్తున్న ఒక కాకి ఆ కొబ్బరి చిప్పను చూసింది. దాని కోసం కిందకు దిగి, నోటితో చిప్పను కరచుకొని ఆకాశంలోకి ఎగిరింది. అది ఒక చెట్టుపై కూర్చుని దాన్ని తిందామనుకుంది. సరిగ్గా ఆ కొబ్బరి చిప్పను సంపాదించుకున్న కోతి ఉన్న చెట్టుపై వాలింది. కాకి కాళ్ల మధ్యలో చిప్పను పట్టుకుని ముక్కతో పొడుచుకుని తినసాగింది. కాని పట్టు సరిపోక జారి కింద పడింది. ఆకలితో బాధపడుతున్న కోతికి తను పోగొట్టుకున్న కొబ్బరి చిప్ప దొరకడంతో సంతోషపడింది. కొబ్బరి చిప్పను తీసకుని తినేసింది.
- సంగనభట్ల చిన్న రామక్రిష్టయ్య
99085 54535