Aug 19,2022 06:53

ఆకలేస్తే అమ్మ ముద్దులిచ్చి గోరుముద్ద పెట్టడమే తెలుసు. అమ్మానాన్నల చెమటతో, వారిచ్చిన రూపాయలతో జీతం పొందిన గురువు జ్ఞానం ఇచ్చినా ఇవ్వకపోయినా చిన్ని గొంతెండితే చెంబెడు నీళ్లివ్వడా? అందులోనూ విద్యను నేర్పే మందిరంలో. అందుకనే చెంగున దూకుతూ ఆ మట్టికుండను తాకినట్టున్నాడు. పాపం. వాడికేం తెలుసు. అది మట్టితోనో, మశానంతోనో చేసిన కుండ కాదు.. విషంతోనో, విద్వేషంతోనో చేసిన కుండ అని. అందులో నిండి ఉన్నది జలం కాదు.. కులం అని. అసలు ఆ హీనగురువు బుర్ర మట్టితో చేయబడిందని. ఆ బుర్రలో నిండి ఉన్నదంతా కుల కల్మషమేనని. ఆ అజ్ఞానమే గొంతెండిన ఆ చిన్నారి గొంతు తడపలేదు సరికదా గొంతు నులిమింది. కాకి దాహంతో అరిస్తేనే దాని పట్ల ద్రోహం చేస్తున్నామని, జీవధర్మం పాటించడం లేదని భావిస్తాం. నొచ్చుకుంటాం. ఒక పిచ్చుక దప్పిక తీర్చడానికి కొంచెం నీటి వసతిని కల్పిస్తాం. అలాంటిది ఒక చిన్నారిని చిదిమేసిన ఆ హీనుడి మనస్తత్వం ఎలాంటిది? అలాంటి మనస్తత్వానికి కూడా ఎంతోకొంత మద్దతు దొరుకుతున్న మన సమాజపు ఆరోగ్యం ఎలాంటిది? అ అంటే అమ్మ అని పుస్తకాల్లో ఉన్నా అ అంటే అంటరానితనం అని చాలా మస్తిష్కాల్లో నేటికీ కొలువుండడానికి, అలా ఉండడాన్ని సిగ్గు పడకపోవడానికీ జాతి యావత్తూ తల దించుకోవాలి కదా! ఇలాంటి హీన నేరాలకు వెంటనే శిక్ష పడే పరిస్థితులు లేవు. నేరస్థుడికి కుల ప్రాతిపదికన ఎంతోకొంత మద్దతు కూడా దొరికే పరిస్థితి. వెంటనే స్పందించాల్సిన రాజకీయ పక్షాలు, పౌర సమాజం జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడడం. సిగ్గు..సిగ్గు. రానున్న ఇరవై ఐదు సంవత్సరాలూ దేశ పురోగతికి అమృత కాలమని ప్రధాని చెప్తున్నారు. ఎదురుగా ఉన్న విషాన్ని, కుల విద్వేషపు విషాన్ని విరుగుడు చెయ్యకపోతే ఆ అమృతం అందడం కల్ల. అందుకు రావాల్సింది భావ, సాంస్కృతిక విప్లవం. బాధ్యత తీసుకోవాల్సింది పౌర సమాజం.

- డా.డి.వి.జి. శంకర రావు, మాజీ ఎంపీ, పార్వతీపురం.