Aug 05,2022 21:15

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఎపి లాసెట్‌, ఎడ్‌సెట్‌ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్‌ కె.హేమచంద్రారెడ్డి శుక్రవారం విడుదల చేశారు. లాసెట్‌లో 89 శాతం, ఎడ్‌సెట్‌లో 96.43 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారని ఆయన తెలిపారు. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ లాసెట్‌కు 15,709 మంది దరఖాస్తు చేసుకున్నారని, వీరిలో 13,180 మంది పరీక్షకు హాజరయ్యారని చెప్పారు. పరీక్ష రాసిన వారిలో 11,730 మంది అర్హత సాధించారని వివరించారు. ఐదేళ్ల కోర్సులో 2,091 మంది, మూడేళ్ల కోర్సులో 8,759 మంది, రెండేళ్ల కోర్సుకు 880 మంది అర్హత సాధించారని తెలిపారు. ఎడ్‌సెట్‌కు 13,978 మంది దరఖాస్తు చేసుకోగా, 11,384 మంది పరీక్ష రాశారని చెప్పారు. వీరిలో 10,978 మంది అర్హత సాధించారని వెల్లడించారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ డి.జమున మాట్లాడుతూ ఎడ్‌సెట్‌, లాసెట్‌లలో మొదటి 10 ర్యాంకుల్లో మహిళలే అధికంగా ఉన్నారని తెలిపారు. ఎడ్‌సెట్‌ బయొలాజిక్‌ విభాగంలో గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన అమర్‌నాథ్‌ రెడ్డి మొదటి ర్యాంకు సాధించారని తెలిపారు. మ్యాథ్స్‌ విభాగంలో ఎన్‌టిఆర్‌ జిల్లాకు చెందిన మల్లెల గిరీష్‌కుమార్‌, ఇంగ్లీష్‌లో కేరళకు రాష్ట్రానికి చెందిన అంజన టికె, సోషల్‌ స్టడీస్‌లో నంద్యాలకు చెందిన ఎ శివాని మొదటి ర్యాంకులు సాధించారని వెల్లడించారు. లాసెట్‌ ఐదేళ్ల విభాగంలో కృష్ణా జిల్లాకు చెందిన కీర్తి, రెండేళ్ల విభాగంలో ఎ.కృష్ణారావు మొదటి ర్యాంకులు సాధించారని పేర్కొన్నారు. ఉన్నత విద్యామండలి వైస్‌ ఛైర్మన్‌ రామ్మోహనరావు, లక్ష్మమ్మ, కార్యదర్శి సుధీర్‌ ప్రేమ్‌కుమార్‌, సెట్ల ప్రత్యేక అధికారి సుధీర్‌ రెడ్డి, ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ టిజి అముతవల్లి, టి సీతాకుమారి పాల్గొన్నారు.