Feb 01,2023 21:56
  • - 31 మంది ఎంపిలు ఉండి వైసిపి సాధించలేదు
  • - టిడిపి అధినేత చంద్రబాబు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి, రాష్ట్ర ప్రాజెక్టులకు ఆశించిన కేటాయింపులు లేకపోవడం నిరుత్సాహాన్ని కలిగించిందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు. కర్ణాటకలోని కరువు ప్రాంతాల కోసం కేంద్ర బడ్జెట్‌లో రూ.5,300 కోట్లు కేటాయించారని, విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో వెనుకబడ్డ ఏడు జిల్లాలకు ప్యాకేజీ ఇవ్వాల్సి ఉందని తెలిపారు. వీటిని సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపులు, విభజన హామీల అమలు, రాజధాని నిర్మాణానికి నిధులు సాధించడంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన హామీల అమలుకు ఇదే చివరి బడ్జెట్‌ అని, ఇందులో కూడా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో విఫలమైందని అన్నారు. సొంత కేసులు, స్వప్రయోజనాలకు మాత్రమే వైసిపి ఎంపిలు కట్టుబడి ఉన్నారని మరోసారి రుజువైందని విమర్శించారు. 31 మంది ఎంపిలు ఉండి ఏం సాధించారని ప్రశ్నించారు.
సమ్మిళిత అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్‌ ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. పెట్టుబడి వ్యయానికి రూ.13.7 లక్షల కోట్లు కేటాయించడం సానుకూలమని తెలిపారు. 2047 లక్ష్యంగా పథకాలు, కార్యక్రమాల రూపకల్పన దిశగా ఆలోచనలు చేయడాన్ని స్వాగతించారు. విజన్‌-2047 ద్వారా ప్రపంచ అగ్రగామిగా భారత్‌ మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగానికి సాంకేతికతను అందించే ప్రణాళికలు.. ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహాన్ని ఇచ్చేలా ఉందన్నారు. ఆదాయపు పన్ను శ్లాబ్‌లలో మార్పులు తెచ్చి వేతన జీవులకు ఊరట కల్పించారని హర్షం వ్యక్తం చేశారు.