
-అరకొర వసతుల మధ్య తరగతుల నిర్వహణ
-విభజన హామీ అమలులో కేంద్రం తీవ్ర నిర్లక్ష్యం
ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి :కాకినాడలోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్టి) దక్షిణాది క్యాంపస్ నిధుల లేమితో కొట్టుమిట్టాడుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక ప్రాత్ర పోషించనున్న ఈ క్యాంపస్‌లో కనీస వసతులు కరువయ్యాయి. కాకినాడ జెఎన్‌టియులో తాత్కాలిక క్యాంపస్‌లోనే కొనసాగుతోంది. అరకొర వసతుల మధ్య విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. విభజన హామీ అమలులో కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దేశంలో ఢిల్లీ, కోల్కత్తా తర్వాత ఐఐఎఫ్టి మూడో క్యాంపస్‌ను రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. దీన్ని విశాఖలో ఏర్పాటు చేయాలని తొలుత భావించారు. చివరకు కాకినాడలో ఏర్పాటు చేశారు. స్థానిక జెఎన్టియుకె ప్రాంగణంలో గతేడాది అక్టోబర్ 28న కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అట్టహాసంగా ప్రారంభించారు. బియ్యం, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు కాకినాడ మంచి వేదికగా ఉంది. రాష్ట్రం మొత్తం ఎగుమతుల్లో సింహ భాగం ఇక్కడ నుంచే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐఐఎఫ్టి విద్యార్థులకు అవసరమైన క్షేత్రస్థాయి నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు కాకినాడ ప్రాంతం అనువుగాఉంటుందని నిర్ణయానికి వచ్చారు. శాశ్వత భవనాలు నిర్మించే వరకూ జెఎన్టియుకె ప్రాంగణంలో ఐఇటిఇ భవనంలో ఐఐఎఫ్టి తాత్కాలిక క్యాంపస్‌ను ఏర్పాటు చేశారు. జెఎన్టియుకెకు అద్దె చెల్లిస్తున్నారు. మూడు అంతస్తులున్న ఈ భవనంలో మూడు గదులను మాత్రమే కేటాయించారు. ఇవి ఎంతమాత్రమూ చాలట్లేదు. ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం ఇన్ మేనేజ్మెంట్ (ఐపిఎం) కోర్సు మాత్రమే ప్రస్తుతం 40 మందితో నడుస్తోంది. మన రాష్ట్రంతోపాటు ఢిల్లీ, బెంగాల్, పంజాబ్, హర్యానా, కేరళ, తమిళనాడు, ఒడిశా, యుపి తదితర ప్రాంతాల విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారు. ఇంటర్నేషనల్ బిజినెస్ (ఎంబిఎ), ఎకనామిక్ ట్రేడ్ అండ్ ఫైనాన్స్ (ఎంఎ) కోర్సులు అందుబాటులోకి రావాలంటే మరి కొన్నేళ్లు ఆగాల్సిన పరిస్థితి. కాకినాడ రూరల్ తిమ్మాపురంలో విద్యార్థులకు 25 గదులుగల హాస్టల్ భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. దీంతో, అద్దెల భారం ఎక్కువగా ఉంది. లైబ్రరీకి అదనపు గదులు అవసరం ఉంది. ఫ్యాకల్టీ, రీసెర్చ్, ప్రాజెక్టు పనుల కోసం ఈ భవనం సరిపోవడం లేదు.
నిధుల విడుదల ఎప్పుడు?
కాకినాడ సెజ్‌లో ఐఐఎఫ్టి శాశ్వత క్యాంపస్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 25 ఎకరాలు కేటాయించింది. అత్యాధునిక వసతులతో దీన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అకాడమిక్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాకులు, ఆడిటోరియం, తరగతి గదులు, స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇతర శాశ్వత నిర్మాణాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 ప్రకారం రూ.115 కోట్లు నిధులివ్వాలి. దీనికి అదనంగా కేంద్రం మరో రూ.40 కోట్లు ఇవ్వాల్సి ఉంది. అయితే, నిధుల విడుదలలో తీవ్ర జాప్యం కారణంగా పనులింకా మొదలు కాలేదు. ఇటీవల కేంద్రం రూ.50 కోట్లు మంజూరు చేస్తుందనే ప్రచారం జరిగింది. కానీ, దీనిపై ఎలాంటి ఉత్తర్వులూ తమకు అందలేదని క్యాంపస్ అధికారులు చెబుతున్నారు. దీంతో, పనులు ఎప్పుడు మొదలవుతాయనే దానిపై ఇంకా స్పష్టత లేదు. శాశ్వత క్యాంపస్ ప్రారంభమైతే 360 మంది వరకు విద్యార్థులు ఆయా కోర్సులను నేర్చుకునే అవకాశం ఉంది.
శాశ్వత వనరులు సమకూరాలి
తాత్కాలిక క్యాంపస్‌లో ప్రస్తుతం ఉన్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు సరిపోతున్నాయి. విద్యార్థుల సంఖ్య పెరిగితే మాత్రం ఇబ్బందులు వస్తాయి. సెజ్ భూముల్లో శాశ్వత వనరులు సమకూరితే సమస్యలు తొలగుతాయి.
ా రవీంద్ర సారథి, సెంటల్ హెడ్, ఐఐఎఫ్టి, కాకినాడ
ప్రాజెక్టు వర్క్‌ల కోసం ఇబ్బందులు
తాత్కాలిక క్యాంపస్‌లో కొన్ని అసౌకర్యాలు ఉన్నాయి. తరగతి గదులు సరిపోతున్నా లైబ్రరీ చిన్నదిగా ఉంది. ప్రాజెక్టు వర్క్‌ల కోసం ఇబ్బందులు పడుతున్నాం. త్వరితగతిన శాశ్వత భవనాలు పూర్తి చేయాలి.
ా అక్షత్ నారాయణ్, విద్యార్థి, ఢిల్లీ