Jul 10,2022 12:38

ఈ విశ్వం అనేక రహస్యాలకు నిలయం. అంతుచిక్కని ఎన్నో ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాలు దొరకడంలేదు. అలాంటి వాటిల్లో ఒకటి 'అస్థిపంజరాల సరస్సు'. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. హిమాలయ పర్వతాల్లోని ఈ సరస్సు వందల సంఖ్యలో అస్థిపంజరాలతో నిండి ఉంటుంది. అవన్నీ మనుషులవే అని శాస్త్రవేత్తలు ఇప్పటికే నిర్ధారించారు. వీళ్లంతా చనిపోయి కూడా కొన్ని వందల ఏళ్లు అయ్యింది. అసలు వాళ్లు ఎలా చనిపోయారు? ఎక్కడి నుంచి వచ్చినవాళ్లు? జన సంచారం లేని మంచు కొండల్లోకి ఎందుకు వెళ్లారు? అనేది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలింది.. ఆ సరస్సు వెనుక మిస్టరీ ఏంటో తెలుసుకుందాం..
హిమాలయ పర్వతాల్లోని ఓ మారుమూల మంచు లోయలో ఏర్పడిన సరస్సు ఎప్పటి నుంచో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో విస్తరించిన హిమాలయాల్లో 'త్రిశూల్‌' పర్వతం దేశంలోని ఎత్తయిన పర్వతాల్లో ఒకటి. ఏటవాలుగా ఉండే ఈ పర్వతానికి దిగువనే ఉంది. ఎన్నో రహస్యాలకు కేంద్రబిందువైన రూపకుండ్‌ సరస్సు. ఏడాదిలో 11 నెలలు ఈ సరస్సు మంచుతో కప్పి ఉంటుంది. మే నెల్లో మాత్రమే ఆ సరస్సులో నీరు కనిపిస్తుంది.
వందల సంఖ్యలో..

s2


అయితే ఈ సరస్సులో వేసవి కాలంలో వందల సంఖ్యలో అస్థిపంజరాలు ప్రత్యక్షమవుతాయి. మే నెల్లో ఎండలకు సరస్సులో నీరు తగ్గే కొద్దీ సరస్సు అంచులో అస్థిపంజరాలు కనిపిస్తాయి. ఇలా చాలా ఏళ్లుగా జరుగుతోంది. కానీ ఇప్పటికీ ఆ అస్థిపంజరాలు అక్కడ ఎందుకున్నాయో? ఎవరు చనిపోయారో ఎవరికీ తెలియదు. వందలాది మంది ఒకేసారి ఎలా చనిపోయారనేది ఇప్పటికీ అక్కడ అంతుపట్టని విషయం. అందుకే ఈ సరస్సును 'అస్థిపంజరాల సరస్సు' అని కూడా పిలుస్తారు. 'రూపకుండ్‌ సరస్సు'కి మరోపేరు 'స్కెలిటన్‌ లేక్‌'. ఆ పేరు రావటానికి కారణం అందులో దొరికిన అస్థి పంజరాలే అని చెప్పుకోవాలి. అందులో ఉండే అస్థిపంజరాల వల్లే దానికాపేరు వచ్చింది.
మొదటిసారి వెలుగులోకి ఇలా..

s44444444444


త్రిశూల్‌ పర్వతం దిగువున, సముద్ర మట్టానికి 16,500 అడుగుల ఎత్తులో ఉన్న రూపకుండ్‌ సరస్సు పర్యాటకులను ఆకర్షిస్తోంది. చమోలి జిల్లాలో సముద్ర మట్టానికి 5,029 మీటర్ల ఎత్తులో ఈ సరస్సు ఉంది. 1942లో బ్రిటీష్‌ ప్రభుత్వానికి చెందిన ఓ అటవీ అధికారి తొలిసారిగా అస్థిపంజరాలను చూశాడు. ఈ సరస్సును నందాదేవి అటవీ రేంజర్‌ హెచ్‌.కె మద్వాల్‌ అనే వ్యక్తి మొదటిసారి 1942లో వెలుగులోకి తెచ్చాడు. అప్పటినుంచీ ఈ సరస్సుపై దేశవిదేశీ సంస్థలు చాలా పరిశోధనలు చేశాయి. అయితే, ఆ అస్తిపంజరాలు ఎవరివీ? అక్కడ వందల సంఖ్యలో ప్రజలు ఎందుకు చనిపోయారు? అసలేం జరిగింది? అనే విషయంపై పరిశోధనలు జరిగాయి. కానీ ఎవరూ దీనికి కచ్చితమైన సమాధానం కనిపెట్టలేకపోయారు.
రకరకాల వదంతులు..
ఆ అస్థిపంజరాలు జపాన్‌ సైనికులవని కొంతమంది జనాలు చెప్పగా.. మరికొందరు అంటువ్యాధి కారణంగా ప్రాణాలు వదిలారని అన్నారు. వాస్తవానికి, రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో, బ్రిటిష్‌ వారిని చంపడానికి జపాన్‌ సైనికులు హిమాలయాల ద్వారా భారతదేశానికి వచ్చారట! అప్పుడు వారు చంపబడి ఉంటారని ఇంకొందరు అన్నారు. ఓ బంతిలాంటి వస్తువు వారి తలపై పడటం వల్ల మరణించినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. అయితే అసలు రహస్యం అనేది మాత్రం ఇప్పటికీ బయటపడలేదు.
హైదరాబాద్‌ సీసీఎంబీ పరిశోధనలు..
ఇక్కడి రహస్యాన్ని తెలుసుకునేందుకు అనేక దేశాలకు చెందిన అంతర్జాతీయ పరిశోధకులతో పాటు హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ పనిచేస్తోంది. రూపకుండ్‌ రహస్యాన్ని చేధించేందుకు అంతర్జాతీయ పరిశోధన సంస్థలతో కలిసి పదేళ్లుగా పరిశోధనలు చేస్తూనే ఉంది. ఈ పరిశోధనల్లోనే ఈ అస్థికలకు వేల ఏళ్ల చరిత్ర ఉందన్న సంగతి బయటపడింది. 2004వ సంవత్సరంలో కొందరు పరిశోధకులు ఈ అస్థిపంజరాలు 850 సంవత్సరాల క్రితం నాటివని తేల్చారు. అయితే ఒకేసారి వందలాదిమంది మృత్యువాత పడటానికి దారితీసిన పరిస్థితులేమిటన్నది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నే. పైగా దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలూ దొరకలేదు. ఇప్పుడు ఆ ప్రదేశానికి పెద్దఎత్తున పర్యాటకులు వస్తుండటంతో పర్యాటక కేంద్రంగా మారిపోయింది.