Jun 22,2022 20:34

-1500 మందికి పైగా గాయాలు
-భూ కంప తీవ్రత 6.1 పాయింట్లగా నమోదు
-భారీ ఆస్తి నష్టం
-ముమ్మరంగా సహాయక చర్యలు

కాబూల్‌ : ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న ఆఫ్ఘనిస్తాన్‌పై ప్రకృతి విరుచుకుపడింది. రెండు దశాబ్దాల్లో కనివిని ఎరుగని రీతిలో భారీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారు జామున చోటుచేసుకున్న ఈ విలయంలో వెయ్యి మందికి పైగా మరణించారు. 1500 మంది వరకు గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు.. ఇంతటి భయంకర భూ కంపాన్ని గత 20 ఏళ్ళలో ఎన్నడూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు. ఆగేయ ఆఫ్ఘనిస్తాన్‌లోని మారుమూల ప్రాంతాలైన పక్టికా, ఖోస్ట్‌ ప్రావిన్స్‌ల్లో భూమి తీవ్రంగా కంపించడంతో రిచ్‌టర్‌ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైంది. భూకంప కేంద్రం పాక్‌ రాజధాని ఇస్లామాబాద్‌కు 375 కిలోమీటర్ల దూరంలో ఖోస్ట్‌ ప్రావిన్స్‌లో వుంది. ఖోస్ట్‌ రాష్ట్రంలో భూ కంపం ధాటికి 25 మంది చనిపోయారు. మరో వంద మంది దాకా గాయపడ్డారు. 600కి పైగా ఇళ్లు, మసీదులు, దుకాణాలు ధ్వంసమయ్యాయి. మొదటి భూకంపం నమోదైన గంట తర్వాత రెండో ప్రకంపన నమోదైంది. భూకంపం కారణంగా పర్వత ప్రాంతమైన ఇక్కడ కొండచరియలు కూడా తీవ్రంగా విరిగిపడ్డాయి. వందలాది ఇళ్ళు నేల మట్టమయ్యాయి. వందలాదిమంది మరణించారు. శిధిలాల కింద చిక్కుకుని మరికొంతమంది వుంటారని భావిస్తున్నారు. కాగా ఈ భూకంపం ధాటికి పొరుగు దేశాలైన పాకిస్తాన్‌, ఇరాన్‌ల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి,. భూకంప ప్రాంతాల్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. నేలపై ఎక్కడబడితే అక్కడ శవాలు కుప్పలుగా పడి వుండడం కనిపిస్తోంది. ఇళ్ళన్నీ శిధిలాల దిబ్బలుగా మారాయి. ఈ శిధిలాల కింద వందలాదిమంది చిక్కుకుని వుంటారని భయపడుతున్నారు. తీవ్రంగా గాయపడి సాయం కోసం వందలాదిమంది నిస్సహాయంగా ఎదురుచూస్తున్నారు. భూ కంపం సంభవించిన నాలుగు గంటల తరువాత తాత్కాలిక ప్రధాని ముల్లా మహ్మద్‌ హసన్‌ అఖుంద్‌ అధ్యక్షతన కేబినెట్‌ అత్యవసరంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించిందని పిఎంఓ ట్వీట్‌ చేసింది. విపత్తు సాయం కింద 100 కోట్ల ఆఫ్ఘనీలు (1.12 కోట్ల అమెరికన్‌ డాలర్లు) గ్రాంటుగా విడుదల జేయాలని ప్రధాని ఆదేశించారు. విపత్తు సంభవించిన ప్రాంతంలో ప్రజల ప్రాణాలను రక్షించేందుకు, తక్షణమే వెళ్లి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సంబంధిత సంస్థలను ఈ సమావేశం ఆదేశించిందని ఆయన తెలిపారు.
ఆఫ్ఘనిస్తాన్‌లోని తూర్పు ప్రావిన్స్‌ల్లో పరిస్థితులు ఏమాత్రం బాలేవని, క్షణక్షణానికి దిగజారుతున్నాయని యునిసెఫ్‌ కమ్యూనికేషన్‌ చీఫ్‌ సమంతా మార్ట్‌ మీడియాకు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా కొండచరియులు విరిగిపడడంతో మారుమూల ప్రావిన్స్‌లకు వెళ్ళడం కూడా చాలా ఇబ్బంది అవుతోందని మార్ట్‌ చెప్పారు. అయితే యునిసెఫ్‌ బృందాలు మాత్రం బాధిత ప్రాంతాల్లో కొన్ని చోట్లకు చేరగలిగాయని చెప్పారు. శిధిలాల కింద చిక్కుకుపోయిన వారు ఎలాంటి సాయం అందక నిస్సహాయంగా ఎదురు చూస్తున్నారని ఆమె చెప్పారు. తమ బృందాలు కొంతమందికి ప్రాథమిక చికిత్సచేసి ఆస్పత్రులకు పంపాయని చెప్పారు.
భూకంపంతో ఇబ్బందులు పడుతున్న ఆఫ్ఘనిస్తాన్‌కు సహాయ చర్యలను సమన్వయం చేసేందుకు ప్రధాని మోడీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. చేతనైనంత సాయాన్ని చేయాల్సిందిగా తాలిబన్‌ ప్రభుత్వం అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది. బాధిత ప్రాంతాలకు చేరేలా సహాయక దళాలు చర్యలు తీసుకోవాలని తాలిబన్‌ ప్రభుత్వ డిప్యూటీ ప్రతినిధి కోరారు. పక్టికాలో మెజారిటీ మట్టి ఇళ్ళు నేలమట్టం కావడంతో శిధిలాల కింద చిక్కుకుపోయిన వారి సంఖ్య ఎక్కువే వుంటుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుబాటులో వున్న మార్గాలు, అవకాశాల ద్వారా బాధితులకు సాయం అందేలా చూడాల్సిందిగా తాత్కాలిక మొదటి డిప్యూటీ ప్రైమ్‌ మినిస్టర్‌ అబ్ద్‌ ఘనీ బరాదర్‌ అధికారులను ఆదేశించారు.