Feb 06,2023 11:56
  • బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ టెస్టు సిరీస్‌

ప్రజాశక్తి క్రీడావిభాగం : ఫిబ్రవరి 2022, భారత జట్టు టెస్టు పగ్గాలు రోహిత్‌ శర్మ చేతికి అందాయి. కాగితంపైనే మూడు ఫార్మాట్ల కెప్టెన్‌గా కొనసాగుతున్న రోహిత్‌ శర్మ.. నాయకుడిగా రెండు టెస్టులే ఆడాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ బెర్త్‌ ఊరిస్తున్న తరుణంలో టెస్టుల్లో నాయకుడిగా రోహిత్‌ శర్మ తొలిసారి కఠిన పరీక్ష ఎదుర్కొంటున్నాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్‌-గవాస్కర్‌ టెస్టు సిరీస్‌ ఫిబ్రవరి 9న నాగ్‌పూర్‌ టెస్టుతో ఆరంభం కానుంది.
 

అసలు మొదలైందా ? !  : భారత జట్టు కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ ప్రస్థానం ఏడాది కిందటే మొదలైంది. కానీ నిజానికి భారత క్రికెట్‌లో రోహిత్‌ శర్మ నాయకత్వ శకం మొదలైందా? అంటే కాదనే చెప్పాలి. వైట్‌బాల్‌ ఫార్మాట్‌లో రోహిత్‌ శర్మ నాయకత్వం కనిపిస్తున్నా.. టెస్టుల్లో అతడు ప్రయాణమే ఆరంభించలేదు. ఆల్‌ఫార్మాట్‌ కెప్టెన్‌గా భారత్‌ చివరి ఐదు టెస్టుల్లో రోహిత్‌ శర్మ ఏకంగా మూడు టెస్టులకు దూరమయ్యాడు. ఇంగ్లాండ్‌పై టెస్టు సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించిన చారిత్రక విజయంలో 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'గా నిలిచాడు. అంతకుముందే, ఆస్ట్రేలియా గడ్డపై భారత్‌ చారిత్రక 2-1తో టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత టెస్టుల్లో విదేశీ జైత్రయాత్రకు బ్రేక్‌ పడింది. జొహనెస్‌బర్గ్‌, కేప్‌టౌన్‌, బర్మింగ్‌హామ్‌ టెస్టుల్లో భారత్‌ విజయం సాధించే స్థితిలో ఉండీ పరాజయం పాలైంది. ఇటీవల బంగ్లాదేశ్‌తో టెస్టుల్లో సాధికారిక విజయాలు నమోదు చేయటంలో తేలిపోయింది. కానీ, స్వదేశంలో టీమ్‌ ఇండియా రికార్డు దుర్బేద్యం. బలమైన ఆస్ట్రేలియాతో ఒత్తిడితో కూడిన సిరీస్‌లో రోహిత్‌ శర్మ నాయకత్వ పటిమ తేలనుంది. టెస్టుల్లో నాయకుడిగా రోహిత్‌ శర్మ ప్రభావం ఈ సిరీస్‌ తేల్చనుంది.
 

పొంచిఉన్న ప్రమాదం : భారత జట్టు కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ భవితవ్యం ప్రమాదంలోనే కొనసాగుతుంది!. మూడు ఫార్మాట్లలో రోహిత్‌ శర్మ కెప్టెన్సీ పగ్గాలు కోల్పోయే ప్రమాదంలోనే ఉన్నాడు. టీ20ల్లో హార్దిక్‌ పాండ్య అనధికార రెగ్యులర్‌ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. 2022 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ అనంతరం రోహిత్‌ శర్మ పొట్టి ఫార్మాట్‌లో నాయకత్వం సంగతి అటుంచి, అసలు జట్టులోనే నిలువలేదు. ఇక వన్డే ఫార్మాట్‌లో ఈ ఏడాది స్వదేశంలో ఐసీసీ 2023 వన్డే వరల్డ్‌కప్‌ అతడి భవిష్యత్‌ను నిర్ణయించనుంది. సొంతగడ్డ అనుకూలత, టైటిల్‌ అంచనాలను సైతం మోసుకొస్తుంది. కప్పు నెగ్గాలనే ఒత్తిడి రోహిత్‌ శర్మపై ఉంటుంది. వరల్డ్‌కప్‌లో ఏమాత్రం తేడా వచ్చినా.. రోహిత్‌ శర్మ నాయకత్వం కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక టెస్టు క్రికెట్‌లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. 35 ఏండ్ల రోహిత్‌ శర్మ బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ నెగ్గటంతో పాటు ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో చోటు సాధించాల్సి ఉంది.
 

ఆ సంగతి బాగా తెలుసు ! : జాతీయ జట్టు నాయకుడి గొప్పతనం ద్వైపాక్షిక సిరీస్‌ విజయాల్లో ఉండదు. ఐసీసీ టోర్నమెంట్‌లో విజయమే నాయకుడి సామర్థ్యానికి కొలమానం. ఈ విషయం చీఫ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు బాగా తెలుసు. కెప్టెన్‌గా భారత్‌ను వన్డేల్లో విజయవంతమైన, దూకుడైన ఛేదించే జట్టుగా నిలిపిన రాహుల్‌ ద్రవిడ్‌.. నాయకత్వం విషయంలో ఎప్పుడూ 2007 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌లో గ్రూప్‌ దశ నుంచి నిష్క్రమించిన జట్టు సారథిగానే కనిపిస్తాడు. ఇదే విషయం రోహిత్‌ శర్మకు సైతం వర్తించనుంది. 2021 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో నాకౌట్‌కు అర్హత సాధించని టీమ్‌ ఇండియాను.. 2022 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో రోహిత్‌, ద్రవిడ్‌ సెమీఫైనల్స్‌కు చేర్చారు. అయితే, వరుస టీ20 ప్రపంచకప్‌లలో టీమ్‌ ఇండియా పరాజయానికి కారణాలు ఒకటే కావటం గమనార్హం.
 

వేధిస్తున్న బలహీనతలు : కీలక బోర్డర్‌-గవాస్కర్‌ టెస్టు సిరీస్‌ ముంగిట, టీమ్‌ ఇండియా పలు సమస్యలు ఎదుర్కొంటుంది. గత రెండేండ్లుగా భీకర ఫామ్‌లో ఉన్న ముగ్గురు కీలక క్రికెటర్లు దూరమయ్యారు. రిషబ్‌ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌లు పరుగుల వేటలో ముందున్నారు. పంత్‌ సిరీస్‌కు దూరమవగా.. స్పిన్‌పై అద్భుతంగా అయ్యర్‌ తొలి టెస్టులో ఆడటం లేదు. పేస్‌ దళపతి జశ్‌ప్రీత్‌ బుమ్రా సైతం అందుబాటులో లేడు. ఈ ముగ్గురు ఆటగాళ్లు లేకుండా బరిలోకి దిగుతుండటం ప్రత్యర్థి జట్టుకు అనుకూలించే పరిణామం. ఇక స్టార్‌ బ్యాటర్లు విరాట్‌ కోహ్లి, చతేశ్వర్‌ పుజారలు అంచనాల మేరకు రాణించటం లేదు. 2021 ఆరంభం నుంచి పుజార సగటు 34.61 కాగా, విరాట్‌ కోహ్లి సగటు 23.85. రోహిత్‌ శర్మ టెస్టు ఫామ్‌పై ఇప్పుడే ఏమీ చెప్పలేని స్థితి. ఎందుకంటే, మార్చి 2022 తర్వాత రోహిత్‌ శర్మ ఒక్క టెస్టు మ్యాచ్‌లో బరిలోకి దిగలేదు.
 

నాయకుడిగా నిలబడేనా? : బోర్డర్‌-గవాస్కర్‌ టెస్టు సిరీస్‌ విజయం సాధించినా, విఫలమైన రోహిత్‌ శర్మ నాయకత్వ శకం స్వల్పకాలికమే. ఈ సిరీస్‌ విజయం భారత ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ అవకాశాలను నిర్దేశించనుంది. 2013 నుంచి ఐసీసీ టైటిల్‌కు దూరంగా ఉంటున్న టీమ్‌ ఇండియాకు ఆ లోటు తీర్చేందుకు రోహిత్‌ శర్మకు వరుసగా మూడు అవకాశాలు ముందున్నాయి. 2023 వన్డే వరల్డ్‌కప్‌, ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ సహా 2024 టీ20 ప్రపంచకప్‌లో వరుసగా ఉన్నాయి. నాయకుడిగా చరిత్రలో నిలిచేందుకు రోహిత్‌ శర్మకు ఇందులో ఒక్క విజయం చాలు!. భారత క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత విలువైన, ప్రతిభావంతులైన యువ క్రికెటర్లతో కూడిన టెస్టు జట్టుకు సారథ్యం వహిస్తున్న రోహిత్‌ శర్మ... స్వదేశంలో బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీని అందుకుంటాడా? ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో చోటు సాధిస్తాడా? చూడాలి.