Jun 23,2022 18:35

ఒడిశాలో ఖండగిరి పట్టణ చివర మురికివాడ ప్రాంతాల్లో నివసించే పేద పిల్లల కోసం కళాకారులు ఈ వేసవిలో ఓ లైబ్రరీ ఏర్పాటు చేశారు. రాజధాని నగరంలోని నీలకంఠ నగర్‌ ముండా సాహి సమీపంలో నివాసం ఉంటున్న విద్యార్థుల కోసం వారు ఈ సౌకర్యం కల్పించారు. దీని కోసం ఆ కళాకారులు చాలా కష్టపడ్డారు. ఖండగిరికి చెందిన కళాకారుడు ప్రమోద్‌ మురికివాడ పిల్లలకు ఉచితంగా చిత్రకళా తరగతులను నిర్వహించేందుకు 'ఒడిశా ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌' అనే ఫౌండేషన్‌ను ఏర్పాటుచేశారు. దీని ద్వారా కళను నేర్చుకోవాలన్న విద్యార్థులకు ఉచితంగా నేర్పిస్తున్నారు.

నగరశివారులో నివాసం ఉంటున్న ఈ పిల్లల కోసం పదిఏళ్ల క్రితం ఓ ఉపాధ్యాయుడు పాఠశాలను స్థాపించారు. అయితే పిల్లలు చదువుకునేందుకు ఆసక్తి చూపక పోవడంతో ఆ స్కూలు మూత పడింది. దాంతో స్థానికులు అక్కడ చెత్తచెదారం వేయడంతో ఆ ప్రదేశం మొత్తం డంప్‌యాడ్‌గా మారింది. ఇక్కడ పిల్లలను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ముందుకు వచ్చిన ప్రమోద్‌కు ఆ పాఠశాలే కనిపించింది. ఆ ప్రదేశాన్ని ఫౌండేషన్‌ సభ్యులు, కళాకారులు కలిసి శుభ్రం చేశారు. పిల్లల్ని ఆకర్షించేలా స్కూలుకు కొత్త రంగులు వేశారు. అక్కడున్న విద్యార్థులకు రైలంటే ఇష్టమని తెలుసుకుని అదే మాదిరిగా రైలు పెట్టెలు, కిటికీలు తలపించేలా పాఠశాల బయట గోడలకు రంగులు వేశారు. ఇది మొత్తం పూర్తి చేయడానికి వారికి 11 రోజులు పట్టింది. దాన్ని 'లెర్నింగ్‌ సెంటర్‌ కమ్‌ లైబ్రరీగా' మార్చి అక్కడ పిల్లలకు చదువు, చిత్రకళలు నేర్పిస్తున్నారు.

విద్యార్థులు ఖాళీ సమయాల్లో చదువు కునేందుకు ప్రాథమిక స్థాయి తరగతుల పుస్తకాలను ఉంచారు. క్లబ్‌ సభ్యుల్లో ఒకరు ప్రతిరోజూ వచ్చి వీరికి పాఠాలు బోధించారు. శని, ఆదివారాల్లో డ్రాయింగ్‌, పెయింటింగ్‌, ఆర్ట్‌కు సంబంధించిన క్లాస్‌లను నిర్వహించారు. సమీపంలోని పాఠశాలల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత, మాధ్యమిక స్థాయిల్లో చదువుతున్న 50 మంది పేద పిల్లలు ఈ వేసవిలో ఈ లైబ్రరీకి వచ్చి చదువుకున్నారు. వేసవి సెలవుల్లో సమయాన్ని వృథా చేయకుండా చిత్రకళా నైపుణ్యాలను నేర్చుకున్నారు. ఇంటి దగ్గర ఖాళీగా తిరుగుతున్న తమ పిల్లలకు మంచి దారి చూపారని మురికివాడకు చెందిన చిన్నారుల తల్లిదండ్రులు ఫౌండేషన్‌ సభ్యులను అభినందిస్తున్నారు.