Sep 29,2022 21:31

బీరుట్‌ : మిఛెల్‌ ఔన్‌ స్థానంలో నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవడంలో లెబనాన్‌ పార్లమెంటు గురువారం విఫలమైంది. వచ్చే అక్బోబరు 31తో ఔన్‌ పదవీకాలం ముగియనుంది. నూతన అధ్యక్షుడి కోసం జరిగిన మొదటి రౌండ్‌ ఓటింగ్‌కు 122 మంది పార్లమెంటు సభ్యులు హాజరు కాగా, వీరిలో మిఛెల్‌ మౌఅవాద్‌కు 36, సలీం ఈద్‌దేకు 11 ఓట్లు లభించాయి. 63 ఓట్లు చెల్లుబాటు కాలేదు. మరో 12 ఓట్లను గణించలేదు. పార్లమెంటులో తగిన కోరమ్‌ లేకపోవడంతో రెండో రౌండ్‌ ఓటింగ్‌కు అవకాశం లేకుండా పోయింది. అధ్యక్ష అభ్యర్థిపై ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత తదుపరి సమావేశాలు ఎప్పుడు నిర్వహించేదీ వెల్లడిస్తామని పార్లమెంటు స్పీకర్‌ నబీ బెర్రీ తెలిపారు. లెబనాన్‌ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులను ఎదుర్కొంటోంది. కొత్త అధ్యక్షుడు అయినా ఎన్నికయితే సంక్షోభ నివారణకు చర్యలు తీసుకునే అవకాశముంటుందని ఆశిస్తున్నారు. అయితే ఆరేళ్ల పదవీకాలానికి అధ్యక్షుడిని ఎన్నుకోవడంలో పార్లమెంటు విఫలమైంది.