Jul 04,2022 18:56

ఐదేళ్ల వయసులో సంజోలి తన చిన్న మనుసుపై పడిన ముద్ర జీవిత ఆశయానికి పునాదిగా మారింది. ఆడబిడ్డల భ్రూణహత్యలకు వ్యతిరేకంగా... ఆడపిల్ల బతికే హక్కుకై నిరంతరం ఉద్యమంలా నినదిస్తుంది. వారి భవిష్యత్తు కోసం తోడబుట్టిన చెల్లితో కలిసి ఏకంగా ఓ స్కూలే నడుపుతుంది. 'ఆడపిల్లల్ని కనండి- మంచిగా పెంచండి' అంటూ ఊరురా తిరుగుతూ ప్రతి ఒక్కరూ ఆలోచించేలా చైతన్యపరుస్తుంది.

సమాజంలో ఓ వైపు మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా, స్వతంత్రంగా ఉన్నత స్థితిలో ఉన్నట్లు కనిపిస్తున్నా... మరోవైపు ఆడపిల్ల్లలు ఎక్కడో ఒకచోట అణగదొక్కబడుతూ ఉన్నారు. ఆడపిల్లని పెంచడం భారంగానే భావిస్తున్నారు. పూర్తిస్థాయిలో ఆడపిల్లకు స్వేచ్ఛ రాలేదు. దానికోసమే సంజోలి, అనన్య కృషిచేస్తున్నారు.

jeevana, chinnari,  main  story

హర్యానాలోని కన్నూర్‌కు చెందిన సంజోలికి ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడు తన తల్లి కడుపుతో ఉంది. ఇంట్లో అమ్మ, నాన్న తరపు కుటుంబ సభ్యులు ఉన్నారు. తల్లిదండ్రుల మీద ఒకటే ఒత్తిడి. 'కడుపు తీయించుకోండి. లేకుంటే ఆడపిల్లను పెంచడం కష్టం. ఆ బాధ పడలేం' అంటూ పోరు పెడుతున్నారు. తల్లి ఒకటే ఏడుపు. తండ్రి మౌనంగా తలదించుకుని ఉన్నారు. ఇదంతా ఇరవై మూడేళ్ల సంజోలికి ఓ పీడ కలలా ఇప్పటికీ గుర్తుండి పోయింది. తల్లిని తీసుకుని ఆసుపత్రికి వెళ్లిన తండ్రి నవ్వు ముఖంతో ఇంటికి వచ్చాడు. తల్లి కళ్లలో కన్నీళ్లు ఆగాయి. 'మీ చావు మీరు చావండి' అంటూ బంధువులు తిట్టుకుంటూ వెళ్లిపోతున్నారు. తల్లి కడుపులో ఉన్న చెల్లిని తండ్రి పెంచేందుకు సిద్ధమయ్యాడు. తిట్టిన వారి నోళ్లు మూయించేలా పిల్లల్ని పెంచాలని నిర్ణయించుకున్నాడు.

స్కూలుదశ నుంచి ...
అప్పుడే సంజోలి భ్రూణహత్యల గురించి తండ్రిని అడిగి తెలుసుకోవడం, వాటికి వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించింది. స్కూల్లో నిర్వహించిన పోటీల్లో ఏడేళ్ల వయసులో సంజోలి ఈ అంశం మీద పెద్ద ప్రసంగమే ఇచ్చింది. ఇరుగుపొరుగు గ్రామాల్లో పాఠశాలలకు, పలు ఈవెంట్లకు వెళ్లి పిల్లల తల్లిదండ్రులకు చెప్పసాగింది. ఆడపిల్లల భ్రూణహత్యలకు వ్యతిరేకంగా ర్యాలీలు చేపట్టింది. పుట్టినా వారి పట్ల వివక్ష చూపరాదని అవగాహన కల్పించింది. ఈ కార్యక్రమాలను గ్రామాల్లో కొంతమంది వ్యతిరేకించారు. ఆడపిల్ల పెద్ద చదువులు చదవకూడదు. చిన్న వయసులో ఈ పనులు నీకు ఎందుకు? అని సంజోలీ దగ్గరకు వచ్చి చెబుతుండేవారు. అవేమి తను పట్టించుకోలేదు. ఆడపిల్ల బతుకు, దీనస్థితిని అర్థం పట్టేలా పాటలు, పద్యాలు పాడింది. సంజోలీ వాగ్ధాటి గురించి తెలిసిన వారంతా గొప్పగా చెప్పకోసాగారు. తను ఎక్కడ మాట్లాడినా వినడం మొదలుపెట్టారు. అప్పటి ముఖ్యమంత్రి సంజోలికి 'బాల్‌ పురస్కార్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ ఎట్‌ యాక్టివిజం' అవార్డు అందించి సత్కరించారు.

jeevana, chinnari,  main  story

అక్కను చూస్తూ పెరిగిన అనన్య కూడా ఆమె బాటలో నడుస్తోంది. ఆమెకు తోడుగా ఉద్యమంలో భాగమైంది. తమ సుదీర్ఘ పోరాటం కోసం ఓ సంస్థను స్థాపించారు. దాదాపు 250 మంది యువ వాలంటీర్లు అందులో ఉన్నారు. ఈ సంస్థ ద్వారా 'సేవ్‌ డాటర్స్‌, సేవ్‌ ఎర్త్‌' పేరిట ఏడు రాష్ట్రాల్లో 4,800 కి.మీ.ల దూరం ప్రచార యాత్ర చేపట్టారు. ఆ సమయంలో 'ఎర్త్‌ ఇన్‌ ఫ్లేమ్స్‌' డాక్యుమెంటరీని ప్రదర్శించేవారు. పాఠశాలలు, కళాశాలలలో సెమినార్లు నిర్వహించారు. ఆడపిల్లల పరిరక్షణ కోసం డిమాండ్లతో కూడిన లేఖను ప్రధానమంత్రికి పంపారు. భ్రూణహత్యలకు కారణమైన ప్రజల ఆలోచనా తీరును, భయాలను తొలగించాలనుకున్నారు. మెంటల్‌ హెల్త్‌ ప్రాజెక్టు పేరుతో జనంతో సంభాషించారు. అవసరమైన వారికి మానసిక నిపుణుల చేత కౌన్సిలింగ్‌ ఇప్పించారు.
jeevana, chinnari,  main  story

గ్రామం దత్తత తీసుకుని ...
ఆడపిల్లలు ఎక్కువగా ఉన్న 'దారార్‌' గ్రామాన్ని ఈ సంస్థ దత్తత తీసుకొంది. అక్కడ సుశిక్ష అనే మొబైల్‌ స్కూలు ప్రారంభించి, ఆడపిల్లలకు ఉచిత విద్యకు కృషిచేస్తున్నారు. ఋతుక్రమంలో పాటించాల్సిన జాగ్రత్తలు, పరిశుభ్రత, మానసిక ఆరోగ్యం, సమస్యల గురించి అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం 80 మంది విద్యార్థులు విద్యాబుధ్దులు నేర్చుకుంటున్నారు. సాధారణ స్కూల్లో కన్నా ఇక్కడ నేర్చుకున్న విజ్ఞానం ఎక్కువ అని విద్యార్థినులలో ఒకరైన దీపికా ధీమాన్‌ (14) చెబుతోంది. ఈ స్కూల్లో బాలికలు తమ ఇళ్లలో ఎదుర్కుంటున్న అణిచివేత తదితర అంశాలపై సందేశాత్మక నాటకాలు ప్రదర్శిస్తున్నారు. మహిళలు, ఆడపిల్లలకు రక్షణ నిచ్చే సమాజాన్ని సృష్టించాలనే లక్ష్యంతో సంజోలీ-అనన్య ముందుకు వెళుతున్నారు.