Mar 19,2023 21:02

- ఎపిఎంఎస్‌ఆర్‌యు జనరల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఎఫ్‌ఎంఆర్‌ఐ జాతీయ కార్యదర్శి భట్టాచార్య
ప్రజాశక్తి - భీమవరం రూరల్‌ (పశ్చిమగోదావరి జిల్లా):మెడికల్‌ రిప్రజంటేటివ్‌లపై బహుళజాతి సంస్థల దాడులను తిప్పికొట్టాలని ఎఫ్‌ఎంఆర్‌ఐ (ఫెడరేషన్‌ ఆఫ్‌ మెడికల్‌ రిప్రజెంటేటివ్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా) జాతీయ కార్యదర్శి భట్టాచార్య అన్నారు. ఎపి మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజెంటేటివ్స్‌ యూనియన్‌ (ఎపిఎంఎస్‌ఆర్‌యు) జనరల్‌ కౌన్సిల్‌ సమావేశం రెండో రోజు ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలోని టౌన్‌ హాల్లో సంఘం రాష్ట్ర అధ్యక్షులు టివి.కోటేశ్వరరావు అధ్యక్షతన కొనసాగింది. ముఖ్యఅతిథిగా భట్టాచార్య పాల్గని మాట్లాడుతూ.. ప్రజలకు మందుల ధరలు అందుబాటులో ఉండేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని, మందులపై జిఎస్‌టి తొలగించాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం తమ హక్కులను హరించే విధానాలను అవలంభిస్తోందని, వీటికి వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. తమ హక్కుల కోసం న్యాయబద్దమైన పోరాటం చేస్తోన్న ఎపిఎంఎస్‌ఆర్‌యు నాయకులను ఫార్మా కంపెనీలు సుదూర ప్రాంతాలకు బదిలీ చేయడాన్ని ఇక నుంచి సహించబోమని సమావేశం స్పష్టం చేసింది. ఫైజర్‌, ఆస్ట్రాజనిక, గ్లాక్సో, నోవర్టిస్‌ వంటి బహుళజాతి సంస్థలు ఇటీవల మెడికల్‌ రిప్రజెంటేటివ్స్‌పై చేసిన దాడులకు వ్యతిరేకంగా రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకట్రావు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కాషాయ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని, కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్ర కార్యదర్శులు చంద్రమౌళి, మనోహర్‌ తీర్మానాలను ప్రవేశపెట్టారు. వీటితోపాటు పలు తీర్మానాలను ఈ సమావేశం ఆమోదించింది. బహుళజాతి కంపెనీలు మెడికల్‌ రిప్స్‌పై నిర్థాక్షిణ్యంగా సాగిస్తున్న దాడులను సమావేశం ఖండించింది. విపరీతమైన పని భారం మోపడం మానుకోవాలని, చట్టవ్యతిరేక చర్యలు ఆపాలని డిమాండ్‌ చేసింది. పలు కంపెనీలు ఇదే ధోరణి అవలంబిస్తున్నాయని పేర్కొంది. కార్మిక వ్యతిరేక విధానాల పట్ల మెడికల్‌ రిప్స్‌ అంతా సంఘటితంగా పోరాటాలకు సిద్ధం కావాలని సమావేశం పిలుపునిచ్చింది. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి.నాగేశ్వరరావు మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం అనుసరిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సాగే ఉద్యమాల్లో మెడికల్‌ రిప్స్‌ భాగస్వాములు కావాలని కోరారు. జనరల్‌ కౌన్సిల్‌ సమావేశాల్లో ఆయన సౌహార్థ్ర సందేశమించ్చారు. మెడికల్‌ రిప్స్‌ పోరాటాలకు సిఐటియు అండగా ఉంటుందన్నారు. ఎపిఎంఎస్‌ఆర్‌యు ప్రధాన కార్యదర్శి యువి.కృష్ణయ్య మాట్లాడుతూ రానున్న రోజుల్లో పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు. తెలంగాణ మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజెంటేటివ్స్‌ కోశాధికారి దుర్గాప్రసాద్‌ పాల్గొని మాట్లాడారు.