
- వచ్చే ఏడాది కేంద్ర బడ్జెట్‌లో రూ.లక్షే
- మిర్చి, పసుపు, ఉల్లి రైతులకు నష్టం
- వేరుశనగ, శనగ, పప్పులు, హార్టికల్చర్ కూడా...
- రాష్ట్ర కేటాయింపులపై ఉత్కంఠ
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : మార్కెట్ ఇంటర్వెన్షన్‌కు కేంద్రం చెల్లుచీటి ఇచ్చేసింది. రైతుల ఉత్పత్తులకు మార్కెట్‌లో ధరలు పతనమైన సందర్భాల్లో ప్రభుత్వం మార్కెట్‌లో జోక్యం చేసుకొని పంటలను కొనుగోలు చేసి పోటీ సృష్టించి తద్వారా వ్యాపారులు దిగి వచ్చేలా చేస్తుంది. అందుకు ఉద్దేశించిన మార్కెట్ ఇంటర్వెన్షన్, ప్రైస్ సపోర్ట్ స్కీంల (ఎంఐఎస్-పిఎస్‌ఎస్)ను ఎత్తేసే ఆలోచనలో కేంద్రం ఉంది. ఈ పథకాలకు వచ్చే ఏడాది బడ్జెట్‌లో కేవలం లక్ష రూపాయలు మాత్రమే ప్రతిపాదించడంతో 'మార్కెట్ ఇంటర్వెన్షన్' ప్రశ్నార్ధకమైంది. జాతీయ ఆహార భద్రతా చట్టం, ప్రజా పంపిణీ వ్యవస్థల కోసం వరి ధాన్యం, గోధుమలను కేంద్రం సేకరిస్తోంది. ఇప్పుడు వాటికీ పరిమితులు విధించింది. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) ప్రకటించిన ఇతర పంటలు, ఎంఎస్‌పి లేని పంటల కొనుగోళ్లకు ఎంఐఎస్-పిఎస్‌ఎస్‌లే దిక్కు. కాగా వచ్చే ఏడాది కేంద్రం ఆ పథకాలకు నిధులు కేటాయించకపోవడంతో ఆయా పంటలు పండించే రైతుల పరిస్థితి అగమ్యగోచరమైంది. కార్పొరేట్ల, ప్రైవేటు వ్యక్తుల దయాదాక్షిణ్యాలపై రైతన్నలు ఆధారపడాల్సిన ప్రమాదం పొంచి ఉంది. కాగా రైతులకు కేంద్రం మొండి చెయ్యి చూపించిన తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో అందుకవసరమైన నిధులు కేటాయించి రైతులకు మద్దతుగా నిలవాల్సి ఉంది.
రద్దు దిశ
వేరుశనగ, శనగ, ఇతర పప్పుధాన్యాలు, కొన్ని చిరు ధాన్యాలకు కేంద్ర ప్రభుత్వం ఎంఎస్‌పి ప్రకటిస్తుంది. మార్కెట్‌లో ఈ పంటలకు ఎంఎస్‌పి కంటే తక్కువ ధర పలుకుతున్నప్పుడు మార్కెట్‌లో జోక్యం చేసుకొని పరిమిత పరిమాణంలోనైనా సదరు పంటలను రాష్ట్ర ప్రభుత్వ సంస్థలైన మార్క్‌ఫెడ్, మార్కెటింగ్, ఆయిల్‌ఫెడ్ వంటి సంస్థలతో కేంద్ర సంస్థలైన నాఫెడ్, ఎన్‌సిడిసి వంటి సంస్థలు నిధులిచ్చి కొనిపిస్తాయి. కొన్నాళ్లు గోదాముల్లో నిల్వ చేసి వాటిని పిడిఎస్‌కు లేదంటే వ్యాపారులకు విక్రయిస్తాయి. ప్రభుత్వం మార్కెట్‌లో జోక్యం చేసుకోవడం వలన అప్పటి వరకు తక్కువ ధరకు కొనుగోలు చేసే వ్యాపారులు కొంత వరకు దిగి వచ్చి ధర పెంచుతారు. ఆ మేరకు రైతులకు కొంత మేలు జరుగుతుంది. ఎంఎస్‌పి లేని పంటలైన మిరప, పసుపు, ఉల్లి, అరటి, బత్తాయి వంటి వాటికి 'ప్రైస్ సపోర్ట్ స్కీం' ఉంది. మార్కెట్‌లో ధరలు పడిపోయినప్పుడు ప్రభుత్వ ఏజెన్సీలు ఎంఎస్‌పి నిర్ణయించి కొంత మేరకు కొనుగోలు చేస్తాయి. ఈ చర్య ప్రైవేటు వ్యాపారులు ధర పెంచడానికి దోహదపడుతుంది. రైతులకు ఉపశమనం కలిగించే ఎంఐఎస్-పిఎస్‌ఎస్‌లకు 2021-22లో కేంద్రం రూ.2,288 కోట్లు ఖర్చు చేసింది. 2022-23లో రూ.1,500 కోట్లకు కేటాయింపులు తగ్గించింది. వచ్చే 2023-24లో కేవలం రూ.లక్ష ప్రతిపాదించింది.
ఇక అంతా రాష్ట్రమే
ధరలు పడిపోయినప్పుడు వేరుశనగ, శనగ, కొన్ని సందర్భాల్లో కందులు, మినుములు, పెసలను రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా కొనుగోలు చేస్తోంది. ఎంఎస్‌పి లేని మిరప, పసుపు, అరటి, బత్తాయి (చీని) ఇత్యాది హార్టికల్చర్ పంటలను కొంటోంది. అందుకు కేంద్ర నిధులను ఉపయోగించుకుంటోంది.
రాష్ట్ర సర్కారు తన బడ్జెట్‌లో ధరల స్థిరీకరణ నిధికి రూ.3 వేల కోట్లు కేటాయిస్తామని తొలుత చెప్పింది. ఆ నిధిని రెండేళ్ల నుంచి రూ.500 కోట్లకు తగ్గించింది. అవి సైతం పూర్తి స్థాయిలో ఖర్చు కావట్లేదు. కేంద్ర నిధులకు మ్యాచింగ్ చేసి పరిమితంగా పంటలు కొనుగోలు చేస్తోంది. వచ్చే ఏడాది నుంచి కేంద్రం నిధులివ్వకపోతే రాష్ట్రమే పూర్తిగా నిధులు భరించాలి. లేదంటే రైతుల నుంచి ఇప్పుడు కొనే పరిమాణంలో కూడా కొనే పరిస్థితి ఉండదు.