Mar 19,2023 11:21

నెలసరిలో ఉన్నప్పుడు రక్తస్రావం, నొప్పితో పాటే రక్తస్రావం అయిన ప్రతిసారీ అసహజంగా అనిపించడం, కదిలితే, మెదిలితే ఏదోలా ఉండడం, మెట్లు ఎక్కాలన్నా, దిగాలన్నా.. ఇబ్బంది పడడం, రాపిడి, దురద, రెండు కాళ్ల మధ్య మంట ఇలా ఒకటా రెండా ఒక్కొక్కరిది ఒక్కో సమస్య.. ప్రతి ఒక్కరికీ ఏదోక ఇబ్బంది. మార్కెట్లో అందుబాటులో ఉన్న రకరకాల ప్యాడ్లు వాడుతున్నా ఆ సమస్యల నుండి మాత్రం ఉపశమనం లభించడం లేదు.. అయితే అందరికీ తెలియకపోయినా.. కొంతమందికి తెలిసిన పీరియడ్‌ కప్‌ను నెలసరి సమయంలో ఉపయోగించడం వల్ల ఇటువంటి ఇబ్బందులన్నింటిని నుండి ఉపశమనం పొందవచ్చు. మరి దాన్ని ఎలా వినియోగించాలి.. ఏవైనా సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయా.. అనే వివరాలు, అవి వాడుతున్న వారి అనుభవాలు, డాక్టర్ల సలహాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతి ఒక్కరూ నెలకు సరాసరి పదిహేను ఆపైన ఎక్కువ ప్యాడ్లు ఉపయోగిస్తున్నా రనుకుందాం. అలా పీరియడ్‌ మొత్తం కాల పరిధిలో అంటే నెలసరి మొదలైన వయసు నుండి మోనోపాజ్‌ వచ్చే వరకు సుమారు 6 వేల నుండి 17 వేల మధ్య ప్యాడ్లు వినియోగించాల్సి ఉంటుంది. అదే నెలసరిలో ఉన్న మహిళలు ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురు వుంటే ఆ సంఖ్య ఎంతవుతుందో ఒక్కసారి అంచనా వేయండి.. మార్కెట్లో దొరికే అతి చవకైన ప్యాడు ధర కూడా రూ.30 పైమాటే.. అలా ఖర్చు కూడా ఎక్కువే.. పైగా నాసిరకం ప్యాడ్లు వాడకం వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తుంటాయి..ఈ సమస్యల నుండి బయట పడాలంటే పీరియడ్‌ కప్‌ తప్పక వాడాల్సిందే.

 

                                                                పీరియడ్‌ కప్‌ అంటే ఏంటి..

ఈ కప్‌ గంట ఆకారంలో ఉంటుంది. దీన్ని వాడడం వల్ల అసలు పీరియడ్‌లో ఉన్నామన్న భావనే ఉండదంటున్నారు చాలామంది. పర్యావరణానికి ఎంతో మేలు చేసే ఈ కప్స్‌ హాస్పటల్‌ పరికరాల్లో వాడే సిలికాన్‌ పదార్థంతో తయారవుతున్నాయి. మన ఆరోగ్యానికి ఏవిధమైన హానీ చేయవు. ఆన్‌లైన్‌ మార్కెట్లో ఈ కప్స్‌ ఇప్పుడు రూ.300 నుండి రూ.1000 ధరలో రకరకాల సైజుల్లో లభిస్తున్నాయి. ఉపయోగించిన తరువాత శుభ్రం చేసుకుని మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు. అలా ఒక్కో కప్‌ సుమారు 5 నుండి 6 ఏళ్ల సుదీర్ఘకాలం పనిచేస్తుంది.


                                                                               ఎలా వాడాలి..

వెజీనా నుండి ఈ కప్‌ను లోపలికి పెట్టుకోవాల్సివస్తుంది. గర్భాశయ గోడలకు అది అమరిపోతుంది. దీంతో నెలసరి రకస్రావం నేరుగా కప్‌లోకి పడిపోతుంది. ప్యాడ్‌ అవసరమే ఉండదు. సాధారణ స్రావం అయ్యేవాళ్లు ఆరు, ఏడు గంటలు అలా ఉంచేసుకోవచ్చు. అధిక స్రావం అయ్యేవాళ్లు మాత్రం మూడు, నాలుగు గంటలకొకసారి తీసి శుభ్రం చేసుకోవాలి.

66

 

                                                                 ఎవరెవరు ఉపయోగించొచ్చు..

అన్ని వయసుల వారూ ఈ కప్స్‌ వినియోగించొచ్చు. పెళ్లి కాని వారు.. పెళ్లయిన వారూ.. పెళ్లయి పిల్లలున్న వారు, పిల్లలు పుట్టని వారు, సాధారణ ప్రసవం అయినవాళ్లు.. ఇలా రకరకాల స్థితుల్లో ఉన్న వారికి వివిధ సైజుల్లో ఇవి లభిస్తాయి. అయితే ప్యాడ్లు దొరికినంత సులభంగా ప్రస్తుతం ఇవి మార్కెట్లో లభించడం లేదు. కాబట్టి ఆన్‌లైన్‌ మార్కెట్‌నే అనుసరించాలి.

 

1122

                                                                         అన్ని పనులు చేసుకోవచ్చు

మొదట్లో దీనిని తీయడానికి పెట్టడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ఒకసారి అలవాటయితే దానంత సౌకర్యవంతంగా ఏదీ ఉండదు. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న అన్నిటికంటే ఇది బెస్ట్‌ ఆప్షన్‌ అని నేను చెబుతాను. అది వాడుతున్నప్పుడు యధావిధిగా అన్ని పనులు చేసుకోవచ్చు. స్విమ్మింగ్‌ వెళ్లాలనుకున్న వాళ్లు స్విమ్మింగ్‌ చేయొచ్చు. యే పనైనా (ఎక్సర్సైజ్‌, వాకింగ్‌, రన్నింగ్‌, సైక్లింగ్‌) ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. ధర కూడా సానిటరీ పాడ్స్‌ తో పోలిస్తే చాలా తక్కువ. తక్కువ రక్త స్రావం అయ్యే వారు పన్నెండు గంటల వరకు దాని గురించి మర్చిపోవచ్చు. 12 గంటలకు మాత్రం ఒకసారి తీసి క్లీన్‌ చేసుకుని మళ్లీ పెట్టుకోవాల్సి ఉంటుంది. అదే ఎక్కువ స్రావం అయ్యేవారు 5-6 గంటలకు ఒకసారి క్లీన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. నిజానికి ప్యాడ్స్‌ వాడుతున్నప్పుడు బాగా చిరాగ్గా ఉంటుంది. ఎక్కడ లీక్‌ అవుతుందో అని భయంగా ఉంటుంది. స్రావం అయినపుడు తెలుస్తూ ఉంటుంది. కూర్చున్న, లేచినా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఈ కప్‌ వల్ల అలాంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. ఒకసారి సెట్‌ అయ్యే సైజ్‌ దొరికింది అంటే ఇంక అది ఎప్పటికీ వాడుకుంటూ ఉండవచ్చు. మొదటి రెండు మూడు నెలలు అలవాటు అయ్యేంత వరకు కప్‌తో పాటు ప్యాడ్స్‌ కూడా అవసరం పడతాయి. అలవాటయ్యాక కప్‌ గురించి మీ అనుభవాలను మీ స్నేహితులతో పంచుకోవడం మాత్రం మర్చిపోవద్దు.
                             - డాక్టర్‌ సి దేశం, కమ్యూనిటీ మెడిసిన్‌ డిపార్ట్‌మెంట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌.

 

3344

                                                                         సమస్యలు ఏవీ వుండవు..

కప్స్‌ వాడడం వల్ల ఏవిధమైన సమస్యలు ఉండవు. ఇది వందశాతం ఆరోగ్యకరమైనది. ప్యాడ్లు వాడకం వల్ల మనకు తెలియకుండానే పర్యావరణానికి చేటు చేసినవాళ్లమవుతాం. కాని ఈ కప్స్‌ వాడకం వల్ల పర్యావరణం దెబ్బతినదు. యుటెరస్‌ పొజిషన్‌ బట్టి కొంతమందికి ఇబ్బందికరంగా అనిపించవచ్చు. మరికొంతమందికి వెజైనిస్‌మస్‌ సమస్య ఉంటుంది. ఏవిధమైన సమస్యలు లేని వారు మాత్రం దీన్ని నిరభ్యంతరంగా ఉపయోగించుకోవచ్చు. వాడే ముందు నీళ్లల్లో ఉడకబెట్టాలి. వాడేటప్పుడు కప్‌లో నిండిన రక్తస్రావాన్ని ఒంపేసి నీళ్లల్లో కడిగి వాడుకోవచ్చు. పీరియడ్‌ మొత్తం పూర్తయ్యాక మళ్లీ ఇంకోసారి నీళ్లల్లో ఉడకబెట్టి ఆరిన తరువాత భద్రపర్చుకోవాలి. స్త్రీ పునరుత్పత్తి అవయవాల్లో యూరిన్‌ ద్వారం, గర్భశాయ ద్వారం, మల ద్వారం వేటికవే ప్రత్యేకంగా ఉంటాయి. కాబట్టి కప్‌ పెట్టుకున్న తరువాత యూరిన్‌ వెళ్లాలంటే ఇబ్బందేమీ ఉండదు. ఈ కప్‌ ఎలా మడిస్తే అలా ముడుచుకుంటుంది. కాబట్టి దీన్ని పెట్టుకునేటప్పుడు వీలైనట్లుగా మడతపెట్టుకోవాలి. లోపలి గోడలకు తగలగానే ఫీక్స్‌ చేసినట్లు ఒకసారి తిప్పుకుంటే సరిగ్గా ఫిట్‌ అవుతుంది. పొజిషన్‌ సరిగ్గా అమరకపోతే కంగారు పడాల్సిన పనిలేదు. బలవంతంగా తోయడం వల్ల వెజినా కండరాలపై ఏవిధమైన ఒత్తిడి పడదు. మొదట్లో కొంచెం నొప్పి ఉన్నా.. ఒక్కసారి సరిగ్గా అమరితే ఎంతో సౌకర్యంగా ఉంటుంది.
                      డాక్టర్‌ యోజిత, ఎండి పీడియాట్రిక్‌.

 

 

5566

                                                                                 అందరూ వాడొచ్చు..

ఈ కప్స్‌ అందరూ వాడొచ్చు. గర్భసంచి నుండి వెజీనా వరకు ఉండే సర్విక్స్‌ (గర్భాశయ ముఖ ద్వారం) పొడవును బట్టి స్మాల్‌, మీడియం, లార్జ్‌ సైజుల్లో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కప్‌ తీసి పెట్టడం వల్ల వెజీనా కండరాలేవీ వదులవ్వవు. గర్భసంచి ఇబ్బందులున్నవాళ్లు కూడా డాక్టరు సలహా మేరకు కప్‌ వాడొచ్చు. లోపలికి పెట్టడం వల్ల ఎటువంటి గాయాలు అవ్వవు. సరైన పొజిషన్‌లో ఉండి అమర్చుకోవాలి. మొదట్లో కప్‌ పెట్టుకున్న తరువాత అవసరమైతే ప్యాడ్‌ పెట్టుకోవచ్చు. అలవాటయ్యాక ప్యాడ్స్‌ వాడనవసరం లేదు. కొత్తగా వాడేవారు పీరియడ్‌ వచ్చినప్పుడు కంటే ముందు ఒకసారి ప్రయత్నించి చూస్తే కొంత భయం పోతుంది. కప్‌ గోడలు చాలా మృదువుగా ఉంటాయి. ఎలా మడిస్తే అలా ముడుచుకుపోతాయి. ఒకవేళ ఇంకా సులభంగా ఉండాలంటే వాటర్‌ బెస్ట్‌ లూబ్రికేంట్‌ ఉపయోగించవచ్చు.
                                                                                                  డాక్టర్‌ ఎం విజయలక్ష్మి, ఎంబిబిఎస్‌, డిజిఒ.

 

223

                                                                      సౌకర్యవంతంగా ఉంటాయి

నేను ఈ కప్స్‌ 8 ఏళ్ల నుండి వాడుతున్నాను. చాలా సౌకర్యంగా ఉంటుంది. నాతో పాటు మా సిబ్బంది అందరికీ ఈ ప్యాడ్లు వినియోగించమని సూచించాను. మొదట్లో ఇబ్బందిపడ్డా ఆ తరువాత వారంతా చాలా సంతోషించారు. ప్యాడ్ల వినియోగం వల్ల పర్యావరణం చాలా కలుషితమవుతుంది. ఆరోగ్య సమస్యలూ వస్తాయి. కప్‌ వాడకం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అన్ని వయసుల వారూ ఉపయోగించవచ్చని డాక్టర్లు సలహాలిస్తున్నారు. మా సిబ్బందికి, మా స్కూలు పిల్లలకు వీటిపై అవగాహన కల్పించడంలో నేను ఎప్పుడూ ముందుంటాను. ఆన్‌లైన్‌లో పెద్ద మొత్తంలో కప్స్‌ ఆర్డరు పెట్టి పంచిపెడుతుంటాను. ఖర్చు భరించ లేని వాళ్లకు ఉచితంగా ఇస్తాను. ఇంత మంచి ప్రొడక్టు గురించి అందరూ తెలుసుకోవాలి. మా స్కూలుకు వచ్చే అతిథులకు ముఖ్యంగా మహిళలకు ఈ కప్‌ను బహుమతిగా అందిస్తాను. భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ పీరియడ్‌ కప్‌ ఉపయోగించాలి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది.
                                                                                                 బి.ఇంద్రాణి, ఎంఎస్‌సి, ఎంఇడి,
                                                                                        అరవింద హైస్కూల్‌ ప్రిన్సిపాల్‌, కుంచనపల్లి.

 

నాకు గిఫ్ట్‌గా ఇది ఇచ్చారు. రెండేళ్లు వాడకుండా పక్కనపెట్టేశాను. యూట్యూబ్‌ వీడియోస్‌ చూసి కొంతమంది డాక్టర్ల సూచనతో ప్రయత్నించాను. మొదటిసారే చాలా బాగా అనిపించింది. పీరియడ్‌లో ఉన్నామని అసలు అనిపించదు. ప్రతి పీరియడ్‌లో ఎంత కొలతలో రక్తస్రావం అవుతుందో కూడా తెలుసుకోవచ్చు. చాలా బాగుంటుంది.
                                       - లావణ్య, కుంచనపల్లి.

మూడేళ్ల నుండి వాడుతున్నాను. మా మేడమ్‌ వీటి గురించి చెప్పి ఇచ్చిన తరువాత కొన్ని నెలల పాటు వాడకుండా అలాగే ఉంచేశాను. కాని ఆ తరువాత వాడడం మొదలుపెట్టాక చాలా సౌకర్యంగా ఉంటోంది. అసలు పీరియడ్‌లో ఉన్నామనే తెలియడం లేదు. గతంలో నాకు పీరియడ్‌ సమస్యలు దురద, మంట వంటివి ఉండేవి. ఇప్పుడవేమీ లేవు.
                                                              - పూర్ణశ్రీ, పాతూరు.

కాలుష్యాన్ని తగ్గించడంలో ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఐదేళ్ల నుండి వాడుతున్నాను. మొదటిసారి ఇబ్బందిపడ్డా, ఆ తరువాత ఏవిధమైన ఇబ్బందీ లేదు. పిల్లలు కూడా ఉపయోగించవచ్చని మా మేడమ్‌ చెప్పారు. చాలా బాగుంది. 

                                                                                                              - అమ్మాజీ, కుంచనపల్లి.

ఐదారేళ్ల నుండి వాడుతున్నాను. ఇన్‌ఫెక్షన్స్‌ ఉంటాయోమోనని మొదట్లో భయపడ్డాను. కాని అలా ఏమీ లేదు. రకరకాల సైజుల్లో దొరుకుతాయి. ధైర్యంగా వాడొచ్చు. భయం ఉండకూడదు.    - సునీత, ఉండవల్లి.

- జ్యోతిర్మయి