Oct 03,2022 21:01

ప్రజాశక్తి - ఉక్కునగరం (విశాఖపట్నం) : స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటుపరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పన్నుతున్న కుట్రలను ఐక్య పోరాటాలతో తిప్పికొడతామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు స్పష్టం చేశారు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రయవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారానికి 599వ రోజుకు చేరాయి. దీక్షా శిబిరంలో స్టీల్‌ప్లాంట్‌ పలు విభాగాలకు చెందిన కార్మికులు కూర్చున్నారు. వారినుద్దేశించి పోరాట కమిటీ నాయకులు వై.మస్తానప్ప, జె.రామకృష్ణ మాట్లాడారు. స్టీల్‌ కార్మికులకు బోనస్‌ చెల్లించడానికి యాజమాన్యం ముందుకు రాకపోవడం శోచనీయమన్నారు. విశాఖ ఉక్కును నిర్వీర్యం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని, అవసరమైన సమయంలో మోడీ సర్కారుకు తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు. ప్రతి కార్మికుడూ పోరాటంలో పాల్గొన్నప్పుడే ప్లాంట్‌ను రక్షించుకోగలమని అన్నారు. ఉక్కు సత్యాగ్రహ పాదయాత్ర జోరువానలోనూ రెట్టించిన ఉత్సాహంతో జరిగిందని తెలిపారు. అందులో పాల్గొన్న ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలియజేశారు.