May 26,2023 10:45
  • ఉపాధి పనుల్లో పండుటాకుల పాట్లు

ప్రజాశక్తి - కడప ప్రతినిధి : ఇది ఒక్క యల్లాయమ్మ, మారతమ్మల (పేర్లు మార్చాం) పరిస్థితి కాదు. కడప జిల్లాలో ప్రతి మండలంలోని 50 నుంచి 70 ప్రాంతాల్లో ఉపాధి పనులు చేస్తున్న ప్రతి టీములోనూ ఇటువంటి ధీనగాధలు కొకొల్లలు. తొమ్మిదో తరగతి చదువుతున్న విష్ణువర్ధన్‌తో మొదలుకుని 60 ఏళ్లు వయస్సు మీరిన వృద్ధులు సైతం ఉపాధి హామీ పనులకు హాజరవుతున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా ఉపాధి హామీ పనులకు హాజరవుతున్న జిల్లాలో కడప జిల్లా ఒకటి. రోజుకు 1.09 లక్షల నుంచి 1.35 లక్షల మంది ఉపాధి పనులకు హాజరవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఉపాధి కూలీలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులు, వసతుల కల్పన వంటి అంశాలపై ప్రజాశక్తి పరిశీలనలో వెలుగులోకి వచ్చిన కొన్ని అంశాలివి. వల్లూరు మండలం గోటూరు చెరువు, ఓబాయపల్లి ప్రాంతాల్లో ఉపాధి పనులు చేపట్టారు. గోటూరు చెరువు, ఓబాయపల్లిలో ఒక్కో ప్రాంతంలో 300 జాబ్‌కార్డులు ఉండగా, ఐదు టీములుగా టీముకు 40 మంది చొప్పున 200 మంది హాజరయ్యారని ఫీల్డ్‌ అసిస్టెంట్‌ భాస్కర్‌ తెలిపారు.ఉపాధి పనులకు వచ్చిన వారిలో టీముకు ఒకరు చొప్పున ఐదుగురు వృద్ధులు ఉండడం గమనార్హం. వారిని పలకరించగా వృద్ధాప్య పింఛన్‌ తీసుకుని ముద్ద పెట్టడమే గగనంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో తమకు అనారోగ్య పరిస్థితులు ఎదురైతే పట్టించుకోవడం లేదని కొందరుచెబుతుండగా.. సుగర్‌, బిపి, కంటి రోగాలు వంటి దీర్ఘకాలిక రోగాలకు అవసరమైన మందులకు వృద్ధాప్య పింఛన్‌ సరిపోతోందని మరికొందరు చెబుతున్నారు. కుటుంబాలకు భారం కాకుడదని,కాళ్లు, చేతులు ఆడినంత వరకు పనులకు వెళ్తామని చెబుతున్నారు.

11

' నాకు ఆరుగురు పిల్లలు. ఇద్దరు కూతుళ్లు, నలుగురు కొడుకులు. మేమిద్దరు ముసలోళ్లం. ఎటువంటి జీవనాధారం లేదు. ఎవరికి వాళ్లు వేర్వేరు ఇళ్లలో ఉంటున్నారు. మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు'. వృద్ధాప్య పింఛన్‌ రూ.2,700 సుగర్‌ మందులకే సరిపోతుంది. వ్యవసాయ పనులు చేయలేం. ఏ ఆదరువు లేదు. ఈ పరిస్థితుల్లో ఉపాధి పనులే దిక్కయ్యాయి.
                                  - ఇదీ కడప జిల్లా వల్లూరు మండలం, చాకవారిపల్లి గ్రామానికి చెందిన కె.యల్లాయమ్మ ఆవేదన.

22

'వ్యవసాయ పనులే ఆధారం. నాకు ఒక కూతురు. పెళ్లి చేశా. కూతురుకు భారంగా మారడం నచ్చలేదు'. ఏదైనా పనిచేద్దామనుకుంటే వయస్సు తగ్గడంతో రైతులు పనులకు పిలవడం లేదు.ఇంటి పట్టనే ఊరకనే ఉండి, కుటుంబానికి భారంగా మారడం కన్నా, ఉపాధి పనుల ద్వారా వచ్చే లెక్కతో తన బతుకు తాను బతకాలనే ఉద్దేశంతోనే ఉపాధి పనులకు వచ్చాను.
                                                            - వెంకటేశాపురం గ్రామానికి చెందిన మారతమ్మ దీనగాధ.