
- వేతన జీవులకు ఎలాంటి ఉపయోగం లేదు : యుటిఎఫ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్‌లో విద్యారంగానికి అరకొర నిధులు కేటాయించిందని యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ విమర్శించింది. విద్య బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకుంటున్నట్లు అర్థమవుతోందని ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్ వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్ ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యారంగానికి జిడిపిలో 6 శాతం నిధులు కేటాయించాలని కొఠారి కమిషన్ చెప్పినా.. ప్రస్తుత బడ్జెట్‌లో జిడిపిలో 0.3 శాతం, మొత్తం బడ్జెట్‌లో 2.5 శాతం మాత్రమే కేటాయించినట్లు విమర్శించారు. గతేడాదితో పోలిస్తే 0.12 శాతం పెరిగినట్లు అనిపిస్తున్న ఈ నిధులు ప్రభుత్వ రంగంలో విద్య నిర్వహించడానికి ఏమాత్రం సరిపోవని తెలిపారు. శాస్త్ర సాంకేతిక రంగాలకు 2 శాతం కేటాయించాల్సి ఉండగా, 0.7 శాతం మాత్రమే కేటాయించారని పేర్కొన్నారు. శాస్త్రీయ ఆలోచన కలిగిన విద్యార్థుల్ని తయారుచేయడానికి అవరోధం ఏర్పడుతుందన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలను ప్రైవేట్ రంగానికి అప్పజెప్పే దిశగా ఈ బడ్జెట్‌లో ప్రతిపాదన ఉందని తీవ్రంగా ఆక్షేపించారు. పన్ను మినహాయింపు కోసం ఎదురుచూసిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎలాంటి పెరుగుదల లేదని తీవ్రంగా ఖండించారు. రూ.5 లక్షల లోపు పన్ను మినహాయింపు ఉంటుందని ఆశించిన వారికి తీవ్ర నిరాశ కలిగిందని తెలిపారు. రూ.7 లక్షల లోపు మినహాయింపు అనేది కొత్త పన్ను విధానానికి మాత్రమే వర్తిస్తుందని, ఇది ఉపయోగపడదని పేర్కొన్నారు. బడ్జెట్ ఆమోదం పొందేలోపు పన్ను మినహాయింపును రూ.5 లక్షలకు సవరించాలని, సేవింగ్స్ రూ.3 లక్షలకు పెంచాలని, శాస్త్ర సాంకేతిక రంగాలకు నిధులు కేటాయించి ప్రభుత్వ పరిశోధనలు ప్రోత్సహించాలని కోరారు.