Aug 01,2022 07:40

ఏ కాలంలోని మనుషులైనా తమ ఆశలను, ఆకాంక్షలను, ఆవేదనలు, ఆందోళనలనూ తమ సాంస్కృతిక  రూపంలో వెల్లడిస్తారు. ఆటగానో, పాటగానో ప్రతిబింబిస్తారు. అందుకనే ఏ ఉద్యమంలోనైనా ఆ ఉద్యమం తాలుకూ ఆకాంక్ష ప్రజలందరి హృదయాలనూ తాకాలి అంటే -  సాహిత్య, సాంసృతిక రూపాల్లోకి దానిని తర్జుమా చేయాలి. గుండెగుండెనూ నినాదమై తాకటానికి, జనం ప్రభంజనమై కదలటానికి పాటలుగా, పద్యాలుగా, నాటకాలుగా, వివిధ కళారూపాలుగా, కథలుగా, నవలలుగా సాహిత్యం ఉరకలెత్తాలి. అలాంటి బృహత్తరమైన కృషి తెలుగు నాట సాగిన స్వాతంత్య్ర ఉద్యమంలో సాగింది. అలా సాగుతూనే సంఘ సంస్కరణ, స్వరాజ్య ఆకాంక్ష ఊపిరిగా మన సాహిత్య రూపాలు క్రమ వికాసం చెందాయి.

పందొమ్మిదో శతాబ్ది ప్రారంభంలో మన సాంప్రదాయ సాహిత్యం ఇంకా ప్యూడల్‌ దర్బారులోనే ఉంది. అష్టావధానాలు, శతావధానాలు, పద్య వైభోగాలతో పండితులకే పరిమితమైంది. కందుకూరు వీరేశలింగం కలం పట్టుకొని, సంఘ సంస్కరణకు అంకితం చేసినప్పట్నుంచీ తెలుగు సాహిత్యం ఆధునికత్వాన్ని సంతరించుకొంది. ఆయన నవల, నాటకం, ప్రహసనం, చరిత్ర, వ్యక్తుల చరిత్ర, పత్రికారచన .. ఒకటేమిటి అన్ని రకాల ప్రక్రియల్లోనూ ఆద్యుడై కొత్త ఒరవడి సృష్టించారు. ప్రహసనాల్లోనూ, నాటకాల్లోనూ పాత్రోచిత భాషను వాడి ఛాందసులు వేసిన సంకెళ్ళను తెంచిపారేశారు.

ఈ కృషికి కొనసాగింపు మహాకవి గురజాడ అప్పారావు నుంచి మరింత విస్తారమైంది. విజయనగరం సంస్థానంలో కొలువు చేస్తున్నా, ఆయన ఫ్యూడల్‌ పరిధినుంచి బయటపడి, ప్రజాపక్షంగా, ప్రజాస్వామికంగా రచనలు వెలువరించారు. సమాజానికి సిగ్గుచేటైన 'దురాగతాలను బహిర్గతం చేస్తూ ఉన్నత నైతిక భావాలను వ్యాప్తి చేయడంకన్నా మిన్న అయిన లక్ష్యమూ, ప్రయోజనమూ సాహిత్యానికి లేదని' చాలా స్పష్టంగా, గాఢంగా విశ్వసించారు. 'ప్రజల్లో పఠనాసక్తి, అభ్యాసమూ కలిగేవరకూ నాటకరంగం వైపు మన దృష్టి మళ్ళించక తప్పదు' అనుకున్నారు. ఈ ఆలోచనలే ఆయన్ని కన్యాశుల్క నాటక రచనకు ప్రోత్సహించాయి. ఆకాలంలో వీరేశలింగం గారి బ్రాహ్మవివాహం (పెద్దయ్య గారి పెళ్ళి పుస్తకం), వ్యవహార ధర్మబోధిని (ప్లీడరు నాటకం), గురజాడవారి కన్యాశుల్కం తప్ప మిగతావన్నీ పౌరాణికాలే! కొన్ని చారిత్రక నాటకాలున్నా అవి సనాతన నాటకాల బాణీలోనే ఉండేవి. చుట్టూ ఉన్న అంశాల గురించి ప్రస్తావించిన కందుకూరి, గురజాడ నాటకాలు సమాజంలో ఎంతో చైతన్యాన్ని కలిగించాయి.

నాటకాల్లో కాకపోయినా తొలి తరం తెలుగు నవలల్లో సమకాలిక సమాజాన్ని చిత్రించాలనే కోరిక మన రచయితలకు కలిగింది. న్యాయపతి సుబ్బారావు 1891లో చింతామణి అనే పత్రిక నడుపుతూ, నవలల పోటీ నిర్వహించారు. 1893 నుంచి ఈ పోటీల కోసం ఎందరో నవలలు రాశారు. వారందరికీ వీరేశలింగం గారి 'రాజశేఖర చరిత్ర' నవలే మార్గదర్శకం. చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి 'రామచంద్ర విజయం' ఒక ఏడాది పోటీలో నెగ్గింది. చిలకమర్తి 1884లో చెన్న పట్టణంలో జరిగిన కాంగ్రెసు సభలకు వెళ్ళారు. సురేంద్రనాథ బెనర్జీ, మదన్మోహన్‌ మాలవ్యా ఉపన్యాసాలు విని ఉత్తేజితులయ్యారు. ఈ సభలకు గురజాడ కూడా వెళ్ళారు. వాటిమీద ఆయన ఘాటుగా ఆంగ్లంలో రాశారు. అప్పటికింకా గురజాడ తెలుగు కవితలను ప్రారంభించలేదు. చిలకమర్తి మాత్రం కవితలల్లసాగారు. అప్పుడు కాంగ్రెసు వారిలో దేశభక్తితో బాటు రాజభక్తి కూడా ఉండేది. చిలకమర్తి వారు ఆంగ్లేయ దొరతనాన్ని సీసపద్య పాదాలతో మెచ్చుకొని 'ఇట్టి యాంగ్లేయ దొరతనం బేలుగాక ధర్మమతితోడ నాచంద్ర తారకంబు' అని దేశీయులకు ప్రబోధం చేశారు. తరువాతి కాలంలో 1895లోనే శ్రామిక జన పక్షపాతంతో దేశ పరిస్థితులను చిత్రించారు. చిలకమర్తిని మన ప్రథమ జాతీయ కవి అనొచ్చు.

1905లో బెంగాల్‌ విభజన పెద్ద చర్చకు దారి తీసింది. బిపిన్‌ చంద్రపాల్‌ ఆంధ్రదేశంలోని పలు నగరాల్లో రోజుల తరబడి వన్యాసాలిచ్చి ప్రజలను ఉత్తేజితులను చేశారు. రాజమండ్రిలో ఆయన వన్యాసమిస్తున్నప్పుడు చిలకమర్తి వారే అనువాదకులు. సభ ముగిసేటప్పుడు చిలకమర్తి వారు ఆశువుగా ...'భరత ఖండంబు చక్కని పాడియావు/ హిందువులు లేగదూడలై యేడ్చుచుండ/ తెల్లవారను గడుసరి గొల్లవారు/ పితుకుచున్నారు మూతులు బిగియగట్టి'' అని పద్యం చదివారు. ఇది గొప్ప సంచలనాన్నీ, సంతోష పారవశ్యాన్నీ కలిగించింది. అన్ని పత్రికలూ ప్రచురించాయి.
 

నాటక వికాసం .. చైతన్య ప్రకాశం
తిరుపతి వెంకటకవుల ఉద్యోగ విజయాలు, చిలకమర్తి కవి గయోపాఖ్యానం ఈ కాలంలోనే వెలువడ్డాయి. విజయనగర సంస్థానం పెద్ద దావాలో తలమునకలైన గురజాడ వారికి 1908 నాటికి కొంచెం వెసులుబాటు చిక్కింది. 1892లో రాసి ప్రదర్శించి 1897లో మొదటిసారి ప్రచురించిన కన్యాశుల్కాన్ని ఆయన పెంచి, తిరగరాసి మధురవాణి పాత్రను వసంతసేనను తలదన్నేటట్లు చిత్రించారు. 1909లో ప్రచురించారు. తెలుగు కవిత్వాన్ని ఆధునికం చేయడానికి పాత ఛందస్సులు పనికిరావని గురజాడ తెలుసుకొని కొత్త ఛందస్సుకోసం కృషి ప్రారంభించారు. 'గుత్తునా ముత్యాల సరములు/ కూర్చుకుని తేటైన మాటల/ క్రొత్త పాతల మేలు కలయిక క్రొం మెరుంగులు జిమ్మగా' అంటూ కొత్త స్వరం వినిపించారు.
 

'దేశభక్తి'కి అసలు నిర్వచనం
ప్రజల్లో ప్రదీప్తమౌతున్న దేశాభిమానానికి ఒక నిర్వచనం ఇవ్వాలని గురజాడ నిశ్చయించుకొని 'దేశభక్తి' గేయం రాశారు. ఇది తెలుగు వాళ్ళ జాతీయగీతం. మన దేశాభివృద్ధికి మానిఫెస్టో. దేశమంటే మట్టికాదు మనుష్యులని మొట్టమొదటిసారిగా గురజాడ హెచ్చరిక చేశారు. ''తిండి కలిగితే కండకలదోరు/ కండగలవాడేను మనిషోరు!/ దేశమనియెడి దొడ్డ వృక్షం/ ప్రేమయను పూలెత్తవలెనోరు/ నరుల చెమటల తడిసి మూలం/ ధనం పంటలు పండవలెనోరు'' అన్నాడు. శ్రమశక్తి ప్రాధాన్యాన్ని ఎలుగెత్తి చాటాడు.

గురజాడ వారి సాహిత్య రథానికి రెండు చక్రాలున్నాయి. ఒకటి సంఘ సంస్కరణ. రెండోది వాడుక భాష. గిడుగు రామమూర్తి, ఆయనా ఒకరికొకరు చేదోడు వాదోడు అయ్యారు. తెలుగు వ్యావహారిక భాషకు వెలుగు తారలు అయ్యారు. 'నాది ప్రజల ఉద్యమం. దానిని ఎవరిని సంతోషపెట్టడానికైనా వదులుకోలేను' అని గురజాడ 1911 మార్చి 27వ తేదీన తన డైరీలో రాసుకొన్నారు.

గురజాడ ఆధునిక కవిత్వానికి శ్రీకారం చుడుతున్నప్పుడు, అదే కాలంలో రాయప్రోలు సుబ్బారావు భావ కవిత్వాన్ని ప్రారంభించారు. అమలిన శంగారం అనే కొత్త ఆదర్శాన్ని ప్రచారం చేశారు. తరువాతి కాలంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి భావకవిత్వానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వర్థిల్లారు. శ్రీశ్రీ వంటి యువకులు ప్రారంభంలో ఆ ప్రవాహంలో మునిగితేలారు కూడా! 1908లో బంబాయిలో ప్రారంభించిన ఆంధ్రపత్రికను కాశీనాథుని నాగేశ్వరరావు మద్రాసుకు మార్చారు. ఆంధ్రపత్రిక సారస్వతానుబంధం వల్ల చాలా మేలు జరిగింది. ఆ పత్రికతో వాడుకభాషను ప్రవేశపెట్టమని గురజాడ ఎంతో వాదించారు. ఆంధ్రప్రతిక వ్యావహారిక భాషలోకి మారడానికి దశాబ్దాలు పట్టింది.

1913లో బాపట్లలో ప్రథమాంధ్ర మహాసభ జరిగింది. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం ప్రారంభమైంది. కవులు తమ కర్తవ్యాన్ని గుర్తించారు. రాయప్రోలు సుబ్బారావు 'ఆంధ్రావళి' ప్రబోధాన్ని మొదలు పెట్టారు. ఆంధ్ర పౌరుషాన్ని వేనోళ్ళ చాటారు. స్వాతంత్య్ర సమరం పక్కన 'ఆంధ్రోద్యమం' కూడా సాగింది. ఆధునికాంధ్ర సాహిత్యానికి కొత్త ఒరవడి దిద్దిన గురజాడ 1915లో మరణించారు. ఆయన కొంత కాలమే జీవించి, కొన్ని ఏళ్లే సాహిత్య సృజనకు వెచ్చించినా ఆ కృషి చాలా గొప్పది, తరువాతి వారికి అన్ని విధాలా ఆదర్శనీయమైనది. తొలితరంలో బసవరాజు అప్పారావు, చింతా దీక్షితులు గురజాడకు వారసులుగా తమ కృషి కొనసాగించారు. మతం పట్ల వైఖరులు మారడం మొదలుపెట్టాయి. దేశంలో బ్రహ్మ సమాజం బలం పుంజుకొంది. చలం, కృష్ణశాస్త్రి వంటి వారు చురుకుగా పనిచేశారు. యజ్ఞోపవీత ధారణ, విగ్రహారాధనం మొదలైన వాటి పట్ల విముఖత్వం పెరిగింది. 'శిధిలాలయమ్ములో శివుడు లేడోయి' అని పాడేరు. గుడిలో ఉండేది పూజారే గాని పూజ్యుడైన దేముడు కాడని ఎలుగెత్తి చెప్పారు.
 

భావకవితా ధోరణి
1919లో తల్లావఝుల శివ శంకర శాస్త్రి 'సాహితీ సమితి'ని స్థాపించారు. యువ రచయితలను ఒక వేదిక మీదకు తీసుకువచ్చారు. పిఠాపురంలోని దేవులపల్లి కృష్ణశాస్త్రి, నూజివీడులోని నండూరి సుబ్బారావు, తెనాలిలో వఝ బాబూరావు, వీరరాఘవ స్వామి, గుంటూరులో నోరి నరసింహశాస్త్రి, బెజవాడలో కొడాలి ఆంజనేయులు, బందరులో విశ్వనాధ సత్యనారాయణ, అడివి బాపిరాజు మొదలైనవారంతా దేశమంతా తిరిగి నూతన కవిత్వాన్ని ప్రచారం చేశారు. ఆనాడు దేశంలోనూ, రాష్ట్రంలోనూ, సంఘంలోనూ లేని స్వేచ్ఛను వీరు ఆశిస్తారు. వీరి నివాసం తొలుత గాంధర్వ లోకమట. 'లోకముతో మనకేటికి? లోలాక్షి పద పోదము' అని పలాయనులవుతారు. 'దిగిరాను దిగిరాను దివినుండి భువికి' అని కచ్చితంగా చెప్తారు. శ్రీశ్రీ విజృంభించే దాకా ఈ ధోరణి తెలుగు నాట కొనసాగింది.
 

జలియన్‌ వాలా బాగ్‌ ప్రభావంతో ...
1910 ఏప్రిల్‌ 13న పంజాబ్లో జలియన్‌ వాలా బాగ్‌ ఊచకోత జరిగింది. దేశం అట్టుడికిపోయింది. తెలుగు కవులు గళం విప్పి పాటలు పాడారు. గరిమెళ్ల సత్యనారాయణ 'మా కొద్దీ తెల్లదొరతనం' అని స్పష్టం చేసి దేశంలోని దుర్భర పరిస్థితులను వర్ణించి, వాటిని తొలగించుకొనడానికి స్వాతంత్య్ర ఉద్యమంలో కలవమన్నారు. ప్రచార కవిత్వాన్ని ప్రజల కవిత్వంగా రూపొందించారు.
స్వాతంత్య్రోత్సాహంలో శ్రవ్యకావ్యాలే కాక దృశ్యకావ్యాలు కూడా అవసరమయ్యాయి. రామరాజు పుండరీకాక్షుడి గారి పాంచాలీ పరాభవం, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారి తిలకు మహారాజు నాటకం, గాంధీ విజయధ్వజ నాటకం వంటివి వెలువడ్డాయి. సంఘ సంస్కరణకు నాటకాలను మళ్ళీ ఉపయోగించడం ప్రారంభమైంది. కాళ్ళకూరి నారాయణ రావు రచించిన చింతామణి (వేశ్యవృత్తి గర్హణ), వరవిక్రయం (కట్నం సమస్య), మధుసేవ (మధుపాన వ్యసనం) వంటి నాటకాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి.
 

సాహిత్యంలో సామ్యవాద భావనలు
విదేశాల్లో చదివి, విశాల భావాలు ఏర్పరుచుకున్న ఉన్నవ లక్ష్మీనారాయణ గాంధీ ప్రభావంలో వున్నా సోషలిస్టు ఉద్యమాలను ఊహించారు. సామ్యవాద గ్రంథాలను అధ్యయనం చేశారు. మాలపల్లి నవల రాసి, తక్కెళ్ళ జగ్గడు పాత్ర ద్వారా సమధర్మాన్ని ప్రబోధించారు. తెలుగులో ఆయనే సామ్యవాద సాహిత్య పితామహులయ్యారు. స్వరాజ్య సోది, బుడబుక్కల జోస్యము వంటి ప్రజాకళల ద్వారా ఆనాడే ఆయన ప్రచార సాహిత్యాన్ని ప్రారంభించారు. రష్యాలో విజయవంతమైన విప్లవ ప్రభావం ఉన్నవ వారి మీద ప్రగాఢంగా ఉంది.

రైతుల వెతల గురించి సాహిత్యంలో ప్రవేశపెట్టినది ఉన్నవతో పాటు కవికోకిల దువ్వూరి రామిరెడ్డి. రామిరెడ్డి రచించిన 'కృషీవలుడు' కావ్యం చిన్నదే అయినా ఎంతో ప్రభావం చూపించింది. రైతులాగే కూలీ కూడా ముఖ్య శ్రామికుడు. కూలీల గురించి విపులంగా రాసిన కవి కవికొండల వెంకటరావు. కష్టజీవుల గురించి గేయాలు రాశారు. కూలీలను 'కూలి అన్నలు' అని తొలిసారిగా బాంధవ్యం కలుపుకున్నారు.

1928 నాటికి సోషలిస్టు, కమ్యూనిస్టు సిద్ధాంత గ్రంథాలు తెలుగుదేశంలోకి రహస్యంగా రావడం మొదలైంది. పందిరి మల్లికార్జునరావు హిందీ క్లాసులు నడుపుతూ చాటుగా స్టాలిన్‌ రాసిన 'లెనినిజం', ట్రాట్స్కీ రాసిన 'రష్యా విప్లవ చరిత్ర' మొదలైనవి తాను చదివి, ఇతరుల చేత చదివించేవారు. పుచ్చలపల్లి సుందరయ్య 'కమ్యూనిస్టు ప్రణాళిక', 'కూలి- పెట్టుబడి' వంటి గ్రంథాలు చదివి మదరాసులో 'సోదర సమితి' అనే సంఘాన్ని స్థాపించి సోషలిస్టు భావం ప్రచారం చేశారు. ఇలా ఎందరో యువకులు కాంగ్రెసు నడుపుతున్న శాసనోల్లంఘనోద్యమంలో వుంటూనే సామ్యవాదులుగా మారుతూ వచ్చారు.
 

కమ్యూనిస్టు పార్టీ స్థాపన
1930లో ఆర్థిక సంక్షోభం వచ్చింది. యూరప్‌ ఫాసిస్టులు బలపడుతూ వచ్చారు. పెట్టుబడులు సన్నగిల్లాయి. నిరుద్యోగం పెచ్చు పెరిగింది. వీటన్నిటికీ సోషలిజం వల్లనే పరిష్కారం సాధ్యమని ప్రగతిశీలురు గాఢంగా విశ్వసించారు. 1934లో కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ ఏర్పడింది. సామ్యవాద భావాలు గల స్వాతంత్య్ర యోధులందరూ దానిలో చేరారు. ఆ పార్టీలో ఉంటూనే కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించడానికి సుందరయ్య కృషి ప్రారంభించారు. కమ్యూనిస్టు భావ జాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటానికి సాహిత్య, సాంస్క ృతిక రంగాల్లో ప్రత్యేక కృషి ఉండాలని ఆయన భావించారు. యూజీన్‌ పొట్టయర్‌ రచించిన అంతర్జాతీయ గీతాన్ని సుందరయ్య గారే అప్పుడు కాకినాడలో చదువుకొంటున్న బాలాంత్రపు నళినీ కాంతారావు గారికి వినిపించి, తెలుగులోకి అనువదించమన్నారు. ఇప్పుడు మనం పాడుకుంటున్న అంతర్జాతీయ శ్రామిక గీతం 'ఆకలి మంటలు మలమలమాడే అనాథలందరు లేవండోరు' అన్న గీతం అలా రూపుదిద్దుకొంది. అప్పుడే పెండ్యాల లోకనాధం 'కూలీలందరు యేకమైతే కూటికీ తరుగేమిరా', తుమ్మల వెంకట్రామయ్య 'ఎగరాలి ఎగరాలి మన ఎర్రజెండా.. కూలోళ్ళ గొంతులో కొనవూపిరుంటే పేదరైతు మేన వేడి రక్తంబుంటే' గేయాలు వెలువడ్డాయి. ఇవన్నీ తెలుగు నాట విస్తృత ప్రచారం పొందాయి.
 

ఆంధ్ర యూనివర్శిటీలో ...
ఉద్యమంలో వున్నవాళ్ళు ఇలా పాటలు కట్టుకుంటూ వుంటే విద్యాధికులు కమ్యూనిస్టు సాహిత్యాన్ని అధ్యయనం చేస్తున్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ ఇంగ్లండు నుంచి వచ్చేటప్పుడు తమ వెంట కమ్యూనిస్టు సాహిత్యాన్ని తీసుకువచ్చి ఆంధ్ర విశ్వవిద్యాలయం గ్రంథాలయంలో పెట్టారు. హిరేన్‌ ముఖర్జీ, అబ్బూరి రామకృష్ణారావు ఆ విశ్వవిద్యాలయంలో ఆచార్యులు. ఈ ఇద్దరూ ఎన్నో కమ్యూనిస్టు గ్రంథాలను తెప్పించి విద్యార్థులకు అందుబాట్లో ఉంచారు. ఎందరో వీటిని చదివి ప్రభావితులయ్యారు.

1934లోనే ఆచార్య రంగా కాంగ్రెసువాదిగా, రైతు నాయకునిగా, వామపక్షీయునిగా ఉంటూ గుంటూరు జిల్లా నిడుబ్రోలులో రైతాంగ విద్యాలయాన్ని స్థాపించారు. వివిధ కవులు రాసిన శ్రామిక గీతాలను 'రైతు భజనావళి' పేరుతో సంకలనం చేసి 1934లో ప్రచురించారు. ఉపోద్ఘాతంలో 'ప్రపంచ మందొకచోట రైతులు రాజ్యానికి వచ్చినారు. కూలీలు పెత్తనం చేస్తున్నారు. ప్రజా సామాన్యమునకు పరువు ప్రతిష్ఠ లచ్చట లభ్యమగుచున్నవి. ఆంధ్రప్రజలు కూడ అలాంటి స్వరాజ్యమునే కాంక్షించుచున్నారు.'' అని పేర్కొన్నారు.
 

అభ్యుదయ పత్రికల సేవ
అభ్యుదయ వాదులు ఎన్నో పత్రికలు స్థాపించి నడిపారు. ముద్దు కృష్ణ జ్వాల, గద్దె లింగయ్య ప్రభ, కాంగ్రెసు సోషలిస్టు పార్టీ పత్రిక 'నవశక్తి' రచయితలకు నూతనోత్సాహాన్ని కలిగించాయి. 'రుధిర జ్యోతిని వెలగింపుమురా విప్లవ గీతిని వినిపించుమురా' అని శ్రీరంగం నారాయణ బాబు రాశారు. 1936లో సెప్టెంబరులో రాజమండ్రిలో జరిగిన కాంగ్రెసు సోషలిస్టు పార్టీ సభల్లో విశాఖ జిల్లా నుంచి ఏకైక ప్రతినిధిగా ఆయన హాజరయ్యాడు. శ్రీశ్రీ సోషలిస్టు ఉద్యమ ప్రభావంతో తన గమ్యం తెలుసుకొన్నాడు. మహాప్రస్థానం గేయాన్ని రాసి 'ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులను చావమని, నెత్తురుమండే శక్తులు నిండే సైనికులను రా రమ్మని పిలిచి, పదండి ముందుకు' అని ప్రబోధించాడు.

1934 జులైలోనే తుమ్మల వెంకట్రామయ్య గోర్కీ నవల 'అమ్మ' సంక్షిప్తానువాదాన్ని 'మాతృహృదయం' పేరుతో రాశారు. పూర్తి నవలను క్రొవ్విడి లింగరాజు అనువదించారు. వీటిని ఆదర్శ గ్రంథమండలి 1934 డిసెంబరులో ప్రచురించింది. ఆ తరువాతి ఏడాది జులైలో వాటిని ప్రభుత్వం నిషేధించింది. అయితే ఈ నవల ప్రతులను రహస్యంగా చదివి ఎందరో ఉత్తేజితులయ్యారు. ఉద్యమానికి వచ్చారు.

1935లో ఉన్నత విద్య కోసం ఇంగ్లండులో ఉన్న భారతీయ యువకులు అక్కడే ఇండియన్‌ ప్రోగ్రసివ్‌ రైటర్స్‌ సంఘాన్ని స్థాపించి, సామ్యవాద సాహిత్యాన్ని తమ అజెండాగా చేసుకున్నారు. 1936 ఏప్రిల్‌లో ప్రేమ్‌చంద్‌ అధ్యక్షతన లక్నోలో ఇండియన్‌ ప్రోగ్రసివ్‌ రైటర్స్‌ సభలు జరిగాయి. దానిలో పాల్గన్న అబ్బూరి రామకృష్ణరావు తిరిగివచ్చి విశాఖపట్నంలో ఆంధ్రవర్థమాన లేఖక సంఘాన్ని స్థాపించారు. అబ్బూరి వారి ద్వారా ప్రోగ్రసివ్‌ రైటర్స్‌ ప్రణాళిక శ్రీశ్రీకి లభించింది. అది తనను మార్క్సిస్టు లైన్లో పడవేసిందని శ్రీశ్రీ చెప్పారు. ప్రతిజ్ఞ, దేశచరిత్రలు గీతాలు మానిఫెస్టోకు ఆచరణాత్మక కవితాత్మక ధ్వనులుగా వినిపిస్తాయి. ఇలా స్వాతంత్య్రోమం సాగుతున్న కాలంలోనే తెలుగు సాహిత్యం ఉద్యమానికి దోహదపడుతూ ... తానూ సాంప్రదాయ ధ్వని నుంచి అభ్యుదయ ఆకాంక్ష దాకా క్రమ వికాసం చెందింది.
- సాహితి