Aug 05,2022 20:29

వడ్డీ రేటు మరో 50 బేసిస్‌ పాయింట్ల పెంపు
అంచనా కంటే ఎక్కువే వడ్డింపు
బిబిపిఎస్‌తో ఎన్‌ఆర్‌ఐల బిల్లుల చెల్లింపులు
ఆర్‌బిఐ ఎంపిసి భేటీ నిర్ణయాలు
ముంబయి : 
రుణ గ్రహీతలపై మరింత భారం పడనుంది.  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) రెపో రేటును 50 బేసిస్‌ పాయింట్లు పెంచి 5.40 శాతానికి చేర్చింది. ఈ దఫా 30 బేసిస్‌ పాయింట్లు పెంచొచ్చని నిపుణులు అంచనా వేయగా.. ఆర్‌బిఐ అంతకంటే ఎక్కువగానే వడ్డించింది. ఇప్పటికే గడిచిన మేలో 40 బేసిస్‌ పాయింట్లు, జూన్‌లో మరో 50 బేసిస్‌ పాయింట్లు పెంచింది. ఈ రేట్లను బ్యాంక్‌లు ఇప్పటికే అమలు చేస్తున్నాయి. తాజా పెంపునతో 140 బేసిస్‌ పాయింట్లు పెంచినట్లయ్యింది. దీంతో గృహ, వాహన, రిటైల్‌ తదితర రుణాల వాయిదా చెల్లింపులు భారం కానున్నాయి. ఇప్పటికే అధిక ధరలతో కుటుంబాలను నెట్టుకొస్తున్న వారిని హెచ్చు వడ్డీ రేట్లు మరింత ఒత్తిడికి గురి చేసే అవకాశం ఉంది. మూడు రోజుల పాటు ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అధ్యక్షతన జరిగిన మానిటరింగ్‌ పాలసీ కమిటీ (ఎంపిసి) సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి.  ఈ సందర్బంగా దాస్‌ మీడియాతో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు వడ్డీ రేట్లను పెంచాల్సి వస్తుందన్నారు. అదే విధంగా వృద్థి మద్దతు పైనా దృష్టి కేంద్రీకరిస్తున్నామన్నారు. 50 బేసిస్‌ పాయింట్ల వడ్డీ పెంపునకు ఎంపిసి సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారన్నారు.

''ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీ (సిపిఐ) 6.7 శాతంగా ఉండొచ్చు. 2023-24 తొలి త్రైమాసికంలో 5 శాతానికి దిగిరావొచ్చు. బ్యారెల్‌ చమురు ధర 105 డాలర్లుగా పలకొచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిడిపి యథాతథంగా 7.2 శాతంగా నమోదు కావొచ్చు. వచ్చే 2023-24లో ఇది 6.7 శాతంగా చోటు చేసుకోవచ్చు. ఇటీవలి వడ్డీ రేట్ల పెంపునతో గడిచిన ఏప్రిల్‌-మేలో బ్యాంకింగ్‌ వ్యవస్థలోని అదనపు ద్రవ్య లభ్యత రూ.6.7 లక్షల కోట్ల నుంచి రూ.3.8 లక్షల కోట్లకు తగ్గింది. 2022-23లో బ్యాంక్‌ల రుణాల వృద్థి 14 శాతానికి పెరుగొచ్చు. గతేడాది ఇది 5.5 శాతంగా నమోదయ్యింది.'' అని శక్తికాంత దాస్‌ తెలిపారు.

దేశంలోని విద్యుత్‌, నీటి బిల్లులు ,ఇతర యుటిలిటీ బిల్లులను నేరుగా భారత్‌ బిల్లు చెల్లింపు వ్యవస్థ (బిబిపిఎస్‌) ద్వారా చెల్లించడానికి ప్రవాస భారతీయులకు (ఎన్‌ఆర్‌ఐ) అనుమతినిచ్చేందుకు ఆర్‌బిఐ ప్రతిపాదించిందని దాస్‌ తెలిపారు. దీంతో క్రాస్‌ బోర్డర్‌ ఇన్‌వర్డ్‌ పేమెంట్‌ల ఆమోదానికి వీలు కలగనుందన్నారు. తద్వారా దేశంలో నివసిస్తున్న వారికి మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సేవ ఇకపై ఎన్‌ఆర్‌ఐలకు లభించనుంది. రానున్న రోజుల్లో వంట నూనెల ధరలు తగ్గొచ్చని దాస్‌ పేర్కొన్నారు. అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తల వల్ల ప్రపంచ వృద్థి మందగించడంతో ఆ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపైన పడొచ్చన్నారు.