Jun 26,2022 15:08

న్యూఢిల్లీ :  దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన మూడు లోక్‌సభ స్థానాల ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపుర్‌, ఆజంగఢ్‌ లోక్‌సభ స్థానాల్లో బిజెపి, సమాజ్‌వాదీ పార్టీల మధ్య హోరాహోరీ కొనసాగుతోంది. ప్రతి రౌండుకి ఇరు పార్టీల అభ్యర్థుల మధ్య రెండు, మూడు వేల తేడా ఉండడంతో రెండు స్థానాల్లో ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. 2019లో ఈ రెండు స్థానాలు సమాజ్‌వాదీ పార్టీ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం రెండు చోట్లా బిజెపి ముందజలో కొనసాగుతోంది. అలాగే పంజాబ్‌లోని సంగ్రూర్‌ లోక్‌సభ స్థానంలో ఆమ్‌ఆద్మీ పార్టీ ఆభ్యర్థి 10వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అంతకుముందు ఈ స్థానం నుంచి గెలుపొందిన ఆప్‌ నేత భగవంత్‌ మాన్‌ ఇటీవల పంజాబ్‌ ముఖ్యమంత్రిగా నియమితులవడంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.

త్రిపురలో నాలుగు, ఝార్ఖండ్‌, న్యూఢిల్లీలో ఒక్కో అసెంబ్లీ స్థానం చొప్పున మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలకు కూడా ఇటీవల ఉప ఎన్నిక జరిగింది. ఈ స్థానాల కౌంటింగ్‌ కూడా కొనసాగుతోంది. త్రిపురలోని టౌన్‌ బార్డోవాలీ, జుబరాజ్‌నగర్‌, సుర్మా స్థానాల్లో బిజెపి విజయం సాధించింది. బిజెపి సిట్టింగ్‌ స్థానమైన అగర్తలాలో మాత్రం కాంగ్రెస్‌ అభ్యర్థి సుదీప్‌ రాయ్  బర్మాన్‌ 3వేల ఓట్లతో గెలుపొందారు. ఝార్ఖండ్‌లోని మందార్‌ నియోజకవర్గ ఫలితాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి శిల్పి నేహా టిర్కీ ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ఢిల్లీలోని రాజీందర్‌ నగర్‌ స్థానంలో ఆప్‌ అభ్యర్థి దుర్గేశ్‌ పథక్‌ ముందంజలో ఉన్నారు.