Aug 08,2022 08:46

ఆ భవనాన్ని సమీపించే కొద్దీ ఓ వింతైన అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే అదో పావురాల ప్రపంచం. మూడంతస్తుల ఆ మేడలో ప్రతి అంతస్తులోనూ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన అరలు.. వాటిల్లో వందల రకాల పావురాళ్లు సందడి చేస్తుంటాయి. ఆ శబ్దం విన్నా, వాటిని చూస్తున్నా మనుసుకు ప్రశాంతత కలుగుతుంది. బాల్యంలో సరదాగా పెెంచిన పావురాళ్లపై అపారమైన ప్రేమను పెంచుకున్నారు చలువాది శ్రీనివాసరావు. వాటి కోసం ఏకంగా ముడంతస్తుల ఇల్లు కట్టించారు. ఏళ్ల తరబడి నుంచి లక్షలు ఖర్చు పెట్టి వాటికి పోషణ, వైద్యం అందిస్తున్నారు. విదేశాల నుంచి వందల రకాల పావురాళ్లను కొనుగోలు చేసి, వాటి ఆనందం కోసం సంగీతం వినేలా సౌకర్యం కల్పించి పావురాళ్ల ప్రేమికుడు అయ్యారు. కృష్ణా జిల్లా మానికొండ ప్రాంతానికి చెందిన చలువాది శ్రీనివాసరావుకు బాల్యం నుంచి పావురాళ్ల అంటే ఇష్టం. ఐదేళ్ల వయసులో ఆడుకునేందుకు స్నేహితుని ఇంటికి వెళ్లాడు. అక్కడ పావురాళ్లను చూస్తూ చాలా సమయం గడిపేవాడు. వాటి పట్ల ఆసక్తి పెంచుకున్న తను రెండు, మూడు పావురాళ్లు తెచ్చి పెంచడం ప్రారంభించాడు. ఆయన తల్లిదండ్రులు కూడా వాటిని శ్రద్ధగా చూడటంతో వాటి కోసం చెక్క పెట్టెలు, ఇనుప సువ్వల గూళ్లు తయారీ చేసి ఉంచారు. స్కూలుకు వెళ్లి వచ్చి వాటితో సమయం గడపడం శ్రీనివాసరావుకు ఎంతో ఇష్టం. మనుసుకు ఆహ్లాదంగా అనిపించేది. పావురాళ్లు గుడ్లు పెడుతున్న దశలో శ్రీనివాసరావు వాటిని ఎంతో శ్రద్ధగా చూసుకునేవారు. అవి పెరిగి పెద్దవి కావడంతో వందల సంఖ్యలో పావురాళ్లు ఉన్నాయి. వాటిని కొత్తగా నిర్మించుకున్న తన ఇంటి బిల్డింగ్‌ కింది భాగం మొత్తం పావురాళ్ల గూళ్లకు కేటాయించేవారు. చదువుకుంటూ, ఉద్యోగం చేస్తూనే ప్రతిరోజూ గింజలు, మంచినీళ్లు పెట్టి, వాటి సంరక్షణ బాధ్యతలు చూసుకుంటూ ఉండసాగారు.
 

                                                                             కట్టుదిట్టంగా భవనం

ప్రేమకు ప్రతిరూపంగా నిలిచే ఈ పావురాళ్లలో చాలా రకాల జాతులు ఉన్నాయి. శ్రీనివాసరావు పెంచే పావురాళ్లతో పాటు ఎగరనవి కూడా ఉన్నాయని తెలుసుకుని వాటిని విదేశాల నుంచి తెప్పించడం ప్రారంభించారు. వాటి కోసం ఏకంగా ఇల్లు నిర్మించాలని అనుకున్నారు. ఆయన అభిరుచిని ఇంట్లో వాళ్లు కూడా అర్థం చేసుకుని మద్దతు ఇచ్చారు. దాంతో ఎనిమిదేళ్ల క్రితం కంకిపాడు నుంచి గుడివాడ వెళ్లే మార్గంలో మానికొండ వెంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలో పచ్చని పొలాల మధ్య మూడంతస్తుల భవనం నిర్మించారు. అందులోకి పిల్లి, డేగలు ప్రవేశించ వీలు లేకుండా ఎక్కడికక్కడ ఇనుప జల్లెడతో కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశారు. దోమలు కూడా దూరకుండా మెష్‌ సైతం ఏర్పాటు చేశారు. ప్రతి గదిలో ఫ్యాన్లు, లైట్లు ఉంటాయి. రాగులు, జొన్నలు, నూకలతో 20 రకాల గింజలతో పావురాలకు వేళకు ఆహారం అందిస్తున్నారు. వాటికి సుస్తీ చేస్తే మందులు వంటి ప్రత్యేక ఏర్పాట్లన్నీ ఉంచారు. వాటి కోసం మ్యూజిక్‌ సిస్టం ఏర్పాటు చేసి ప్రతి ఉదయం పక్షులకు ఆహ్లాదకరమైన సంగీతం వినిపిస్తున్నారు.
 

                                                                              అరుదైన జాతులు

పావురాలకు మాత్రమే నిర్మించిన ఈ నిలయంలో అనేక జాతులకు చెందిన 1,150కి పైగా పావురాలు కనువిందు చేస్తాయి. దేశంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించే పావురాలతో పాటు యూరప్‌, అమెరికా, సింగపూర్‌, దుబారు, బంగ్లాదేశ్‌, బెల్జియం, చైనా, జర్మనీ తదితర దేశాలకు చెందిన వందకుపైగా అరుదైన జాతులను అనేక వ్యయ ప్రయాసలకోర్చి సేకరించారు శ్రీనివాసరావు. రూ.5 వేల నుంచి రూ.85 వేలు విలువ చేసే అరుదైన పావురాలను కొనుగోలు చేసి మరీ పెంచుతున్నారు. జెయింట్‌ హంగేరియన్‌, అమెరికన్‌ పాంకెయిన్స్‌, జాకోబిన్స్‌, షీల్డ్‌, వార్‌లెస్‌ హ్యుమర్స్‌, ఓరియంటల్‌ ఫెరల్‌, యూరోపియన్‌ లాహౌర్‌, అమెరికన్‌ నన్స్‌, మాల్టీస్‌, సాండీల్‌ ముకీస్‌, చైనీస్‌ ఓవెల్స్‌, పెంచ్‌ మొడెనా, కింగ్స్‌, షేక్‌ షెర్లీ, అమెరికన్‌ ఎలిమెంట్స్‌, కాప్చినో, జర్మన్‌ బ్యూటీ హ్యుమర్‌, వాల్‌గట్‌ పౌటర్‌, హెన్నా పౌటర్‌, మూన్‌ మార్క్‌ పౌటర్‌, బోటెడ్‌ ఎల్మెంట్‌, పెషర్‌ వంటి అనేక జాతులకు చెందిన పావురాలను మనం ఇక్కడ చూడొచ్చు. నెమలి వలే పురి విప్పి ఆడేవి, తల నిండా జూలుతో ఆకర్షణీయంగా ఉండేవి, బూట్లు మాదిరిగా కాళ్ల నిండా ఈకలతో విలక్షణమైనవి, రంగు రంగుల రెక్కలు తొడిగినవి.. ఇలా ఇక్కడి విలక్షణమైన పావురాలన్నింటినీ చూసేందుకు మన రెండు కళ్లూ చాలవు. వీటిలో ఎక్కువగా ఎగరలేవు. అందుకే ఇవి బయటకు వెళతాయన్న భయం ఉండదు.
 

                                                                              వ్యక్తిని నియమించి ...

ఏ రెండు పావురాళ్లు జత కట్టినా ఆ రెండే జీవితాంతం కలిసి జీవిస్తాయి. అందుకే శ్రీనివాసరావు దగ్గర ఉండే పావురాళ్లు కూడా జంటలు జంటలుగా అరల్లో కలిసి జీవిస్తాయి. ఎప్పుడైనా జంటలోని ఒక పావురం అనుకోకుండా చనిపోతే మిగిలిన పావురం కూడా బెంగతో కొన్ని రోజులకు చనిపోతుంది. మరికొన్ని ఒంటరిగానే జీవిస్తాయి. ఇన్ని పావురాళ్లను సంరక్షించేందుకు శ్రీనివాసరావు ఓ వ్యక్తిని కాపాలా ఉంచారు. శ్రీనివాసరావు కాంట్రాక్టర్‌. పనుల రీత్యా బయటకు తిరుగుతుంటారు. దాంతో ఆ వ్యక్తి పావురాళ్ల భవనం దగ్గర్లో నివసిస్తూ వాటి బాగోగులు చూసుకుంటున్నారు. అతను ప్రతి రోజూ భవనంలోకి వెళ్లి గింజలు, నీళ్లు పెడతాడు. ప్రతి గూటికి వెళ్లి పావురాళ్లు ఎలా ఉన్నాయోనని చూస్తూ ఉంటారు. కదలకుండా, నీరసంగా ఉన్న వాటికి మందులు ఇవ్వడం చేస్తారు. పావురాళ్లు పెంచుకునే వారికి పావురాళ్ల పిల్లలు, గుడ్లు ఉచితంగా ఇస్తున్నారు. 35 ఏళ్ల నుంచి లక్షలు ఖర్చు పెట్టి పావురాళ్లు పెంచుతున్న శ్రీనివాసరావు నిజంగా పావురాళ్ల ప్రేమికుడు.
                                                                                                                     - పద్మావతి

                                                          సమస్యలు మర్చిపోతా : శ్రీనివాసరావు

నా చిన్నతనం నుంచి పావురాళ్లను పెంచుతున్నా. వాటి మీద ఇష్టంతో అన్ని రకాల జాతులను పెంచుతున్నా. అందుకే ఎవరికీ అమ్మను. వాటితో ఉంటే సమస్యలు అన్నీ మరిచిపోతుంటాను. నేను లేని సమయాల్లో నా భార్య పద్మావతి, కుమార్తె రవళి చాలా శ్రద్ధతో వాటిని సంరక్షిస్తారు. పావురాలతో నాకున్న అనుబంధాన్ని గౌరవించి నా కుటుంబ సభ్యులు సహకారం అందిస్తున్నారు.