Oct 09,2022 12:55

ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణలో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి బి ఫార్మసీ, ఫార్మా-డి, బయోటెక్నాలజీ, ఫార్మా సూటికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్‌ బైపిసి విద్యార్థులకు వచ్చేనెల ఒకటో తేదీ నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌, ఎంసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ నవీన్‌ మిట్టల్‌ శనివారం షెడ్యూల్‌ను విడుదల చేశారు. వచ్చేనెల ఒకటి నుంచి 3 వరకు ఆన్‌లైన్‌లో ప్రాథమిక సమాచారం అందుబాటులో ఉంటుందనీ, ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాలనీ, హెల్ప్‌లైన్‌ సెంటర్లలో ధ్రువపత్రాల పరిశీలనకు వెళ్లేందుకు స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాలని సూచించారు. వచ్చే నెల 3, 4 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని తెలిపారు. అదే నెల 3 నుంచి 6 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశముంటుందని వివరించారు. 9న తొలివిడత కౌన్సెలింగ్‌లో అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. వివరాలకు https://tseamcetb.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు. అలాగే ప్రయివేటు ఇంజినీరింగ్‌, ఫార్మసీ కాలేజీల్లో ఎంసెట్‌ బైపీసీ విద్యార్థుల స్పాట్‌ అడ్మిషన్లకు సంబంధించిన మార్గదర్శకాలను వచ్చేనెల 23న విడుదల చేస్తామని నవీన్‌ మిట్టల్‌ తెలిపారు. ఇతర వివరాల కోసం https://tseamcetb.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.