
కారకాస్ : అవినీతికి వ్యతిరేకంగా పోరాడటంలో తమ ప్రభుత్వం ముందంజలో ఉందని వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. 'అవినీతికి వ్యతిరేకంగా మా ప్రభుత్వం పోరాడటంలో ముందంజలో ఉంది. ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చిన వారైనా, లేక ఇక్కడున్నవారైనా ప్రజల నుండి దోచుకుంటున్న వారిపైనే ఈ పోరాటం. అవినీతి మాఫియా మూలాల్లోకి వెళ్లి కూల్చివేయాలనేదే నా సంకల్పం. అవినీతి కేసులపై వారాల తరబడి దర్యాప్తు కొనసాగుతోంది. ఈ విషయంలో నేను వ్యక్తిగతంగా రిపబ్లిక్ అటార్నీ జనరల్ కార్యాలయం, దాని క్రియాశీల విభాగాల సహకారంతో పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని, అవినీతి విచారణలు వృత్తిపరంగానూ, శాస్త్రీయంగా సమతుల్యమైన మార్గంలోనే జరుగుతున్నాయని, అవినీతిపరులకు కఠినమైన శిక్షలు ఉంటాయి' అనిమదురో అన్నారు. అవినీతిపరుల్ని పట్టుకునే మొదటి దశలో వ్యాపారవేత్తలు, మేనేజర్స్, ప్రభుత్వ సంస్థల ఉన్నతాధికారులు ఉన్నారని.. ఇప్పటికే ఒక కాంగ్రెస్ సభ్యుడు అవినీతి కేసులో పట్టుబడ్డారని మదురో వెల్లడించారు.
'అవినీతిని అంతమొందించే మా సంకల్పంలో మమ్మల్ని ఎవరూ ఆపలేరు. ఈ సమయంలోనే ప్రజలందరూ మరింత ఐక్యంగా ఉండాలని కోరుతున్నాను. అవినీతికి వ్యతిరేకంగా చేస్తున్న ఈ యుద్ధంలో మేము తప్పక గెలుస్తాము. అవినీతి మాఫియాలకు వ్యతిరేకంగా పోరాటం చేసే యోధులు ఉన్నారని, ఈ విషయంలో విశ్వాసం ఉంచాలని' మదురో ప్రజల్ని కోరారు. ఇక ఇప్పటికే అవినీతి ఆరోపణల నేపథ్యంలో వెనిజులా ఆర్థిక, చమురు మంత్రి తారెక్ ఎల్ ఐసామీ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.