Nov 28,2022 07:33

ర్తమానంలో గురజాడను ఓ 'ప్రచారకర్త'గా భావిస్తున్నారు. హేతువాదాన్ని, భాషా స్వరూపాలను, మానవజాతికి ఉండవలసిన ఆకాంక్షల ఉదాత్త రూపాన్ని అక్షరబద్ధం చేసిన గురజాడను సహితం సంప్రదాయ ఛాందసవాద ప్రచారం కోసం వాడుకొంటున్న 'గురజాడ' వర్గీయులను గురజాడ 'గద్దించవలసిన' అవసరం ఉందనిపిస్తున్నది. ''మహాకవులెవరైనా వారు జీవించిన కాలంలో సమాజంలో అనివార్యమైన అసంతృప్తి ఉంటుంది. అసమ్మతి ఉంటుంది. దానిని వారు తమ రాతలతో పట్టుకోజూస్తారు. రూపం కట్ట జూస్తారు. జనం మనసును ఆకట్టుకోజూస్తారు. వారి మస్తిష్కాలను పట్టజూస్తారు. ఆ అసంతృప్తి, సాహిత్యరూపంలో దాని ఆవిష్కరణ విశ్వమానవుడిని చూపించే క్రమానికి ఒక వెలుతురు ఇస్తుంది!'' అనే వివినమూర్తిగా వ్యాఖ్యానం వెనుక గురజాడ వారి 'చూపు' అర్థమవుతుంది. హేతువాదపు దృక్పథాన్ని వ్యవహరిక భాషా పోరాటంతో సమ్మేళన పరచి నాటి (నేటి) సమాజపు తీరు తెన్నులను అక్షరాలకు ఆవేదనద్ది తెలుగు వారికి అందించిన వైనం నేడు ఎంతోమంది 'విస్మరిస్తున్నా'రనేది వాస్తవం. ఆయన నాటి సమాజ 'సమూహాలలో' కొన్ని సంప్రదాయాలు, మతం పేరిట ఆచరమైన దురాచారాల పట్ల తన స్వంత వివేచనతో, ధైర్యంతో ధ్వజమెత్తాడు. ఇవి నేడు లేవని.. ఆయన అడుగుజాడలో నడుస్తున్నామని గట్టిగా విశ్వసించ గలవారేరి? వర్ణవ్యవస్థకు, కుల వ్యవస్థతకు గొప్ప ఆశావహ దృక్పథంతో 'యెల్లలోకములు వొక్కయిలై ్ల/ వర్ణ భేదములెల్ల కలై ్ల' అని నినది స్తూనే 'మతములన్ని మాసిపోవును/ జ్ఞానమొక్కటే నిలిచి వెలుగును' అని ఘనమైన ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించారు. కానీ, ఆ వాతావరణం నేడు నెలకొని ఉందా అనేది సమాధానం దొరకని ప్రశ్న.
          గురజాడ వారిని విశ్లేషించుకొనే సమయంలో సమాజంలో మార్పులకు సాహిత్యం ఓ వారధి. సాహిత్యంలో కూడా మార్పులకు పామర భాష వలన సాధ్యం. వ్యవహారిక భాషలో ఆయన సృజియించిన రచనలలో ఈ అంశాలు కనిపిస్తాయి. సమాజం, సాహిత్యం, రచయితలలో సహితం నిబద్ధత, సాటి మనుషులపట్ల సౌహార్ధ్రపూరిత సానుభూతి కూడా అవసరమంటాయి ఆయన రచనలు. మరి నేటి రచయితలు, సాహిత్యం వీటి మధ్య సన్నగా నిలిచిన సమాజం ఆ త్రోవలో ప్రయాణిస్తున్నాయా? ఆలోచించవలసిన అవసరం 'గురజాడ'ను స్మరించుకొనే ప్రతి సందర్భంలోనూ ఉందనేది కాదనలేని సత్యం.
         సాహితీ లోకంలో 'గురజాడ'ను ఆధునిక, అభ్యుదయ పదాలకు పర్యాయ పదంగా ప్రశంసించటం ఎరిగిన సత్యం. కాని క్రమేణా ఈ రెండు పదాలకు 'అతి'వాదులు విపరీతార్థాలలో నిర్వచనాలు లిఖించుకుని 'గురజాడ' రచనలకు కొత్త భాష్యాలు రాస్తూ... అలా ప్రవచించిన ప్రచారకర్తలకు 'ఆయన పేరు మీదనే' పురస్కారాలందిస్తున్నారు. ఇది తిరోగమనమా? పురోగమనమా? అనేది గుర్తు చేసుకోవలసిన తరుణమిది. గురజాడ 'సత్య' అన్వేషి. 'వ్యక్తి' లేదా 'ఆదర్శ' ఆరాధకుడు కాదు. 'అడుగుజాడ- గురజాడ' అనేవారు ఈ విభజన క్రమంలో ఏ వాదానికి బద్ధులో కూడా గుర్తించుకోవలసినది ఉంది.. 'చెట్టపట్టాల్‌ పట్టుకొని/ దేశస్తులంతా నడువవలెనోరు/ అన్నదమ్ముల వలెను జాతులు/ మతము లన్నియు మెలగవలెనోరు' అనే గురజాడ 'దేశభక్తి'లో వివిధాంశాలకు విభిన్నమైన విశ్లేషణలు చేస్తూ 'వ్యక్తిగత అజెండాలతో 'దేశ' భక్తి ముసుగులో ఎవరికి వారే మతం, జాతి, కులం ట్రంప్‌ కార్డుల సహాయంగా నాయకులుగా ఎదుగుతున్న నేటికాలంలో 'గురజాడ... నీ తత్వం కాస్త గుర్తు చేయవయ్య' అని ఆవేదన చెందడంలో అర్థముందనే అనుకోవచ్చు. 'వట్టి మాటలతో' గారడీలు చేసి పదవులందుకొని 'గట్టిమేలు' తనవారికి చేసుకొంటున్న నాయకులున్న నేటి సమాజంలో గురజాడ జయంతులు, వర్థంతులు నిర్వహించుకొనే సమయంలో ఆయన నిజాయితీగా, సందేశాత్మకంగా రాసిన 'దేశభక్తి'గీతం ద్వారా వర్తమాన తరానికి అందుతున్న సందేశమేమిటి? ''యీసురోమని మనుషులుంటే' దేశమెలా బాగుపడుతుందనే రాజనీతి నీడలో కోట్లాది పేదల ఆకలి తీర్చే పనులు కన్నా కోట్లు వెచ్చించి విగ్రహాలు ఏర్పాటు వెనుక 'గురజాడ' అడుగుజాడలను విస్మరిస్తున్న విధానం విషాదం కాదా! దేవుడు చేసిన మనుషుల్లారా! మనుషులు చేసిన దేవుళ్ళారా మీ పేరేమిటని ప్రశ్నించిన 'గురజాడ'ను ఆ దృక్కోణం నుంచి సమాజానికి ఓ విభిన్నమైన పంథాను నేటి తరానికి అందించే దిశగా కృషి చేయవలసిన అవసరం ఉంది. గురజాడ సాహిత్యంలోని హేతువాదం, భాషావాదం, ఆశావాదం, మానవతావాదం, మనిషివాదం భావితరాలకు అందించాల్సిన తరుణం వచ్చింది.
దేశమనియెడి దొడ్డ వృక్షం
ప్రేమలను పూలెత్తవలెనోయి
నరుల చమటను తడిసి మూలం
ధనం పంటలు పండవలెనోయి !

తెలుగు భాషను క్రమేపి కనుమరుగు చేస్తున్న నేటి ప్రభుత్వాలకు తెలుగు భాషామాధుర్యం. చరిత్రలను 'మహాకవి గురజాడా... కాస్త గుర్తు చేయండి!'.
 

- భమిడిపాటి గౌరీశంకర్‌
9492858395