Jun 23,2022 07:47

ముంబయి : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ముదిరింది. సిఎం పదవిపై తనకు మోజు లేదన్న ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే..రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అధికారిక నివాసం 'వర్షా'ను ఖాళీ చేసి ఆయన సొంత గృహమైన 'మాతోశ్రీ'కి చేరుకున్నారు. ఆయన నివాసానికి వస్తున్నారని తెలియగానే భారీ సంఖ్యలో శివసేన శ్రేణులు, మద్దతుదారులు అక్కడి చేరుకుని ఉద్ధవ్‌కు సంఘీభావంగా నినాదాలు చేశారు. అక్కడకు చేరుకున్న ఉద్ధవ్‌.. అభిమానుల్ని పలకరించి.. ఇంట్లోకి వెళ్లారు. ఆయన కుమారుడు, రాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే కూడా అక్కడే ఉన్నారు. అయితే అంతకముందు మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై తొలిసారి ఫేస్‌బుక్‌ లైవ్‌ నిర్వహించిన ఉద్ధవ్‌.. చాలా ఎమోషనల్‌ అయ్యారు. సొంత పార్టీ నేతలే తనను ముఖ్యమంత్రిగా వద్దనుకుంటే.. ఆ విషయం తనతో చెప్పాలని అన్నారు. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. బాలాసాహెచ్‌ కుమారుడి..తాను పదవి కోసం పాకులాడనని, మీరు రాజీనామా చేయాలని కోరుకుంటే.. రాజీనామా చేసి.. తన సొంతింటికి వెళ్లడానికి సిద్ధమేనని రెబల్స్‌ ఎమ్మెల్యేలనుద్ధేశించి వ్యాఖ్యలు చేశారు. అనంతరమే ఆయన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి సొంతింటికి వెళ్లిపోయారు. కాగా, ఉద్ధవ్‌ కరోనా బారిన పడిన సంగతి విదితమే. ఈ పరిణామాలతో ఆయన అధికారిక నివాసాన్ని వీడి వెళ్లిపోయారు.

 <